శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

న్యాయం.. రక్షణ.. జవాబుదారీతనమే మార్గం !

5 రోజుల క్రితం

sneha cs
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 22, 2026, 10:01 పూర్వాహ్నం | 6 నిమిషాల చదవడం

మహిళల భద్రత విషయంలో మంచి చట్టాలే ఉన్నాయి. అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయినా.. మహిళలపై హింసకు అడ్డుకట్ట పడటం లేదు. ఇంటి గడప నుంచి కార్యాలయాల వరకు, వీధుల నుంచి సామాజిక మాధ్యమాల వరకు మహిళలు అనేక రూపాల్లో వేధింపులు, వివక్ష, హింసను ఎదుర్కొంటున్నారు. శారీరక దాడులే కాదు.. మానసిక వేధింపులు, ఆర్థిక నియంత్రణ, లైంగిక, ఆన్‌లైన్ బెదిరింపులు కూడా మహిళల జీవనంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో మహిళలకు న్యాయం అందించడం, హింస నుంచి బయటపడిన వారికి రక్షణ కల్పించడం, నేరస్తులు శిక్ష నుంచి తప్పించుకోకుండా చూడడం అత్యంత కీలకంగా ఉండాలి. నవంబర్ 25 ‘‘మహిళలపై హింస నిర్మూలన అంతర్జాతీయ దినోత్సవం’’ సందర్భంగా ఈ కథనం.

​ అనంతపురం జిల్లా రాప్తాడు ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి క్లాస్‌‌లో కూర్చొని ఉన్న విద్యార్థినిపై ఓ వ్యక్తి బయట నుంచి వచ్చి రంపంతో దాడి చేశాడు. ఇంకోచోట పనిప్రదేశంలోనే ఓ మహిళపై అత్యాచారం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఘటనలు స్టేషన్‌ ‌లో నమోదవుతూ ఉన్నాయి. దేశంలో మహిళలపై జరుగుతున్న హింస ఎంత తీవ్రంగా ఉందో 2024లో గణాంకాలే చెబుతున్నాయి. ఈ మధ్య జరిపిన సర్వే ప్రకారం ఒక్క ఏడాదిలోనే 4,41,534 కేసులు నమోదయ్యాయి. అంటే గంటకు సగటున 50 కేసులు.. ప్రతి 71 సెకన్లకు ఒక మహిళపై నేరం జరిగినట్లు పోలీసు రికార్డుల్లో నమోదవుతోంది. ఇవి కేవలం పోలీసులకు ఫిర్యాదు చేసి, నమోదైన కేసులు మాత్రమే. బయటకు చెప్పుకోలేక, భయంతో మౌనంగా ఉండిపోయిన బాధితులు మరెంతమందో? ఈ గణాంకాలు మహిళల భద్రతపై సమాజం ఎంతగా ఆలోచించాల్సిన అవసరం ఉందో స్పష్టం చేస్తున్నాయి.

గత నెల్లో ప్రకాశం జిల్లాలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్యకు గురైన ఘటన ప్రజలను తీవ్రంగా కలచివేసింది. తల్లిదండ్రులు కూలి పనుల కోసం హైదరాబాద్‌లో ఉండటంతో చిన్నారి అమ్మమ్మ వద్ద ఉంటోంది. ఇంటి బయట నిద్రిస్తున్న చిన్నారిని ఓ వ్యక్తి తీసుకెళ్లి, అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. అసలు ఆ చిన్నారి ఏం తప్పు చేసింది? తనకు ఎదురయ్యే ప్రమాదాన్ని గుర్తించే వయసు కూడా లేని పాపకు ఇలాంటి దారుణం ఎందుకు ఎదురైంది? అనే ప్రశ్నలు ప్రతిఒక్కర్నీ వెంటాతున్నాయి. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన మరో ఘటన మహిళల భద్రతపై ఆందోళన కలిగించింది. నవంబర్ 5న మీర్‌పేటలో కుటుంబ వివాదం నేపథ్యంలో ఇద్దరు మహిళలు కత్తిపోట్లకు గురై ప్రాణాలు కోల్పోయారు. దాడికి పాల్పడిన వ్యక్తి బంధువేనని, బాధిత మహిళలు అదే రోజు పోలీసులను ఆశ్రయించి తమకు రక్షణ కల్పించాలని కోరినట్లు వార్తలు వెలువడ్డాయి. ప్రాణహాని ఉందని ముందే చెప్పిన మహిళలకు సకాలంలో రక్షణ లభించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదేమో.


పనిచేసే చోట భద్రత కరువే !

మహిళలు ఉద్యోగం చేస్తూ కుటుంబానికి అండగా నిలవాలని కోరుకుంటారు. కానీ పని ప్రదేశాల్లోనూ వారికి భద్రత లేదనే ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తెలంగాణలోని తుక్కుగూడలో ఆగస్టు 29న ఓ ఆసుపత్రి ప్రాంగణంలో 21 ఏళ్ల నర్సుపై లైంగిక దాడి, హత్యకు గురైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. మహిళలపై హింస అనేది కేవలం అత్యాచారాలు, హత్యలకే పరిమితం కాదు. ఇంట్లో అవమానించడం, అనుమానంతో వేధించడం, ఆర్థిక స్వేచ్ఛను అడ్డుకోవడం, ఇష్టానికి వ్యతిరేకంగా నిర్ణయాలు రుద్దడం, కార్యాలయాల్లో లైంగిక వేధింపులకు గురిచేయడం కూడా హింసలో భాగమే. వీటిని చిన్న విషయాలుగా చూడటం వల్లే సమస్య మరింత పెరుగుతోంది.


ఇంటి నుంచే ​మార్పు...

తనమీద దాడి జరిగిన విషయాన్ని భయపడకుండా చెప్పగలిగే వాతావరణం ఇంటా, బయటా ఉండాలి. ఫిర్యాదు చేసిన మహిళను తప్పుపట్టకుండా ఆమెకు అండగా నిలవాలి. బాధితులకు వైద్యం, న్యాయ సహాయం, మానసిక ధైర్యం కల్పించాలి. పాఠశాల స్థాయి నుంచే అబ్బాయిలకు స్త్రీల పట్ల గౌరవం, సమానత్వం, బాధ్యత నేర్పించాలి. మహిళల దుస్తులు, సమయం, ప్రవర్తనను ప్రశ్నించే బదులు హింసకు పాల్పడిన వ్యక్తుల ప్రవర్తనను ప్రశ్నించాలి. మహిళలపై హింసను నిర్మూలించాలంటే చట్టాలు, ప్రభుత్వ చర్యలతో పాటూ సామాజికంగానూ మార్పు రావాలి. మహిళలను బలహీనులుగా చూడటం, వారి స్వేచ్ఛను నియంత్రించడం, పురుషాధిక్య భావజాలాన్ని ప్రోత్సహించడం వంటి ధోరణులను ప్రశ్నించాలి. కుటుంబంలో అమ్మాయి, అబ్బాయికి సమానావకాశాలు, పనులు, బాధ్యతలు కల్పించాలి. పాఠశాలలు, కళాశాలలు మహిళల హక్కులు, వ్యక్తిగత భద్రత, డిజిటల్ బాధ్యతలపై అవగాహన కల్పించాలి. పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నిరోధక కమిటీలు సమర్థంగా పనిచేయాలి. మహిళలపై హింసను ప్రోత్సహించే సినిమాలు, సామాజిక మాధ్యమాల కంటెంట్, అసభ్యకర వ్యాఖ్యలు, బాధితులను నిందించే ధోరణులపై సమాజం స్పందించాలి.


చట్టాలు మరింత బలపడాలి

దేశంలో మహిళల రక్షణ కోసం పలు చట్టాలు అమలులో ఉన్నాయి. గృహహింస నుంచి మహిళలకు రక్షణ కల్పించే చట్టం–2005, పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం–2013, బాల్య వివాహాల నిషేధ చట్టం–2006, భారతీయ న్యాయ సంహితలో మహిళలు, పిల్లలపై నేరాలకు సంబంధించిన నిబంధనలు వంటి చట్టాలు మహిళల హక్కుల పరిరక్షణకు తోడ్పడుతున్నాయి. కానీ చట్టాల గురించి మహిళలకు అవగాహన లేకపోవడం, ఫిర్యాదు చేస్తే కుటుంబం లేదా సమాజం నుంచి ఎదురయ్యే ఒత్తిళ్లు, పోలీసు స్టేషన్లకు వెళ్లడానికి భయం, ఆర్థికంగా ఇతరులపై ఆధారపడటం వంటి సమస్యలు బాధితులను వెనక్కి నెడుతున్నాయి. కొన్ని సందర్భాల్లో బాధితురాలినే ప్రశ్నించడం, ఆమె ప్రవర్తనను తప్పుపట్టడం, కుటుంబ గౌరవం పేరుతో ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని ఒత్తిడి చేయడం వంటి పరిస్థితులు న్యాయానికి అడ్డంకులుగా మారుతున్నాయి. ఆమె మాటలను గౌరవంగా విని, తగిన విచారణ జరిపి, నేరం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. బాధితురాలి వ్యక్తిగత వివరాలు, గోప్యత కాపాడటం కూడా అంతే ముఖ్యం.


పెరిగిన ​డిజిటల్ హింస

సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధితో విద్య, ఉద్యోగం, వ్యాపారం, సమాచార వినిమయం, సామాజిక సంబంధాలకు డిజిటల్ వేదికలు ఎంతో ఉపయోగపడుతున్నాయి. అయితే అదే సాంకేతికతను మహిళలను వేధించడానికి, బెదిరించడానికి, అవమానించడానికి ఉపయోగించే పరిస్థితులు కూడా పెరుగుతున్నాయి. సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర వ్యాఖ్యలు చేయడం, వ్యక్తిగత ఫొటోలను అనుమతి లేకుండా ప్రచారం చేయడం, మార్ఫింగ్ చేయడం, నకిలీ ఖాతాలు సృష్టించడం, సైబర్ స్టాకింగ్, బ్లాక్‌మెయిల్, వ్యక్తిగత సమాచారాన్ని బయటపెడతామని బెదిరించడం వంటి చర్యలు మహిళలను తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నాయి. కృత్రిమ మేధస్సు (AI) తో రూపొందించే నకిలీ, లైంగిక స్వరూపం కలిగిన చిత్రాలు, వీడియోలు కూడా డిజిటల్ హింసకు ప్రమాదకరమైన రూపాలుగా మారుతున్నాయి. 2025లో ఐక్యరాజ్యసమితి భారత విభాగం ప్రచురించిన కథనం డిజిటల్ వేధింపులు ఆన్‌లైన్‌లోనే ఆగిపోవడం లేదని, అవి వాస్తవ జీవితంలో భయం, మానసిక ఆందోళన, సంబంధాలపై ప్రభావం, సామాజిక ఒంటరితనానికి దారితీస్తున్నాయని పేర్కొంది. కేంద్ర హోంశాఖ 2026లో పార్లమెంటుకు అందించిన గణాంకాల ప్రకారం, మహిళలపై సైబర్ నేరాలకు సంబంధించి 2023లో దేశవ్యాప్తంగా 19,510 కేసులు నమోదయ్యాయి. 2021లో ఈ సంఖ్య 10,730గా ఉండగా, రెండేళ్లలో గణనీయమైన పెరుగుదల కనిపించింది. కర్ణాటకలో 2023లో 7,002 కేసులు నమోదయ్యాయి.

022


డిజిటిల్‌ వేదిక భద్రతే కీలకం

ఈ పరిస్థితుల్లో డిజిటల్ వేదికల భద్రత కేవలం వ్యక్తిగత బాధ్యతగా మిగలకూడదు. సోషల్ మీడియా సంస్థలు వేధింపుల ఫిర్యాదులపై వేగంగా స్పందించాలి. అనుచిత కంటెంట్ తొలగింపు, నకిలీ ఖాతాల నియంత్రణ, బాధితుల గోప్యత పరిరక్షణ, నేరస్థుల గుర్తింపు విషయంలో చట్టపరమైన సహకారం అందించాలి. మహిళలపై వేధింపులను స్వేచ్ఛగా భావప్రకటన చేసే హక్కుతో కలిపి చూడకూడదు. బాధితులకు అండగా నిలిచే వ్యవస్థలు, హెల్ప్‌లైన్లు, జాతీయ సైబర్ నేరాల పోర్టల్ అందుబాటులో ఉండాలి. ఈ సేవలు అందుబాటులో ఉన్నాయనే విషయం ప్రతి మహిళకు తెలియాలి. గ్రామీణ ప్రాంతాలు, మారుమూల ప్రాంతాలు, పేద కుటుంబాలు, అక్షరాస్యత తక్కువగా ఉన్న మహిళలకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. పోలీసు, వైద్య, న్యాయ, సామాజిక సేవా విభాగాలు సమన్వయంతో పనిచేయాలి.

​ మహిళలపై హింస నిర్మూలన అంటే కేవలం ఒక రోజును గుర్తుచేసుకోవడం కాదు. ప్రతి మహిళ భయం లేకుండా జీవించే సమాజాన్ని నిర్మించడం. ఆమె ఇంట్లో, వీధిలో, కార్యాలయంలో, పాఠశాలలో, ఇంటర్నెట్‌లో ఎక్కడ ఉన్నా గౌరవం, భద్రత, స్వేచ్ఛ పొందగలగడం. సరైన న్యాయం అందినప్పుడే బాధితురాలికి ధైర్యం వస్తుంది. రక్షణ లభించినప్పుడే ఆమె జీవితాన్ని తిరిగి నిర్మించుకోగలుగుతుంది. నేరస్తులకు శిక్ష పడినప్పుడే చట్టంపై విశ్వాసం పెరుగుతుంది. మహిళలపై హింసను అరికట్టడం మాత్రమే కాదు.. హింసకు పాల్పడే ధోరణులనే అంతం చేయాలి. అప్పుడే సమానత్వం, మానవత్వం, న్యాయం ఆధారంగా సురక్షితమైన భవిష్యత్తు నిర్మించగలం.

న్యాయమే కేంద్రబిందువు

ఐక్యరాజ్యసమితి 2026 సంవత్సరానికి ‘‘న్యాయాన్ని సురక్షితం చేయడం, బాధితులను/ప్రాణాలతో బయటపడినవారిని రక్షించడం.. మహిళలు, బాలికలపై హింసకు పాల్పడేవారు శిక్ష నుండి తప్పించుకోకుండా చేయడం’’. అనే సందేశాన్ని ముందుకు తీసుకెళ్తోంది. ప్రతి సంవత్సరం నవంబర్ 25 నుంచి డిసెంబర్ 10 వరకూ ప్రపంచవ్యాప్తంగా ‘16 రోజుల క్రియాశీలత ప్రచారం’ (16 Days of Activism against Gender-Based Violence) నిర్వహిస్తున్నారు. నవంబర్ 25 మహిళలపై హింస నిర్మూలన అంతర్జాతీయ దినోత్సవం కాగా, డిసెంబర్ 10 మానవ హక్కుల దినోత్సవం. ఈ రెండు రోజుల మధ్య జరిగే ప్రచారం మహిళల హక్కులు, గౌరవం, భద్రత కోసం సమాజాన్ని కార్యాచరణకు సిద్ధం చేస్తుంది. ​ఈ ప్రచారం మూడు ప్రధాన లక్ష్యాల చుట్టూ సాగనుంది. మహిళలకు సకాలంలో న్యాయం అందించడం, హింసను ఎదుర్కొన్న మహిళలకు భద్రతతో కూడిన సహాయ సేవలు అందించడం, హింసకు పాల్పడిన వ్యక్తులు చట్టపరమైన బాధ్యత నుంచి తప్పించుకోకుండా చూడడం. చట్టాలు ఉండటమే సరిపోదు. వాటి అమలులో జాప్యం లేకుండా, బాధిత మహిళకు గౌరవం, గోప్యత, భద్రత కల్పిస్తూ న్యాయవ్యవస్థ స్పందించాలి. పోలీసు విచారణ నుంచి న్యాయస్థానాల వరకూ ప్రతి దశలోనూ బాధితురాలికి అనుకూలమైన వాతావరణం ఉండాలి. న్యాయం అంటే కేవలం నేరస్తుడికి శిక్ష పడటం మాత్రమే కాదు. బాధితురాలికి తక్షణ రక్షణ, వైద్య సహాయం, మానసిక ఆరోగ్య సేవలు, న్యాయ సహాయం, అవసరమైతే ఆశ్రయం, తిరిగి ఆత్మవిశ్వాసంతో జీవించే అవకాశాలు కల్పించడం కూడా న్యాయంలో భాగమే. హింస నుంచి బయటపడిన మహిళ మరోసారి వేధింపులకు గురికాకుండా చూడటం ప్రభుత్వ వ్యవస్థలతో పాటు సమాజ బాధ్యత కూడా.
011

సాకే లక్ష్మి *చూపిన ధైర్యం !
​ నవంబర్ 25న మహిళలపై హింస నిర్మూలన అంతర్జాతీయ దినోత్సవం నిర్వహించుకోవడం మాత్రమే సరిపోదు. మహిళల భద్రత కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత తీసుకోవాలి. మహిళలపై హింస జరిగినప్పుడు చూసీ చూడనట్లు ఉండటం కూడా సమస్యను కొనసాగించడానికి పరోక్షంగా సహకరించినట్లే. బాధితురాలికి అండగా నిలవడం, సరైన సహాయం అందించడం, అవసరమైనప్పుడు అధికారులకు సమాచారం ఇవ్వడం ప్రతి పౌరుడి బాధ్యత. మహిళల భద్రత కేవలం మహిళల సమస్య కాదు.. అది సమాజం మొత్తం ఎదుర్కోవాల్సిన బాధ్యత. మన కళ్ల ముందే ఓ అమ్మాయిపై దాడి జరుగుతుంటే అడ్డుకోవాలి. అదే చేసింది విద్యార్థిని సాకే లక్ష్మి.. ఆ రోజు తన స్నేహితురాలిపై రంపంతో దాడి జరుగుతుంటే అడ్డుకుంది. తన స్నేహితురాలు గోపికను కాపాడేందుకు ప్రాణాలకు తెగించి, ప్రయత్నించింది. అతడు లక్ష్మిని కూడా గాయపరిచాడు. అయినా భయపడకుండా అడ్డుకుంది. తానూ గాయపడింది. అందరిలా భయపడి వెనకడుగు వేయకుండా అన్యాయాన్ని అపేందుకు ముందుకెళ్లింది. ఇటువంటి చొరవ ప్రతిఒక్కరిలోనూ ఉండాలి.

పద్మావతి

9490559477


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్