దసరా అంటే.. చెడుపై మంచి విజయానికి ప్రతీక.. మరికొన్ని చోట్ల ప్రకృతిని ఆరాధించే గిరిజన ఆచారాలు.. రాజవైభవాన్ని చాటే రథయాత్రలు! ప్రాంతాలు వేరు.. ఆచారాలు వేరు.. వేడుకల తీరు వేరు.. కానీ అంతర్లీనంగా కనిపించేది మాత్రం భారతీయ సంస్కృతిలోని వైవిధ్యం, ఐక్యత. కళలు, కుటుంబ అనుబంధాలు, సామాజిక జీవనం.. ఇలా ఎన్నో కోణాలను తనలో ఇముడ్చుకున్న దసరా పండుగ దేశమంతటా కొత్త శోభను నింపుతోంది. చెడుపై మంచి సాధించిన విజయాన్ని చాటుతూనే, తరతరాల వారసత్వాన్ని గుర్తుచేస్తున్న దసరా అంటే.. సంబరాలకే కాదు, సమానత్వం, సౌభ్రాతృత్వం, మహిళా శక్తికి, గౌరవానికి ప్రతీక. దేశంలోని వివిధ ప్రాంతాల్లో దసరా వేడుకలు ఎలా జరుగుతాయో తెలుసుకుందాం..
పండుగలంటే మన జీవితంలో కాసేపు ఆగి, మనల్ని మనం చూసుకునే సందర్భాలు. నిత్య జీవితపు ఉరుకులు పరుగులు, పని ఒత్తిళ్లు, ఆర్థిక ఆందోళనల మధ్య కొట్టుమిట్టాడే మనిషికి పండుగ ఒక చిన్న విరామాన్ని ఇస్తుంది. కుటుంబాన్ని దగ్గర చేస్తుంది. బంధాలను గుర్తుచేస్తుంది. పాత పరిచయాలను మళ్లీ పలకరిస్తుంది. ఇంటి గడపకు కొత్త రంగు తెస్తుంది. వంటింటి నుంచి వీధి వరకు ఒక ప్రత్యేకమైన సందడిని తీసుకొస్తుంది. అలాంటి పండుగల్లో ‘దసరా’కు ప్రత్యేక స్థానం ఉంది. శరన్నవరాత్రులతో మొదలై విజయదశమితో ముగిసే ఈ వేడుక.. మనిషి జీవన విధానంతో, కుటుంబ వ్యవస్థతో, గ్రామీణ సంస్కృతితో, కళలతో విడదీయలేని సంబంధాన్ని ఏర్పరచుకుంది.
మనదేశంలో జరుపుకునే పండుగల్లో ముఖ్యమైనది దసరా. ప్రకృతిని ఆరాధిస్తూ.. చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతం విజయదశమి. మహిషాసురుడిని సంహరించిన దుర్గాదేవి విజయానికి గుర్తు, పాండువులు అజ్ఞాతం వీడి జమ్మిచెట్టుపై ఉంచిన ఆయుధాలను తీసుకొని, యుద్ధం చేసి విజయం సాధించారని.. ఇలా అనేక కథలు ఉన్నాయి. ఇలాంటి పండుగలు ఎంతో సుహృద్భావ, సహోదర భావంతో జరుగుతాయి. ఇతివృత్తం ఏదైనా గత కాలపు సంస్కృతిని తెలుసుకోవడానికి పండుగలు ఓ ఆధారం. మనం నిత్యం జరుపుకునే పండుగలు వ్యవసాయం, పశుపోషణ వంటి వాటికి సంబంధించినవి. కొన్ని ప్రకృతిపై మానవుడు సాధించిన విజయానికి గుర్తుగా ఉంటాయి. సామూహిక జీవనం, ఆరోగ్య సూత్రాలు, సంస్కృతి, నైతిక విలువలు వంటి అంశాలు పండుగలతో ముడిపడి వుంటాయి. వీటన్నింటినీ పూర్తిగా విడదీసి చూడటం కష్టమే. ఇవన్నీ మన సంస్కృతిలో భాగంగానే చెప్పుకోవచ్చు.

శ్రమకు గౌరవం.. ఆయుధ పూజ
దసరా రోజున చేసే ఆయుధ పూజ వెనుక పెద్ద జీవన తత్వమే ఉంది. గతంలో వ్యవసాయ పనిముట్లకు పూజ చేసేవారు. ఇప్పుడు ఆ స్థానంలో యంత్రాలు, కంప్యూటర్లు, వాహనాలు, వ్యాపార పరికరాలు వచ్చాయి. రూపం మారినా భావం ఒక్కటే. మన జీవనోపాధికి తోడ్పడే శ్రమ సాధనాల్ని గౌరవించడమే ఈ ఆచారం ఉద్దేశం.
స్త్రీలు పండుగకు మరో శక్తి
స్త్రీశక్తి సామర్థ్యాలను లోకానికి చాటే విశేషమైన పండుగ విజయదశమి. దసరా పండుగలో మహిళల పాత్ర ఎంతో కీలకం. మహిళల ఆధ్వర్యంలో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. పాటలు, నృత్యాలు, కోలాటాలు, పిండి వంటలు, హస్తకళా ప్రదర్శనలు వంటి కార్యక్రమాల ద్వారా మహిళలు తమ ప్రతిభను ప్రదర్శిస్తారు. శక్తి స్వరూపిణిగా, ఆదిపరాశక్తిగా కీర్తించబడే మహిళ.. నేడు తనను తాను రక్షించుకోవడానికి, తన ఉనికిని చాటుకోవడానికి పోరాటాల్లోకి రావాల్సి వస్తోంది. భూమిని తల్లిగా, శక్తిగా భావించే ఈ నేలలో స్ర్తీలు అభద్రతా భావానికి గురికావడం సభ్య సమాజానికి అవమానకరం. అన్యాయాన్ని ఎదిరించి, పోరాడే శక్తిగా స్ర్తీని అభివర్ణించడం దసరా పండుగలో మనం చూడొచ్చు. పురాణగాథల్లో చెడుపై పోరాడిని ఆమె ధీరత్వాన్ని కొనియాడుతుండటం తెలిసిందే. వాస్తవిక ప్రపంచంలో అదే స్ర్తీని ఒక అబలగా, వంటింటికే పరిమితమైన వ్యక్తిగా, పురుషాధిక్యత ప్రదర్శిస్తుంటారు. అన్యాయాన్ని ఎదిరించినా, తన అస్తిత్వాన్ని కాపాడుకోవాలని యత్నించినా ఓర్వలేనితనం అడుగడుగునా కన్పిస్తుంది. ఈ నవరాత్రుల్లో తొమ్మిది రూపాల్లో దుర్గను కొలుస్తుంటారు. అదే మహిళ విద్యాధికురాలిగా, ఉద్యోగినిగా, వ్యక్తిత్వమున్న వ్యక్తిగా, ఆర్థిక శక్తిగా రాణిస్తే ఆహ్వానించలేని మనువాద భావజాలం నడుమ నేడు జీవించాల్సి రావడం బాధాకరం.
భారతదేశంలో పండుగలంటే ఒక ప్రాంతపు చరిత్రను, ప్రజల జీవనశైలిని, కళలను, ఆహారపు అలవాట్లను, సామాజిక సంబంధాలను ప్రతిబింబిస్తాయి. అలాంటి విశిష్టత కలిగిన పండుగల్లో దసరా ఒకటి. 2026లో విజయదశమి అక్టోబర్ 20న జరగనుండగా, మైసూరు దసరా ఉత్సవాలు అక్టోబర్ 11 నుంచి 21 వరకు నిర్వహించనున్నారు.

కోల్‌కతాలో కళా వైభవం
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో దసరా ఉత్సవాలు నగరాన్ని ఒక పెద్ద కళావేదికగా మార్చేస్తాయి. వీధివీధినా ఏర్పాటు చేసే మండపాలు, వాటి అలంకరణలు, విద్యుత్ దీపాల కాంతులు, విగ్రహాల రూపకల్పన సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. ప్రతి మండపం ఒక ప్రత్యేక ఇతివృత్తంతో రూపొందడం ఇక్కడి ప్రత్యేకత. చారిత్రక కట్టడాల నుంచి పర్యావరణ పరిరక్షణ, సామాజిక సమస్యల వరకు అనేక అంశాలు మండపాల రూపంలో ఆవిష్కృతమవుతాయి. శిల్పకళాకారుల సృజనాత్మకత, అలంకరణల వైవిధ్యం ఈ ఉత్సవాలకు అంతర్జాతీయ గుర్తింపును తెచ్చిపెట్టాయి. విజయదశమి నాడు నిర్వహించే సిందూర్ ఖేలా మరో ప్రత్యేక ఆకర్షణ. వివాహిత మహిళలు దుర్గాదేవికి సింధూరం సమర్పించిన అనంతరం ఒకరికొకరు సింధూరం పూసుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకుంటారు.

ఢిల్లీలో రావణ దహనం
దేశ రాజధాని ఢిల్లీలో దసరా వేడుకలకు రామ్‌లీలా ప్రత్యేక గుర్తింపు. రామాయణంలోని ముఖ్య ఘట్టాలను నాటకరూపంలో ప్రదర్శిస్తారు. సంప్రదాయ వస్త్రధారణ, రంగస్థల అలంకరణలు, సంభాషణలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. విజయదశమి రోజున రావణుడు, కుంభకర్ణుడు, మేఘనాథుడి భారీ దిష్టిబొమ్మలను దహనం చేయడం ఉత్సవాల్లో ప్రధాన ఘట్టం. బాణసంచా వెలుగులు, ప్రజల హర్షధ్వానాల మధ్య జరిగే ఈ కార్యక్రమం చెడుపై మంచి సాధించిన విజయాన్ని సూచిస్తుంది.
గుజరాత్లో జానపద సందడి
గుజరాత్లో నవరాత్రులు అంటేనే సంగీతం, నృత్యం, ఉత్సాహం. ముఖ్యంగా గర్బా, దాండియా నృత్యాలతో రాత్రివేళల్లో నగరాలు, పట్టణాలు కళకళలాడుతాయి. రంగు రంగుల దుస్తులు ధరించిన మహిళలు, పురుషులు వలయాకారంలో నృత్యాలు చేస్తారు. అహ్మదాబాద్ సహా పలు ప్రాంతాల్లో విజయదశమి సందర్భంగా రావణ దహనం నిర్వహించే కార్యక్రమాలూ కనిపిస్తాయి. రావణుడు, కుంభకర్ణుడు, మేఘనాథుడి దిష్టిబొమ్మలను దహనం చేస్తారు. సంగీతం, నృత్యం, సామూహిక వేడుకలు గుజరాత్ దసరాకు ప్రత్యేక శోభను అందిస్తాయి.
పంజాబ్‌లో సేవా కార్యక్రమాలు
పంజాబ్‌లో దసరా వేడుకల్లో సామూహిక భాగస్వామ్యం ప్రధానంగా కనిపిస్తాయి. నవరాత్రుల సందర్భంగా చాలామంది గీతాలాపనలతో పండుగ వాతావరణం నెలకొంటుంది. పలు ప్రాంతాల్లో సామూహిక అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తారు. పేదలకు, యాత్రికులకు అన్నదానం వంటి సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తారు. విజయదశమి నాడు రావణ దహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు.

ఛత్తీస్‌ఘడ్‌లో బస్తర్ గిరిజన సంస్కృతి వైభవం
ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ దసరా దేశంలోని ఇతర దసరా ఉత్సవాలకు భిన్నమైనది. బస్తర్‌లో ప్రధాన కేంద్రం దంతేశ్వరి దేవి ఆరాధన. దాదాపు 75 రోజులపాటు సాగే ఈ ఉత్సవం గిరిజన సంప్రదాయాలు, స్థానిక దేవతల పట్ల ప్రజలకున్న విశ్వాసాన్ని ప్రతిబింబిస్తాయి. ఈ వేడుకల్లో భారీ రథయాత్రలు, సంప్రదాయ నృత్యాలు, జానపద సంగీతం ప్రధాన ఆకర్షణలు. స్థానిక గిరిజన సమాజాలు తమ ఆచారాల ప్రకారం వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటాయి. పాట్ జాతర వంటి ఘట్టాలు, రథాన్ని లాగే కార్యక్రమాలు ఉత్సవానికి ప్రత్యేకతను తెస్తాయి. ప్రకృతి, భూమి, స్థానిక దేవతలతో గిరిజనులకు ఉన్న అనుబంధం. సామూహికంగా సాంస్కృతిక వారసత్వాన్ని వారు కాపాడుకుంటున్నారు. గిరిజన జీవన విధానానికి సజీవ ప్రతిరూపం.
చెన్నైలో బొమ్మల కొలువు..
తమిళనాడులో బొమ్మల కొలువు ఏర్పాటు చెప్పుకోదగ్గది . చెన్నైలో అనేక ఇళ్లలో మెట్ల వరుసలపై పురాణ పాత్రలు, జంతువులు, గ్రామీణ జీవన దృశ్యాలు, ఆధునిక సమాజాన్ని ప్రతిబింబించే బొమ్మలను అందంగా అమర్చుతారు. ప్రతి కుటుంబం తమ అభిరుచికి అనుగుణంగా కొలువును అలంకరిస్తుంది. మహిళలు, పిల్లలు కలిసి కొలువు ఏర్పాటు చేయడం, బంధుమిత్రులను ఆహ్వానించడం, పాటలు పాడడం, ప్రసాదాలు పంచుకోవడం ఈ వేడుకలో భాగం. పెద్దల నుంచి పిల్లలకు సాంస్కృతిక వేదికగా బొమ్మల కొలువు నిలుస్తుంది.
హిమాచల్ ప్రదేశ్‌లో కులు సందడి
హిమాచల్ ప్రదేశ్‌లోని కులు దసరా మరో ప్రత్యేక ఉత్సవం. దేశంలోని అనేక ప్రాంతాల్లో విజయదశమితో దసరా ముగుస్తుంటే, కులులో మాత్రం విజయదశమి రోజునే ప్రధాన వేడుకలు ప్రారంభమవుతాయి. అనంతరం సుమారు వారం పాటు ఉత్సవాలు కొనసాగుతాయి. రఘునాథుడిని రథంపై ఊరేగించడం ఈ వేడుకల్లో ప్రధాన ఘట్టం. చుట్టుపక్కల గ్రామాల నుంచి స్థానిక దేవతల పల్లకీలు, విగ్రహాలను తీసుకొస్తారు. సంప్రదాయ వాయిద్యాలు, జానపద నృత్యాలు, రంగురంగుల వస్త్రధారణతో ఉత్సవ ప్రాంగణం సందడిగా మారుతుంది. పర్వత ప్రాంతపు సంస్కృతి, స్థానిక దేవతల ఆరాధన, సామూహిక భాగస్వామ్యం కులు దసరాను ప్రత్యేకంగా నిలబెడతాయి. ఈ వేడుకలను తిలకించేందుకు దేశవిదేశాల నుంచి పర్యాటకులు తరలివస్తారు.

మైసూరులో రాజవైభవ వేడుకలు..
దేశవ్యాప్తంగా దసరా ఉత్సవాలకు ప్రత్యేక గుర్తింపు ఉంటే, కర్ణాటకలోని మైసూరు దసరాకు మరింత విశిష్ట స్థానం ఉంది. రాజభవన వైభవం, ప్రజా ఉత్సవాలు, కళా ప్రదర్శనలు కలగలిసిన ఈ వేడుకలు నాలుగు శతాబ్దాలకు పైగా చరిత్రను కలిగి ఉన్నాయి. వడయార్ రాజవంశ పాలనలో విశేష ప్రాచుర్యం పొందిన ఈ ఉత్సవం నేడు కర్ణాటక రాష్ట్ర పండుగగా కొనసాగుతోంది. రాజభవనాన్ని విద్యుద్దీపాలతో అలంకరించినప్పుడు కనిపించే దృశ్యం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. సాంస్కృతిక కార్యక్రమాలు, సంగీత కచేరీలు, నృత్య ప్రదర్శనలు, పుష్ప ప్రదర్శనలు, ఆహార మేళాలు నగరమంతా పండుగ వాతావరణాన్ని నింపుతాయి. జంబూ సవారీ అత్యంత ఆకర్షణీయమైన ఘట్టం. చాముండేశ్వరి అమ్మవారి ఉత్సవమూర్తిని బంగారు అంబారీలో ప్రతిష్ఠించి, అలంకరించిన ఏనుగుపై ఊరేగిస్తారు. ఈ ఊరేగింపులో సంప్రదాయ వాయిద్య బృందాలు, జానపద కళాకారులు, వివిధ జిల్లాల శకటాలు, సాంస్కృతిక ప్రదర్శనలు భాగమవుతాయి. రాజభవనం నుంచి ప్రారంభమయ్యే ఈ ఊరేగింపు నగర వీధుల గుండా సాగుతూ ప్రజలకు కనువిందు చేస్తుంది. దసరా ఉత్సవాలు అక్టోబర్ 11 నుంచి 21 వరకు జరగనున్నాయి. జంబూ సవారీ అక్టోబర్ 21న నిర్వహించనున్నారు. అక్టోబర్ 18, 19 తేదీల్లో మైసూరులో కంబళ పోటీలు తొలిసారిగా నిర్వహిస్తున్నారు.

మన రాష్ట్రంలో వైవిధ్యభరితం...
ఆంధ్రప్రదేశ్‌లో ఈ దసరా వైభవానికి ఓ ప్రత్యేకత ఉంది. ప్రాంతం మారితే ఆచారం, దేవత, ఉత్సవం రూపం మారుతుంది. కానీ పండుగ వెనుక ఉన్న ప్రజల అనుబంధం మాత్రం మారదు.
కోస్తాంధ్ర : విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ నవరాత్రి ఉత్సవాలు, పట్టణాల్లో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలు సామాజిక చైతన్యాన్ని నింపుతాయి. రెండో మైసూర్ గా పిలుస్తున్న నూజివీడులో చరిత్రను చాటే ఉత్సవ వైభవం జరుగుతుంది. సుమారు 113 ఏళ్లకు పైగా చరిత్రతో 2026లో 74వ వార్షిక దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఉత్సవ కమిటీలు కృషిచేస్తున్నాయి. దసరా అంటే కృష్ణాజిల్లా మచిలీపట్నంలో ముందుగా గుర్తుకు వచ్చేది శక్తి పటాల ఊరేగింపు. కోల్‌కత తర్వాత మచిలీపట్నంలోనే దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా 11 రోజులపాటు నగరంలో ఊరేగిస్తారు.
గోదావరి జిల్లాలు: కోనసీమ పచ్చని పొలాల మధ్య గ్రామదేవతల కొలువులు, ఇళ్లలో ఘుమఘుమలాడే పిండివంటలు పల్లె పరిమళాలను తెస్తాయి. ఉద్యోగాలరీత్యా దూర ప్రాంతాల్లో ఉన్న కుటుంబ సభ్యులంతా సొంతూరికి చేరి, పెద్దలతో గడిపే అరుదైన సామాజిక కలయిక ఇది. అమలాపురంలో చెడి తాళింకానాప్రదర్శనలు నిర్వహిస్తుంటారు. ఇప్పటికే ఆయా వీధులకు చెందిన యువకులు, పెద్దలు భద్రపరిచిన బాణాకర్రలు, కత్తులు, యుద్ధసామగ్రికి ఆయుధ పూజలు నిర్వహించి సాధన ప్రారంభించారు. అయిదేళ్ల బాలబాలికల నుంచి 80 ఏళ్ల వృద్ధుల వరకు ప్రదర్శించడం ప్రత్యేకత. గత కొన్నేళ్లుగా మహిళలు కూడా దీనిపై ఆసక్తి పెంచుకుని సాధన చేయడం విశేషం.
రాయలసీమ: స్థానిక దేవతల జాతరలు, సామూహిక పూజలు, గ్రామమంతా కలిసి జరుపుకునే వేడుకలతో సందడి కనిపిస్తుంది. పొద్దుటూరులో భేతాళ నృత్యాలు, విచిత్ర వేషధారణలు ఆకాశంలో తారాజువ్వలు, అవ్వాయి సువ్వాయిల పేలుళ్లు ఇలా ఒకటేమిటి వైభవమంతా ఇక్కడే అన్నట్లుగా వేడుకలు సాగుతాయి.
ఉత్తరాంధ్ర: విజయనగరం పైడితల్లి అమ్మవారి జాతర వంటి స్థానిక ఉత్సవాలు, జానపద కళారూపాలు ప్రాంతీయ సంస్కృతికి అద్దం పడతాయి.
పండుగల అసలైన సార్థకత వాటి వైభవంలోనే కాదు.. అవి అందించే విలువలను జీవితంలో పాటించడంలో ఉంది. సమాజంలో అసమానతలు తొలగిపోవాలి. ప్రజల మధ్య పరస్పర గౌరవం పెరగాలి. కళలు, సంప్రదాయాలు, భాషలు, ప్రాంతీయ సంస్కృతులు పరిరక్షించబడాలి. భారతదేశ దసరా ఉత్సవాల వైవిధ్యం మనకు నేర్పే ముఖ్యమైన పాఠం ఇదే. సంప్రదాయాలు ఎన్నో.. సంబరాలు ఎన్నో.. సమానత్వ భావనే ఆశయంగా మారాలి. అదే దసరా పండుగకు శాశ్వత స్ఫూర్తి.

మానవీయ విలువలు పెంపొందించాలి
పండుగలు ప్రజల మధ్య ప్రేమాభిమానాలను, సామాజిక ఐక్యతను, సాంస్కృతిక వైవిధ్యాన్ని పెంపొందించేలా సామూహిక చైతన్యాన్ని పెంపొందించే వేదికలుగా నిలవాలి. మతపరమైన విభజనలు కోరే వ్యక్తులు, సంస్థల చర్యలతో పండుగల్లో మతతత్వం, వ్యాపార ధోరణులు పెచ్చరిల్లుతూ ప్రజల మధ్య వైరుధ్యాలు, వైషమ్యాలు తలెత్తుతున్నాయి. సాంస్కృతిక కలుషితంతో నేడు కొన్ని పండుగలు మతతత్వం, మనువాద భావజాలం, రాజకీయ ఆధిపత్య ప్రదర్శనలకు సాధనాలుగా మారడం ఆందోళనకరం. శాస్త్రీయ దృక్పథం, సమానత్వం, మానవీయ విలువలకు ప్రాధాన్యమివ్వాల్సిన సమాజంలో కులవివక్షను, మూఢనమ్మకాలను సమర్థించే ధోరణులు ఇంకా కొనసాగుతున్నాయి. మత విశ్వాసాలను వ్యక్తిగత అంశంగా గౌరవించాల్సింది పోయి, వాటిని ఇతరులపై ఆధిపత్యం చెలాయించడానికి, మత ఉద్రిక్తతలను రెచ్చగొట్టడానికి ఉపయోగించడం ప్రజాస్వామిక స్ఫూర్తికి విరుద్ధం. మరోవైపు, పండుగలను కార్పొరేట్ వ్యాపార సంస్థలు వినియోగ సంస్కృతిని విస్తరించుకునే మార్కెట్ అవకాశాలుగా మార్చుకుంటున్నాయి. ఆర్భాటాలు, అనవసరపు ఖర్చులు, ఖరీదైన కొనుగోళ్లతో పండుగల అసలు సామాజిక ప్రయోజనం పక్కదారి పడుతోంది. పండుగల పేరుతో జరిగే కాలుష్యం, ఆహార వృథా, ఆర్థిక అసమానతలు కూడా సామాజిక బాధ్యతను గుర్తుచేస్తున్నాయి. అభ్యుదయ దృక్పథం అంటే సంప్రదాయాలను పూర్తిగా తిరస్కరించడం కాదు; వాటిలోని మానవీయ విలువలను స్వీకరిస్తూ, వివక్షకు, మూఢనమ్మకాలకు, దోపిడీకి తావులేని మార్పును ఆహ్వానించడం. శాస్త్రీయ ఆలోచన, లింగ సమానత్వం, కులమత సామరస్యం, పర్యావరణ పరిరక్షణ, పేదల పట్ల బాధ్యత పండుగల నిర్వహణలో అంతర్భాగం కావాలి. అప్పుడే పండుగలు మతతత్వానికి, మనువాద ఆధిపత్యానికి, వ్యాపార లాభాపేక్షకు పరిమితం కాకుండా సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం, మానవ ప్రగతిని చాటిచెప్పే ప్రజాస్వామిక సాంస్కృతిక వేడుకలుగా రూపాంతరం చెందుతాయి.:
ప్లాస్టిక్‌ను తగ్గించి, ప్రకృతికి హాని కలగకుండా సహజ సిద్ధమైన వస్తువులతో వేడుకలను జరుపుకోవడం నేటి అవసరం. దసరా వస్తుంది.. వెళుతుంది. కానీ అది మన జీవితంలో మిగిల్చే జ్ఞాపకాలు చాలాకాలం ఉంటాయి. ఈ విజయదశమి మన ఇళ్లలో దీపాలు వెలిగించడమే కాదు.. మనసుల్లోనూ వెలుగు నింపాలి. మన బంధాలను బలపరచాలి. సమాజంలో మానవత్వాన్ని చాటాలి. అదే దసరా అసలైన వైభవం.
యడవల్లి శ్రీనివాసరావు
9490099214








కామెంట్లు (0)