నేడు అన్నింటా విభిన్న ప్రతిభావంతులు విభిన్న ప్రతిభాపాటవాలతో అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఆత్మవిశ్వాసం, పట్టుదలతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తూ సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. శారీరక పరిమితులను అధిగమించి విద్య, క్రీడలు, కళలు, సాహిత్యం, సాంకేతిక రంగాల్లో తమదైన ముద్ర వేస్తున్నారు. అవకాశాలు, ప్రోత్సాహం అందిస్తే తామెవరికీ తీసిపోమని నిరూపిస్తున్నారు. అంగవైకల్యాన్ని ఆత్మవిశ్వాసంతో జయిస్తూ.. ప్రతిభకు వైకల్యం లేదని చాటుతున్న వారి స్ఫూర్తి అందరికీ ఆదర్శం. శారీరక పరిమితులు ఎన్నున్నా.. సంకల్ప బలం ముందు అవి చిన్నబోతాయని నిరూపిస్తున్న వారి విజయాలు ఎందరికో మార్గదర్శకం. డిసెంబర్ 3 అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం. ఈ నేపథ్యంలో వికలాంగుల ఆలోచనల్లో పదును, ఆచరణలో పట్టుదల, అసాధ్యాలను సుసాధ్యం చేసినవారి జీవితగాథలు, సమాజంలో వారు నిరంతరం ఎదుర్కొంటున్న ఘర్షణలు, వివక్ష, ఈతిబాధలను తెలుపుతూ సాగేదే ఈ వారం అట్టమీది కథ.
ప్రపంచ జనాభాలో 15 శాతం మంది లేదా కనీసం వంద కోట్ల మంది ఏదో ఒక రకమైన వైకల్యంతోనే ఉంటున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఒ) వైకల్యంపై విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. పేదరికం వల్ల ఉత్పన్నమవుతున్న వైకల్యం భారత్ లాంటి దేశాల్లో మరింత అధికం. 2011 నాటికే దేశంలో తక్కువలో తక్కువుగా 7-10 కోట్ల మంది వికలాంగులు ఉన్నట్టు క్షేత్రస్థాయి గణాంకాలు చెబుతున్నాయి. ఇది మన జనాభాలో పెద్ద భాగమే. అయినా వారిని ప్రధాన స్రవంతిలో ఎక్కడా చూడం. అంతమాత్రాన వీళ్లంతా మన మధ్యలో లేరని కాదు. ఒక జాతిగా, దేశంగా మనం వారిని ప్రధాన స్రవంతిలో కలపడంలో నిర్లక్ష్యం వహించాం.
నేటికీ పట్టిపీడిస్తున్న సమస్య
ప్రపంచాన్ని నేటికీ వైకల్య సమస్య పట్టిపీడిస్తోంది. మానవ శరీరంలో దైనందిక కార్యక్రమాలు చేసుకునేందుకు అవసరమైన ఏ అవయవం పని చేయకపోయినా అతను వికలాంగుడే. ఐక్యరాజ్యసమితి కూడా దీన్నే ధ్రువీకరించింది. అయితే వైకల్యం అనే పదానికి వివిధ దేశాలు పలు పలు విధాలుగా నిర్వచనాలు ఇచ్చుకున్నాయి. చైనా, బ్రిటన్ వంటి దేశాలు మంచి నిర్వచనాలు ఇవ్వడమే కాకుండా సంక్షేమానికీ పెద్ద పీట వేశాయి. కేవలం వైద్యుని నిర్ధారణతో మాత్రమే భారతదేశంలో వైకల్యాన్ని చూస్తున్నారు. 40 వైకల్య శాతం కన్నా ఎక్కువగా ఉంటేనే ఇక్కడ ప్రభుత్వ పథకాలకు అర్హులు. ఇది ఎంతోమంది ఎదుగుదలకు పెద్ద అవరోధంగా ఉంది. వైకల్యాన్ని పలు రకాలుగా విభజించి చూడొచ్చు. వైకల్య బాధితులను మన దేశంలో వికలాంగులు, విభిన్న ప్రతిభావంతులు, ప్రత్యేక అవసరాల వ్యక్తులు, దివ్యాంగులు అని పిలుస్తున్నారు.
వైకల్య రకాలు
భారత్‌లో వికలాంగుల చట్టం - 2016 ప్రకారం 21 రకాల వైకల్యాలను గుర్తించారు. అవి శారీరక వైకల్యం, వినికిడి వైకల్యం, అంధత్వం, తక్కువ చూపు వైకల్యం, మేధోపర వైకల్యం, మరుగుజ్జుతనం, కుష్టువ్యాధి, మెదడు పక్షవాతం. ఆటిజం, మానసిక ప్రవర్తన వైకల్యం, కండరాల బలహీనత, తీవ్రస్థాయి నరాల సంబంధిత వైకల్యం, ప్రమాణ స్థాయిలో నేర్చుకునే శక్తి తక్కువుగా ఉండే వైకల్యం, బహుళ వైకల్యం, మాటలో స్పష్టత లేకపోవడం, తలసేమియా, హిమోఫిలియా, సికిల్ సెల్ ఎనీమియా, పార్కిన్సన్, యాసిడ్ బాధిత వైకల్యం. దేశాల వారీగా చూస్తే అమెరికాలో 12, యునైటెడ్ కింగ్ డమ్‌లో 18, జర్మనీలో 9, శ్రీలంకలో 5, పాకిస్తాన్లో 9 శాతం వరకూ విభిన్న ప్రతిభావంతులు ఉన్నారు. భారత్‌లో ఈ సంఖ్య 2.1 శాతం (2 కోట్లా 19 లక్షల మంది) గా ఉంది.
అవరోధాలను ఎదిరించి, స్ఫూర్తి కెరటాలుగా నిలిచి..
నాటి ఐన్‌స్టీన్, న్యూటన్, లూయిస్ బ్రెయిలీ, హెలెన్ కెల్లర్, స్టీఫెన్ హాకింగ్ నుంచి నిక్ ఉయిచిచ్, ఇరా సింఘాల్, సుధాచంద్రన్ వరకూ.. ఇలా చాలామంది వికలాంగుల జీవితాలను పరికించి చూస్తే.. స్ఫూర్తి ఎగసిపడుతుంది. వారంతా పట్టుదలకు మారుపేరు. కఠోర శ్రమకు, ఆదర్శ జీవితాలకూ వన్నెలద్దిన వారు. సభ్య సమాజం నుంచి ఎన్ని ఈసడింపులు ఎదురైనా ఆత్మవిశ్వాసమే ఊపిరిగా అనితర సాధ్యమైన మార్గంలో పయనిస్తూ నూతన శకానికి నాంది పలికినవారు.
విశ్వాన్ని శోధించిన స్టీఫెన్ హ్యాకింగ్
కృష్ణబిలాలు, గ్రహాంతర వాసులు, క్వాంటమ్ మెకానిక్స్, టైమ్ ట్రావెల్.. మొత్తానికి ఓ కాలం చరిత్రను కథలా చెప్పేసిన మహా శాస్త్రవేత్త స్టీఫెన్ హ్యాకింగ్. ఆయన విశ్వాన్నంతటినీ శోధించింది రెండు చక్రాల కుర్చీలో కూలబడే. మాట పెదవి దాటలేనంతగా వైకల్యం కుదించేసినా స్టీఫెన్ కృత్రిమ పరికరంతోనే శాస్త్ర ప్రపంచాన్ని కుదిపేసే సిద్ధాంతాన్ని వెలువరించారు. మెదుడులోనే విశ్వ విద్యాలయాన్ని తెరిచేసి విశ్వ రహస్యాల్ని శోధించాడు. ఆయన జీవితం ఆధారంగా తీసిన ‘ది థియరీ ఆఫ్ ఎవ్రీథింగ్’ చిత్రానికి ఆస్కార్ అవార్డులు వస్తే లక్షలాది మందిలో వైకల్యాన్ని తరిమేసే ఆత్మవిశ్వాసం రివార్డు అయ్యింది. ఆయన 1963లో తన 21వ జన్మదినం తరువాత అత్యంత అరుదైన యామ్యోట్రోఫిక్ లేటరల్ సెలరోసిస్ అనే మోటార్ న్యూరోన్ వ్యాధి బారిన పడ్డాడు. లూ గెహ్రిగ్ వ్యాధిగా కూడా పిలిచే దీనితో ఆయన తీవ్ర శారీరక అచేతనతో పూర్తి పక్షవాతానికి గురయ్యారు. ఆక్స్‌ఫర్డ్‌లో చివరి ఏడాది చదువుతుండగా ఓసారి మెట్లపై తూలిపడినపుడు ఈ వ్యాధి ఉన్నట్టు తెలిసింది. అయినప్పటికీ వెరవక విశ్వాంతరాలను శోధించారు.
పడి లేచిన కెరటం.. సుధా చంద్రన్
సుధా చంద్రన్ భారతీయ భరత నాట్య నృత్యకారిణి, నటి. తాను 1981 జూన్ నెలలో తమిళనాడులోని త్రీచీ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక కాలును కోల్పోయింది. అనంతరం కృత్రిమ కాలితో నాట్య ప్రదర్శనలు ఇచ్చి అందరినీ విస్మయపరిచింది. వేల ప్రదర్శనలతో వందలాది అవార్డులను అందుకుంది. ఆమె తెలుగులో తన జీవితగాథను ఆవిష్కరిస్తూ మయూరి సినిమాతో నట ప్రస్థానాన్ని ప్రారంభించింది. అనేక సినిమాలు, టెలివిజన్ ధారావాహికల్లో నటించింది. ఆమెది కేరళలోని కన్నూర్ ప్రాంతం. పేద తమిళ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి పట్టుదలతో ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించింది.
రవీంద్ర జైన్
చాలా చిన్న వయస్సులోనే రవీంద్ర జైన్ పాడటం ప్రారంభించి, భారతీయ సంగీత పరిశ్రమలో చేరి తన అభిరుచిని కొత్త శిఖరాలకు తీసుకెళ్లారు. 1970వ దశకంలోని అత్యంత ప్రముఖ సంగీత దర్శకులలో ఒకరిగా ఎదిగారు. ఆయన తన పని పట్ల ఎంతో అంకితభావంతో ఉండేవారు. ఒక రికార్డింగ్ సెషన్లో ఆయన తండ్రి మరణించినప్పటికీ, రికార్డింగ్‌లు పూర్తయ్యేవరకు రికార్డింగ్ గదిని విడిచిపెట్టలేదు. హిందీ సినిమాలకు అనేక 'సూపర్-హిట్' పాటలను స్వరపరచడమే కాకుండా, ఎన్నో ప్రైవేట్ ఆల్బమ్‌లను కూడా విడుదల చేశారు, అవి చాలా మంది ప్రశంసలు పొందాయి.
మార్గదర్శి.. హెలెన్ కెల్లర్
హెలెన్ కెల్లర్ అమెరికన్ రచయిత్రి, రాజకీయ కార్యకర్త, లెక్చరర్. బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని పొందిన మొదటి చెవిటి, అంధురాలు. ది మిరాకిల్ వర్కర్ అనే నాటకం, సినిమాలో ఆమె కథ ప్రముఖంగా చిత్రీకరించబడింది, మై రిలిజియన్తో సహా మొత్తం పన్నెండు పుస్తకాలను రాసింది. అమెరికాలో సోషలిస్ట్ పార్టీ సభ్యురాలిగా కొనసాగింది. వికలాంగులకు విశేష సేవలు అందించింది.
మరికొందరు..
జర్సికా పట్టుదలకు మారుపేరు. పుట్టుకతోనే ఆమెకు చేతులు లేవు. అయితేనేం కాళ్లతో విమానం నడిపిన ఏకైక పైలెట్‌గా గిన్నిస్ రికార్డు సాధించింది. గద్వాల రాజు ప్రమాదంలో చేతి వేళ్లను పోగొట్టుకున్నా, కుంచె పట్టుకుని ఆత్మస్థైర్యంతో అంగవైకల్యం శరీరానికేగానీ మనసుకు కాదంటూ చాటి చెప్పాడు. పోలియోతో రెండు కాళ్లూ పోగొట్టుకున్న పద్మప్రియ రంగస్థలంపై అందరినీ మెప్పించి రాష్ట్రపతి అవార్డుతో సహా ఎన్నో అవార్డులను గెలిచి ఆదర్శంగా నిలిచింది. విజయవాడకు చెందిన అంధురాలైన సుబ్బలక్ష్మి లలిత సంగీతంలో ఉవ్వెత్తున ఎగిసి పడింది. మరో కళాకారిణి స్వాతి చూపులేకపోయినా యాంకరింగ్ చేస్తూ టీవీ ఛానళ్లలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. అంధత్వాన్ని జయించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి జిల్లాకు చెందిన గిరిజన బిడ్డ రవణి క్రికెట్లో నేడు మెరుపులు మెరిపిస్తోంది. వీరంతా ఎందరికో ఆదర్శం. సమాజం, ప్రభుత్వాల నుంచి సరైన మద్దతు, ప్రోత్సాహం దొరికితే ఇటువంటి మాణిక్యాలు వాడవాడలా మెరుస్తాయి.
మూల కారణమేంటి?
అంగ వైకల్యం, పేదరికం, అనారోగ్యం వీటి మధ్య అంతర్గత సంబంధం ఉంది. పేదరికం వల్ల పోషకాహారం అందుబాటులో ఉండదు. ఇది అనారోగ్యానికి, ఆపై అంగవైకల్యానికి దారితీస్తుంది. గర్భిణులకు ఆరోగ్య వసతులు లేకపోవడం కూడా వైకల్య శిశువుల జననానికి ఆస్కారమిస్తాయి. ఐరన్, అయోడిన్, పోలిక్ యాసిడ్ లోపాలు, వ్యాధులు, ప్రమాదాలు అంగవైకల్యానికి కారణాలుగా నిలుస్తున్నాయి. వీటిని అధిగమిస్తేనే వైకల్య రహిత సమాజం సుసాధ్యం. 1991 నుంచి నూతన ఆర్థిక విధానాలను మన దేశంలో ప్రభుత్వాలు శరవేగంగా అమలు చేస్తున్నాయి. ఫలితంగా రోజురోజుకూ ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గిపోతోంది. మరోవైపు నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పౌష్టికాహారం తీసుకోలేని కుటుంబాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఫలితంగా పుట్టబోయే పిల్లలు వైకల్యం బారిన పడుతున్నారు. జనాభాలో కేవలం 46.37 శాతం మంది మాత్రమే జాతీయ ఆహార భద్రతా చట్టం పరిధిలో ఉన్నారు. మన దేశంలో 10 మంది పిల్లల్లో నలుగురు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. సరిగ్గా ఇలాంటి వారే వైకల్యులుగా మారుతున్నారు. కొన్ని వ్యాధులకు ప్రాథమిక దశలోనే చికిత్సనందిస్తే సరిపోతుంది. కానీ పేద కుటుంబాలు ఆర్థిక పరిస్థితి సరిపడక ఆసుపత్రులకు వెళ్లేందుకు మొగ్గు చూపడం లేదు. ఫలితంగా మరికొందరు అంగవైకల్యం బారిన పడుతున్నారు. ‘పేదరికం-వైకల్యం’ మధ్య సంబంధం ఉందని 2014లో వరల్డ్ డిజేబులిటీ రిపోర్టు, డబ్ల్యుహెచ్ఒ పేర్కొన్నా ఆ దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోలేదు. పేదలకు సరైన పౌష్టికాహారం, వైద్య సదుపాయాలు కల్పించడం లేదు. ఇటీవల జాతీయ ఆహార భద్రతా చట్టానికి ప్రతిపాదించిన సవరణ కూడా తీవ్ర ఆందోళన కలిగించే అంశం. ప్రస్తుతం కుటుంబ సభ్యుల సంఖ్యతో సంబంధం లేకుండా అంత్యోదయ అన్న యోజన కింద ప్రతి కుటుంబానికీ నెలకు 35 కిలోల ఆహారధాన్యాలు ఇవ్వాల్సి ఉంది. తాజా సవరణ ద్వారా ఒక్కొక్కరికీ ఏడు కిలోలు ఇవ్వాలని ప్రతిపాదించారు. ఆహార హక్కును బలోపేతం చేయడానికి బదులుగా ఈ సవరణ తీసుకురావడం దారుణం. అత్యంత పేద కుటుంబాలు, ముఖ్యంగా చిన్న కుటుంబాలు తీవ్ర ప్రభావానికి గురవుతాయి.
అమలు అంతరాలు ఎక్కడ కనిపిస్తున్నాయి?
వికలాంగులపై హింస నేటికీ కొనసాగుతోంది. వికలాంగ పిల్లలలో మూడింట ఒక వంతు నిర్లక్ష్యం లేదా హింసను (భావోద్వేగ, శారీరక లేదా లైంగికం) ఎదుర్కొంటున్నారు. సంఘర్షణలు, విపత్తులు సంభవించినప్పుడు వికలాంగులు మొదటిగా నష్టపోతున్నారు. సాంకేతిక అంశాలు ముందుకు వచ్చినప్పుడు ఆర్థిక కారణాలతో అందుకోలేకపోతున్నారు. తక్కువ ఆదాయ దేశాలలో దాదాపు సగం మంది వికలాంగులు ఇప్పటికీ సమాజ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. 60 శాతం పైచిలుకు మంది నిర్ణయాలు తీసుకోలేకున్నారు. భారతదేశం 2007లో సిఆర్పిడిని ఆమోదించింది. 2016లో వికలాంగుల హక్కుల చట్టం అమల్లోకి వచ్చింది. కానీ అమలు లోపభూయిష్టంగా ఉంది. బడ్జెట్ కేటాయింపులు వికలాంగుల జనాభాకు తగ్గ నిష్పత్తిలో లేవు. కార్యాలయాలు, రవాణా ప్రదేశాల్లో విభిన్న ప్రతిభావంతులకు అనువైన ఏర్పాట్లు లేవు. దేశవ్యాప్తంగా చెల్లుబాటయ్యే యుడిఐడి కార్డులు నేటికీ అందరికీ చేరలేదు. దేశంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం మరింత కుంటుపడింది. మత విద్వేషాలు పెరగడం మూలంగా బిజెపి పాలిత రాష్ట్రాల్లో అల్లర్లు, దాడులు పెచ్చురిల్లాయి. ఆర్ఎస్ఎస్, భజరంగదళ్, విశ్వ హిందూ పరిషత్, గో రక్షక దళాల దాడుల్లో మైనార్టీలు తీవ్రంగా గాయపడి వైకల్యం బారినపడ్డారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో పారా మిలిటరీ బలగాలు పెల్లెట్ గన్స్‌ను ఇష్టానుసారంగా ఎక్కుపెడుతుండటంతో అంగ వైకల్యం బారిన పడిన వారు క్రమేపీ పెరుగుతున్నారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో మత విద్వేషకులు దాడులకు తెగబడటంతో వైకల్యుల శాతం పెరుగుతోంది. మోడీ వికలాంగులను ‘దివ్యాంగులు’గా పిలవాలని, వారు చేయలేనిది ఏమీ లేదని వాగడాంబరాలకు పోయారు తప్పితే, వారి సంక్షేమానికి చేసిందేమీ లేదు. ఇప్పటికీ చాలా చోట్ల వికలాంగులు హేళనకు గురవుతున్నారు. ‘కుంటోడు, సొట్టోడు, గుడ్డోడు, చెవిటోడు, మెంటలోడు, పిచ్చోడు, గూనోడు, కబోది’ అన్న పేర్లతో పిలుస్తున్నారు. ఇవి విభిన్న ప్రతిభావంతులను మరింత కుంగదీస్తున్నాయి. విభిన్న ప్రతిభావంతుల గణనపై భారత్‌లో తీవ్ర వివక్ష కొనసాగుతోంది. క్షేత్ర స్థాయిలో వీరు 7 -10 శాతం ఉంటారని వికలాంగ సంఘాలు, స్వచ్ఛంద సంస్థల సర్వేలు చెబుతుంటే జనాభా లెక్కల్లో మాత్రం వీరు 2.1 శాతంగానే ఉన్నారు. నాడు జనాభా లెక్కల సమయంలో వీరి గణన సరిగా చేయలేదన్న విమర్శలు నేటికీ వినిపిస్తున్నాయి. మన దేశ విభిన్న ప్రతిభావంతుల్లో 75 శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నారు. అక్షరాస్యతా శాతం 49 గా ఉంది. విభిన్న ప్రతిభావంతులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కూడా పాలకులు సరిగా కల్పించడం లేదు. అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్న రైల్వేలో వీరిని ఉద్యోగులుగా తీసుకోవడమే లేదు. మరోపక్క ప్రయివేటు కంపెనీల్లో వీరు 0.28 శాతం మంది మాత్రమే ఉద్యోగులుగా ఉన్నారు. ఈ సంఖ్యలే వీరు సమాజానికి ఎంత దూరంగా ఉన్నారో చెప్పకనే చెబుతున్నాయి. చట్టసభల్లో వీరి ప్రాతినిధ్యం అతి స్వల్పమనే చెప్పాలి.
సిఆర్పిడికి 20 ఏళ్లు
అత్యంత ముఖ్యమైన అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల హక్కుల ఒప్పందం ఆమోదించబడి 2026 నాటికి ఇరవై సంవత్సరాలు పూర్తవుతోంది. ప్రపంచ ఆలోచనా విధానాన్ని దాతృత్వం, సంక్షేమం నుంచి హక్కుల ఆధారిత దృక్పథం వైపు మళ్లించడంలో సిఆర్పిడి విజయం సాధించినప్పటికీ, దాని అమలు ఇంకా అసమానంగానే ఉంది. అనేక దేశాలు ఇప్పటికీ వికలాంగులకు సరైన సదుపాయాలు కల్పించలేదు. స్వతంత్ర జీవనం, రాజకీయ భాగస్వామ్యం, న్యాయం పొందడం, సంస్థాగత నిర్బంధాల తొలగింపు వంటి అంశాలలో ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి. ఐక్యరాజ్యసమితి విభిన్న ప్రతిభావంతుల హక్కుల కమిటీ 2026 మార్చిలో తన 34వ సమావేశాన్ని నిర్వహించింది. ఒప్పందానికి సంబంధించి దేశాల అనుసరణను సమీక్షించింది. విభిన్న ప్రతిభావంతుల హక్కుల బాధ్యతలను ప్రభుత్వాలు ఎలా అమలు చేస్తున్నాయో పర్యవేక్షించింది. ఈ ఏడాది అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా ‘సిఆర్పిడి 20 ఏళ్లు : పురోగతిని కొనసాగిస్తూ, భవిష్యత్తును ముందుకు నడిపిస్తూ..’ అనే థీమ్‌ను నిర్దేశించుకున్నారు. వాస్తవానికి సిఆర్పిడి ఆవిర్భావానికి ముందు వైకల్యాన్ని ఒక వైద్య సమస్యగా, సమాజం దయతో చూడాల్సిన విషయంగా భావించేవారు. ఒప్పందం తరువాత దృక్పథంలో మార్పు వచ్చింది. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల డిప్యూటీ హై కమిషనర్ అవా దాబో మాటల్లో చెప్పాలంటే.. ‘గత రెండు దశాబ్దాలలో ఈ ఒప్పందం వైకల్యంపై ప్రపంచవ్యాప్త అవగాహనను మార్చింది. దాతృత్వం, సంక్షేమం నుంచి హక్కులు, సమానత్వం, సమ్మిళితం అనే అంశాలవైపు మళ్లించింది’ అని చెప్పుకొచ్చారు. ఇది చట్టపరమైన సంస్కరణలకు కొంత ప్రేరణనిచ్చింది. ప్రస్తుతం 192 దేశాలు ఈ ఒప్పందాన్ని ఆమోదించాయి. 90 శాతానికి పైగా దేశాలు విభిన్న ప్రతిభావంతుల హక్కులకు హామీ ఇచ్చే చట్టాలను రూపొందించాయి. దాదాపు 80 శాతం దేశాలు ఉద్యోగ నియామకంలో విభిన్న ప్రతిభావంతులపై వివక్షను నిషేధించాయి, 75 శాతం దేశాలు విభిన్న ప్రతిభావంత విద్యార్థుల సమన్వయానికి హామీ ఇచ్చే చట్టాలను ఆమోదించాయి. ఇది ఆచరణలో పిల్లలు, యువకులకు విద్యను అందించేందుకు, జీవనాధారాన్ని మెరుగుపరిచేందుకు దోహదపడింది. అయితే ఈ పురోగతి ఆశించిన స్థాయిలో జరగలేదు. చట్టాలు చాలా వరకూ అమలుకావడం లేదు. అంతరాలు కొనసాగుతున్నాయి. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచికలు ఈ విషయాన్నే చాటిచెబుతున్నాయి. పురోగతి నిజమే కానీ.. అది చాలా నెమ్మదిగా ఉందని ఐక్యరాజ్యసమితి హ్యూమన్ రైట్స్ అసిస్టెంట్ సెక్రటరీ జనరల్ క్లాడియా ఫ్యూంటెస్ జూలియో చెప్పారు. ‘హక్కులు కాగితం నుండి ఆచరణలోకి మారాలి’ అని పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఏం జరుగుతోంది ?
ఆంధ్రప్రదేశ్‌లో విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం కోసం 'ఇంద్ర ధనస్సు' పేరిట పలు కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఆర్టిసి బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు. వికలాంగులను ఇంటికే పరిమితం చేయకుండా విద్య, ఉపాధి, సామాజిక జీవితంలో పాల్గొనేలా చేసే ముఖ్యమైన మెట్టుగా దీన్ని కొంతమేర భావించవచ్చు. నెలకు రూ. ఆరు వేల పింఛన్ అందిస్తున్నారు. దీన్ని పెరిగిన నిత్యావసర ధరలు, పరిస్థితులకు అనుగుణంగా రూ.10 వేలకు పెంచాలన్న డిమాండ్ విభిన్న ప్రతిభావంతుల నుంచి వినిపిస్తోంది. విభిన్న ప్రతిభావంతులకు ఉపాధి కల్పన, బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ, వివాహ ప్రోత్సాహకాలు, నైపుణ్య శిక్షణలు వంటి విషయాల్లో రాష్ట్రంలో వెనుకబాటు కొనసాగుతోంది. చట్టాల అమలుతీరు సక్రమంగా లేదు.
కోడూరు అప్పలనాయుడు
9491570765








కామెంట్లు (0)