ఆదివారం, 11 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

జీవనశైలిలో మార్పులతో కీళ్లను కాపాడుకోండి..

19 గంటల క్రితం

cover
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 11, 2026, 08:25 పూర్వాహ్నం | 11 నిమిషాల చదవడం

మన చేతులు, కాళ్లు, వెన్నెముక మొదలైన భాగాల్లో రెండు ఎముకలు కలిసే ప్రదేశాలను కీళ్లు (Joints) అంటారు. మన శరీర కదలికలకు కీళ్లు ఎంతో ముఖ్యమైనవి. రెండు ఎముకలు కలిసే ప్రదేశం చుట్టూ క్యాప్సూల్‌ (Capsuls) ఉంటుంది. కీళ్లలో జాయింట్‌ ఫ్లూయిడ్‌ (Joint fluid) ఉంటుంది. అలాగే కీళ్లను బలంగా ఉంచటానికి లిగమెంట్స్‌ (Ligaments) సహాయపడతాయి. ఈ నిర్మాణాల్లో ఏదైనా సమస్య లేదా పనిచేయటంలో లోపం ఏర్పడితే కీళ్లలో బిగుతు, నొప్పి, వాపు, కదలికలో ఇబ్బంది, కీళ్ల ఆకృతిలో మార్పు వంటి సమస్యలు ఏర్పడొచ్చు. వీటిని సాధారణంగా కీళ్లవాతం, కీళ్ల జబ్బు (Arthritis) అని అంటారు. అక్టోబర్‌ 12 ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం సందర్భంగా అట్టమీది కథనం.


ఆర్థరైటిస్ (కీళ్ల వాతం) అనేది కీళ్లకు సంబంధించిన ఒక తీవ్రమైన ఆరోగ్య సమస్య. ప్రారంభంలో సాధారణ కీళ్ల నొప్పితో మొదలైనప్పటికీ, దీనిని నిర్లక్ష్యం చేస్తే కాలక్రమేణా సమస్య తీవ్రత పెరిగి శరీరంలోని ఇతర అవయవాలపై కూడా దుష్ప్రభావం చూపుతుంది. కీళ్లు దెబ్బతినడం, వైకల్యం (Joint Damage & Deformity) వంటి సమస్యలు చోటుచేసుకుంటాయి. దీర్ఘకాలిక వాపు, ఇన్ఫ్లమేషన్ వల్ల కీళ్ల మధ్య ఉండే మృదులాస్తి (Cartilage) పూర్తిగా అరిగిపోతుంది. దీనివల్ల ఎముకలు ఒకదానికొకటి రాపిడికి గురై కీళ్ల ఆకృతి మారిపోతుంది. కీళ్లలో తీవ్రమైన దృఢత్వం (Stiffness) ఏర్పడటం వల్ల నడవడం, కూర్చోవడం, చేతులతో వస్తువులను పట్టుకోవడం వంటి దైనందిన పనులు చేయడం కష్టంగా మారుతుంది. ఇది తీవ్రమైతే పాక్షిక లేదా పూర్తి వైకల్యానికి దారితీసే ప్రమాదం కూడా ఉంటుంది. అంతర్గత అవయవాలపై ప్రభావం (Systemic Complications) కూడా పడుతుంది. ఆటోఇమ్యూన్ ఆర్థరైటిస్ (ఉదాహరణకు: రుమటాయిడ్ ఆర్థరైటిస్) శరీరంలో రోగనిరోధక శక్తి సొంత కణజాలాలపై దాడి చేయడం వల్ల వస్తుంది. దీని తీవ్రత కేవలం కీళ్లకే పరిమితం కాకుండా ఇతర అవయవాలకు వ్యాపిస్తుంద. దీర్ఘకాలిక ఇన్ఫ్లమేషన్ వల్ల రక్తనాళాలు గట్టిపడి, గుండెపోటు (Heart Attack) లేదా స్ట్రోక్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఊపిరితిత్తులలో వాపు రావడం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, పొడి దగ్గు వంటి సమస్యలు (Pulmonary Fibrosis) తలెత్తుతాయి. కళ్ళు పొడిబారడం (Sjogren's syndrome), కళ్లలో ఎరుపుదనం, తీవ్రమైన నొప్పి రావడం వంటివి జరుగుతాయి. ఆర్థరైటిస్ ఉన్నవారు నొప్పి కారణంగా శారీరక కదలికలను తగ్గిస్తారు. దీనితో పాటు చికిత్సలో భాగంగా వాడే కొన్ని రకాల మందుల (Steroids) వల్ల ఎముకల సాంద్రత తగ్గి, అవి త్వరగా విరిగిపోయే ప్రమాదం (Fractures) పెరుగుతుంది. మానసిక ఆరోగ్య సమస్యలు (Mental Health Challenges) పెరుగుతాయి. నిరంతరం వేధించే కీళ్ల నొప్పి, నిద్రలేమి (Insomnia), ఇతరులపై ఆధారపడడం వల్ల రోగులు తీవ్రమైన మానసిక ఒత్తిడి, ఆందోళన (Anxiety), డిప్రెషన్‌కు లోనవుతారు. కీళ్ల నొప్పుల వల్ల నడవలేకపోవడం, వ్యాయామం చేయలేకపోవడం వల్ల బరువు వేగంగా పెరుగుతారు. బరువు పెరగడం వల్ల కీళ్లపై మరింత భారం పడటమే కాకుండా.. మధుమేహం (Type-2 Diabetes), అధిక రక్తపోటు (Hypertension) వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువవుతాయి. ఆర్థరైటిస్ తీవ్రతను అరికట్టడానికి ప్రారంభ దశలోనే గుర్తింపు (Early Diagnosis), సరైన చికిత్స చాలా ముఖ్యం. కీళ్ల నొప్పులు, వాపులు ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేయకుండా రుమటాలజిస్ట్ లేదా ఆర్థోపెడిక్ వైద్యుడిని సంప్రదించి తగిన జాగ్రత్తలు, మందులు వాడటం ద్వారా ఈ తీవ్రమైన సమస్యల బారిన పడకుండా కాపాడుకోవచ్చు.

దైనందిన జీవితానికి ఇబ్బంది..

మనిషి జీవితంలో కదలికకు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకూ ప్రతి పనికీ శరీరంలోని కీళ్ల సహకారం అవసరం. మంచం మీద నుంచి లేవడం, నడవడం, మెట్లు ఎక్కడం, కూర్చోవడం, నిలబడటం, వంగడం, చేతులతో పనులు చేయడం.. ఇలా మన దైనందిన జీవితంలో ప్రతి కదలిక వెనుక కీళ్ల పాత్ర ఉంటుంది. అందుకే కీళ్లు ఆరోగ్యంగా ఉన్నంతకాలం వాటి విలువ పెద్దగా తెలియదు. కానీ ఒక్కసారి కీళ్లలో నొప్పి, వాపు, బిగుతు మొదలైతే మన స్వేచ్ఛకే పరిమితులు ఏర్పడతాయి.

అపోహలు వద్దు

కీళ్లవాతం కేవలం వృద్ధాప్యంలో వచ్చే సమస్య అనే అపోహ ఇప్పటికీ చాలామందిలో ఉంది. వయస్సు పెరగడం ఒక కారణం కావచ్చు. కానీ కీళ్లపై అధిక ఒత్తిడి, కీళ్లలోని మృదులాస్థి దెబ్బతినడం, శరీర బరువు అధికంగా ఉండటం, జీవనశైలిలో మార్పులు, గాయాలు, కొన్ని ఇన్‌ఫ్లమేటరీ సమస్యలు వంటి అనేక కారణాలతో కీళ్ల సమస్యలు రావచ్చు. కొందరిలో నొప్పి, బిగుతు కారణంగా రోజువారీ పనులు కూడా కష్టంగా మారుతాయి. మరికొందరిలో నిద్రకు, ఉద్యోగానికి, కుటుంబ జీవితానికి, శారీరక చురుకుదనానికి కూడా ఇబ్బందులు ఏర్పడొచ్చు. కీళ్ల నొప్పిని సాధారణ నొప్పిగా భావించి నివారణ మందులు వేసుకుని రోజులు గడపడం సరైన పద్ధతి కాదు. నొప్పి మన శరీరం పంపే ఒక సంకేతం. దాని వెనుక ఉన్న కారణాన్ని గుర్తించడం అత్యంత ముఖ్యం. కీళ్లలో అరుగుదల సమస్యా? వాపు కారణంగా వచ్చిన సమస్యా? గాయం ప్రభావమా? లేక ఇతర కారణాలున్నాయా? అనే విషయాన్ని వైద్య పరీక్షల ద్వారా తెలుసుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా Arthritis Musculoskeletal conditions కారణంగా కోట్లాది మంది తమ రోజువారీ జీవితంలో నొప్పి, కదలికలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందుకే కీళ్ల సమస్యలపై అవగాహన పెంచడం, ముందుగానే గుర్తించడం, సరైన చికిత్స పొందడం, శారీరక చురుకుదనాన్ని కొనసాగించడం అవసరం.

​‘కీళ్ల సమస్యలున్నా కలలను వదులుకోవద్దు’

ప్రతి ఏడాది నిర్వహించే World Arthritis Dayకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. 2026 సంవత్సరానికి “Achieve Your Dreams” అనే Themeను ముందుకు తీసుకొచ్చారు. కీళ్ల సమస్యలు ఉన్నప్పటికీ తమ కలలను, ఆశలను, లక్ష్యాలను వదులుకోకుండా తగిన చికిత్స, స్వీయ సంరక్షణ, వ్యాయామం, జీవనశైలి మార్పులతో ముందుకు సాగాలనే సందేశాన్ని ఈ Theme ప్రతిబింబిస్తుంది. కీళ్లవాతం ఉన్న వ్యక్తి జీవితాన్ని కేవలం నొప్పి ఆధారంగా చూడకూడదు. నొప్పి తగ్గించడంతో పాటు కీళ్ల పనితీరును కాపాడుకోవడం, కదలికను కొనసాగించడం, అవసరమైన వైద్య చికిత్స పొందడం, జీవనశైలిని మార్చుకోవడం కూడా అంతే ముఖ్యం. కీళ్ల ఆరోగ్యంపై అవగాహన పెరిగితే సమస్య తీవ్రతను తగ్గించుకునే అవకాశాలు ఉంటాయి.


key

​లక్షణాలు...

కీళ్లవాతం సమస్యల్లో ఎక్కువగా కీళ్లవాపు, నొప్పి, బిగుతు వంటి లక్షణాలు సర్వసాధారణంగా కనిపిస్తాయి. కీళ్ల కదలికలో ఇబ్బంది ఏర్పడి, రోజువారీ పనులు చేయటం కూడా కష్టంగా మారొచ్చు. కొందరికి నిద్ర కూడా సరిగా పట్టదు (నొప్పి వలన). కీళ్లలో వాపు, నొప్పి అధికంగా ఉన్నప్పుడు సరైన కారణాన్ని గుర్తించి నిర్ధారించి వైద్యం అందిస్తారు రుమటాలజీ వైద్య నిపుణులు. అలాగే కీళ్ల అరుగుదల వలన కీళ్ల నొప్పులకు పరీక్షలు నిర్వహించి వ్యాధి నిర్ధారణ చేసి తగిన వైద్యాన్ని అందిస్తారు. కీళ్ల అరుగుదల సమస్య తీవ్రంగా ఉంటే అవసరాన్ని బట్టి, రోగి ఆరోగ్యస్థితిని బట్టి అవసరమైన శస్త్ర చికిత్స కూడా నిర్వహిస్తారు ఆర్థోపెడిక్‌ నిపుణులు. నొప్పి.. శరీరం పంపే రాయబారి నొప్పి మన శరీరం యొక్క భాష. ఒక అవయవం ఇబ్బంది పడుతున్నప్పుడు శరీరం మనకు పంపే రాయబారిగా నొప్పిని భావించాలి. ఆ బాధను (నొప్పి) అర్థం చేసుకోవడం కోసం వైద్యుని సహాయం తీసుకోవాలి. నొప్పి మూల కారణం, పరిణామాలను గ్రహించి దానికి అనుగుణంగా మన దైనందిన చర్యలు మార్పు, వ్యాయామం, ఆహారం, మానసిక ఒత్తిడిని తగ్గించుకోవటం, శ్రద్ధతో పూర్తిగా నియంత్రించొచ్చు. కీళ్ల నొప్పులను భారంగా చూడటం, అవి పడుతున్న కష్టాన్ని గమనించక మందులు, బెల్టులు, పై పూతలు వాడి మరింత ఒత్తిడి చేస్తే, నొప్పులు ఎక్కువై, ఇబ్బంది మరింత ఎక్కువవుతుంది.


జాయింట్లు జాగ్రత్త...

కీళ్లు.. మన కదలికలకు ఆధారం మన చేతులు, కాళ్లు, వెన్నెముక మొదలైన భాగాల్లో రెండు ఎముకలు కలిసే ప్రదేశాలను కీళ్లు (Joints) అంటారు. మన శరీర కదలికలకు కీళ్లు ఎంతో ముఖ్యమైనవి. రెండు ఎముకలు కలిసే ప్రదేశం చుట్టూ క్యాప్సూల్‌ (Capsule) ఉంటుంది. కీళ్లలో జాయింట్‌ ఫ్లూయిడ్‌ (Joint fluid) ఉంటుంది. అలాగే కీళ్లను బలంగా ఉంచటానికి లిగమెంట్స్‌ (Ligaments) సహాయపడతాయి. ఈ నిర్మాణాల్లో ఏదైనా సమస్య లేదా పనిచేయటంలో లోపం ఏర్పడితే కీళ్లలో బిగుతు, నొప్పి, వాపు, కదలికలో ఇబ్బంది, కీళ్ల ఆకృతిలో మార్పు వంటి సమస్యలు ఏర్పడొచ్చు. వీటిని సాధారణంగా కీళ్లవాతం, కీళ్ల జబ్బు (Arthritis) అని అంటారు.

ప్రధానంగా రెండు రకాలు..

1. డిజనరేటివ్‌ ఆర్థరైటిస్‌ (Degenerative Arthritis): కీళ్లలోని మృదులాస్థి (Cartilage) క్రమంగా దెబ్బతినటం లేదా అరిగిపోవటం వల్ల వచ్చే ఆర్థరైటిస్‌ను (OSTEOARTHRITIS) ఆస్టియో ఆర్థరైటిస్‌ అంటారు.

2.ఇన్‌ఫ్లమేటరీ ఆర్థరైటిస్‌ (Inflammatory Arthritis) : కీళ్లవాపు, Inflammation ఏర్పడటం వల్ల వచ్చే ఆర్థరైటిస్‌ను రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ (Rheumatoid Arthritis) అంటారు.

కీళ్లవాతం సమస్యలకు అనేక కారణాలు ఉండొచ్చు. ముఖ్యంగా వయస్సు పెరగటం, కీళ్లపై అధిక ఒత్తిడి పడటం, కీళ్లలోని మృదులాస్థి (Cartilage) దెబ్బతినటం, వాతావరణ మార్పులు, చలి లేదా చల్లని వాతావరణంతో కొంతమందిలో కీళ్లనొప్పులు, బిగుతు ఎక్కువగా అనిపిస్తుంటుంది. కీళ్లపై నిరంతరం అధిక భారం పడటం, శరీర బరువు ఎక్కువగా ఉండటం, గతంలో కీళ్లకు గాయాలు కావడం వంటి అంశాలు కూడా సమస్యలను ప్రభావితం చేయొచ్చు.

అయితే ప్రతి వ్యక్తిలో కారణం ఒకేలా ఉండదు. అందువల్ల కీళ్ల నొప్పి వచ్చిన వెంటనే దాని కారణాన్ని స్వయంగా నిర్ణయించుకోకుండా వైద్యులను సంప్రదించడం అవసరం.

చికిత్స కీళ్లవాతం ఏ రకానికి చెందింది, ఎంత తీవ్రంగా ఉంది అనే దానిపై చికిత్స ఆధారపడి ఉంటుంది. సాధారణంగా వైద్యుల సూచనల మేరకు మందులు, వ్యాయామం, ఫిజియోథెరఫీ, కీళ్ల కదలికలను

మెరుగుపరిచే విధానాలు వంటి చికిత్సలు అవసరమవుతాయి. కీళ్ల సమస్యకు కారణం తెలుసుకోకుండా కేవలం నొప్పి తగ్గించుకోవడమే లక్ష్యంగా చికిత్స తీసుకోవడం వల్ల అసలు సమస్య గుర్తించకుండా ఉండే అవకాశం ఉంటుంది. అందువల్ల సరైన నిర్ధారణ, తగిన వైద్య సలహా ఎంతో అవసరం. ఏ సమస్యకు ఏ నిపుణుడిని సంప్రదించాలి? సాధారణంగా కీళ్లవాతం (Rheumatoid Arthritis) సమస్యలు రావడానికి కారణాలు అనేక రకాలు. వాటిని పరీక్షించి, వ్యాధి నిర్ధారణ చేసి తగిన వైద్యం అందించటానికి రుమటాలజీ వైద్య నిపుణులను సంప్రదించాలి. కీళ్ల అరుగుదల (కీళ్ల నొప్పులను) పరీక్షలు నిర్వహించి వ్యాధి నిర్ధారణ చేసి తగిన వైద్యం అందించటానికి ఎముకలు, కీళ్ల వ్యాధుల వైద్య నిపుణులను సంప్రదించాలి.


నొప్పే కీళ్లవాతానికి సంకేతం

నొప్పి మన రాయబారి (Pains). ఈ రాయబారిని చంపడం (Pain killers) మన శరీరంపై మనం యుద్ధం చేయటమే. కనుక నొప్పిని అర్థం చేసుకుని కీళ్ల ఇబ్బందిని గ్రహించి తగిన జాగ్రత్తలు (Life style modification), వ్యాయామం అవసరమైనప్పుడు, మందులు వాడుకోవడం ఆర్థరైటిస్‌ managementలో కీలకం.

ఆర్థరైటిస్‌ (కీళ్లనొప్పి)-ప్రధానంగా నాలుగు దశలుగా విభజించబడింది.

దశ 0 (Stage normal) : ఇక్కడ కీళ్లు పూర్తిగా ఆరోగ్యంగా ఉంటాయి. ఎలాంటి నొప్పులు లేదా కీళ్ల నష్టం ఉండదు. ఎలాంటి చికిత్స అవసరం లేదు.

దశ 1 (Stage 1-Minor/Early) ప్రాథమిక దశ : కీళ్లలో చాలా స్వల్ప మార్పులు ఉంటాయి. చిన్న ఎముక పెరుగుదల ఉండొచ్చు. సాధారణ వ్యాయామాలు, స్ట్రెచింగ్‌ ద్వారా దీనిని నియంత్రించొచ్చు.

దశ 2 (Stage 2-Mild) తేలికపాటి దశ : ఎక్కువ దూరం నడిచినా, లేదా పరిగెత్తినా తేలికపాటి నొప్పి, కీళ్ల బిగువు (Stiffness) వస్తుంది. బరువు తగ్గడం, ఫిజియోథెరపీ, డాక్టర్‌ సూచించిన సాధారణ మందులు వాడాలి.

దశ 3 (Stage 3-Moderate) మోస్తరు దశ : తరచూ నొప్పి ఉండటం, (Cartilage-కీళ్ల మధ్య ఉండే మృదువైన కణజాలం) గణనీయంగా క్షీణించడం జరుగుతుంది. కీళ్ల బిగువు పెరుగుతుంది. దీనికి బలమైన మందులు (NSAIDs), ఫిజియోథెరపీ, ఇంజెక్షన్లు అవసరమవుతాయి.

దశ 4 (Stage 4-Severe) తీవ్రమైన దశ : Cartilage పూర్తిగా దెబ్బతింటుంది. ఎముకతో ఎముక కొరుక్కోవడం వల్ల తీవ్రమైన నొప్పి కలుగుతుంది. రోజువారీ పనులు చేయటం చాలా కష్టమవుతుంది. ఈ దశలో జాయింట్‌ రీప్లేస్‌మెంట్‌ సర్జరీ (కీళ్ల మార్పిడి శస్త్ర చికిత్స) ఉత్తమ మార్గం.

చికిత్స, నిర్వహణ పద్ధతులు

మందులు (Medicines) : నొప్పి, వాపు నివారణకు నాన్‌-స్టెరాయిడల్‌ యాంటీ ఇన్ఫ్లమేటరీ మందులు (NSAIDs) వాడతారు. వ్యాధి తీవ్రతను తగ్గించటానికి డిఎంఎఆర్‌డి-(DMARDSs)-డిజీస్‌ మాడిఫైడ్‌ యాంటీ రుమాటిక్‌ డ్రగ్స్‌), బయోలాజికల్‌ డ్రగ్స్‌ను డాక్టర్లు సూచిస్తారు. మందులు వైద్యుల సూచనల మేరకే ఉపయోగించాలి. ఒక వ్యక్తికి ఉపయోగపడిన మందు మరొకరికి అదే విధంగా ఉపయోగపడుతుందని భావించకూడదు. వ్యాధి రకం, తీవ్రత, ఇతర ఆరోగ్య పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని వైద్యులు మందులను నిర్ణయిస్తారు.

వ్యాయామం, ఫిజికల్‌ థెరపీ (Exercise @ Physical Therapy)

క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల కీళ్ల కదలికలు మెరుగుపడతాయి. కండరాలు బలపడతాయి. కీళ్ల సమస్య ఉన్నవారు పూర్తిగా కదలికను ఆపేయడం కూడా సరైన పద్ధతి కాదు. శరీర సామర్థ్యానికి తగిన వ్యాయామం, అవసరమైనప్పుడు ఫిజియోథెరపీ ద్వారా కీళ్ల కదలికలను మెరుగుపరచుకోవచ్చు.

జీవన శైలిలో మార్పులు (Life Style Changes) : శరీర బరువును అదుపులో ఉంచుకోవటం ద్వారా మోకాళ్లపై పడే అదనపు భారాన్ని తగ్గించుకోవచ్చు. జీవనశైలిలో చిన్న చిన్న మార్పులు కూడా కీళ్లపై ప్రభావాన్ని చూపుతాయి. ఎక్కువసేపు ఒకే భంగిమలో ఉండకుండా, శరీరాన్ని చురుకుగా ఉంచుతూ, వైద్యుల సూచనల మేరకు వ్యాయామం చేయడం ఉపయోగకరంగా ఉంటుంది.

  • వేడి, చల్లని ఒత్తిడి (Heat and Cold Therapy)

  • వేడి, చల్లని ఒత్తిడి (Heat and Cold Therapy) ద్వారా కీళ్ల నొప్పి నుంచి ఉపశమనం పొందొచ్చు. అయితే ప్రతి రకమైన కీళ్ల నొప్పికి ఒకే విధమైన పద్ధతి సరిపోదు. కీళ్ల పరిస్థితిని బట్టి Heat Therapy లేదా Cold Therapyను ఉపయోగించాల్సి ఉంటుంది.

  • శస్త్ర చికిత్స (Surgery): తీవ్రమైన సందర్భాల్లో జాయింట్‌ రీప్లేస్‌మెంట్‌ (కీళ్లమార్పిడి) సర్జరీలు అవసరమవుతాయి. కీళ్ల అరుగుదల తీవ్రంగా ఉండి, నొప్పి మరియు కదలికలో ఇబ్బందులు రోజువారీ జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నప్పుడు, అవసరాన్ని బట్టి శస్త్రచికిత్సను వైద్యులు సూచిస్తారు. నొప్పి తగ్గించడమే కాదు.. కారణాన్ని గుర్తించాలి కీళ్లవాతం విషయంలో చాలామంది చేసే ప్రధాన తప్పిదం నొప్పి వచ్చినప్పుడు వెంటనే Pain killers ఉపయోగించి కొంత ఉపశమనం పొందుతుంటారు. నొప్పి తగ్గిన తర్వాత సమస్య పరిష్కారమైందని భావిస్తుంటారు. కానీ నొప్పి తగ్గడం, వ్యాధి తగ్గడం రెండూ ఒకటే కాదు.

  • కీళ్లలో నొప్పి తరచుగా వస్తుంటే దాని వెనుక ఉన్న కారణాన్ని గుర్తించాలి. లక్ష‍ణాలు గురించి తెలుసుకోవాలి.

  • ఉదయం లేచినప్పుడు కీళ్లు ఎక్కువసేపు బిగుసుకుపోవడం

  • కీళ్లలో వాపు కనిపించడం

  • నడకలో మార్పు రావడం

  • మెట్లు ఎక్కడం కష్టంగా మారడం

  • ఎక్కువ దూరం నడవలేకపోవడం

  • చేతులతో వస్తువులు పట్టుకోవడంలో ఇబ్బంది వంటివి గమనించాలి.

  • సమస్య మొదటి దశలో ఉన్నప్పుడే వైద్య సలహా తీసుకుంటే నిర్వహణ సులభంగా ఉండే అవకాశం ఉంటుంది. సమస్య తీవ్రత పెరిగిన తర్వాత చికిత్సకు ఎక్కువ సమయం, శ్రమ అవసరం కావచ్చు.


కీళ్ల ఆరోగ్యానికి జీవనశైలి కీలకం

కీళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో జీవనశైలికి ఎంతో ప్రాధాన్యత ఉంది. శరీర బరువును అదుపులో ఉంచుకోవడం, అవసరమైన శారీరక కదలికను కొనసాగించడం, కీళ్లపై అనవసరమైన ఒత్తిడిని తగ్గించడం, సరైన ఆహారపు అలవాట్లు పాటించడం, తగిన విశ్రాంతి తీసుకోవడం వంటి అంశాలు ఉపయోగపడతాయి. రోజంతా కూర్చునే జీవనశైలి క్రమంగా శారీరక చురుకుదనాన్ని తగ్గిస్తుంది. మరోవైపు శరీర సామర్థ్యానికి మించి వ్యాయామం చేయడం కూడా కీళ్లపై ఒత్తిడిని పెంచవచ్చు. అందుకే సమతుల్యమైన జీవనశైలి అవసరం. వ్యాయామం అంటే కేవలం బరువైన వ్యాయామాలు చేయడం కాదు. నడక, స్ట్రెచింగ్‌, కీళ్ల కదలికలను మెరుగుపరిచే వ్యాయామాలు, కండరాలను బలోపేతం చేసే వ్యాయామాలు వంటి వాటిని వ్యక్తి ఆరోగ్యస్థితికి అనుగుణంగా ఎంచుకోవాలి. వయస్సుతో పాటు కీళ్లను కాపాడుకోవాలి వయస్సు పెరిగే కొద్దీ శరీరంలో అనేక సహజ మార్పులు జరుగుతాయి. కీళ్లలోని Cartilage కూడా కాలక్రమంలో దెబ్బతినే అవకాశం ఉంటుంది. అయితే వయస్సు పెరగడం అంటే తప్పనిసరిగా తీవ్రమైన కీళ్ల నొప్పులు రావాల్సిందే అని కాదు. కీళ్ల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం, బరువును అదుపులో ఉంచుకోవడం, శారీరక చురుకుదనాన్ని కొనసాగించడం, గాయాల విషయంలో నిర్లక్ష్యం చేయకపోవడం, నొప్పులు పునరావృతమైతే వైద్యులను సంప్రదించడం ద్వారా సమస్యలను ముందుగానే గుర్తించొచ్చు.


కుటుంబ జీవితంపైనా ప్రభావం

కీళ్ల నొప్పి కేవలం శరీరంలోని ఒక భాగానికి సంబంధించిన సమస్యగా మిగలదు. నొప్పి తీవ్రంగా ఉంటే వ్యక్తి తన రోజువారీ పనులను చేసుకోవడంలో ఇబ్బంది పడతారు. ఇంటి పనులు, ఉద్యోగం, ప్రయాణం, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం వంటి వాటిపైనా ప్రభావం పడుతుంది. కొందరికి నొప్పి కారణంగా నిద్ర సరిగా పట్టకపోవచ్చు. విశ్రాంతి లేకపోవడం మరుసటి రోజు శారీరక చురుకుదనాన్ని ప్రభావితం చేయొచ్చు.

ఇలా ఒక సమస్య మరొక సమస్యకు దారితీసే పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల కీళ్లవాతాన్ని కేవలం వయస్సుతో వచ్చే చిన్న సమస్యగా చూడకుండా, జీవన నాణ్యతను ప్రభావితం చేసే ఆరోగ్య సమస్యగా చూడాల్సిన అవసరం ఉంది. కీళ్ల నొప్పి వచ్చినప్పుడు ఏం చేయాలి? కీళ్ల నొప్పి వచ్చినప్పుడు ముందుగా సమస్య తీవ్రతను గమనించాలి. తాత్కాలికంగా వచ్చిన చిన్న నొప్పి, పదేపదే వచ్చే నొప్పి, వాపుతో కూడిన నొప్పి, గాయం తర్వాత వచ్చిన నొప్పి.. ఇలా పరిస్థితులు వేర్వేరుగా ఉంటాయి. నొప్పి పదేపదే వస్తుంటే, కీళ్లలో వాపు ఉంటే, కదలిక తగ్గితే, రోజువారీ పనులకు ఇబ్బంది కలిగితే వైద్యుడిని సంప్రదించాలి.

అవసరమైన పరీక్షలు చేయించుకుని కారణాన్ని గుర్తించాలి. స్వయంగా మందులు వాడటం, ఇతరులకు ఇచ్చిన మందులను తీసుకోవడం, నొప్పి తగ్గిందని చికిత్సను మధ్యలో ఆపేయడం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి. ఆర్థరైటిస్‌ ఉన్నా.. కలలను ఆపాల్సిన అవసరం లేదు World Arthritis Day–2026 Theme “Achieve Your Dreams” ఒక సానుకూల సందేశాన్ని ముందుకు తీసుకువస్తోంది. కీళ్ల సమస్యలు ఉన్నంత మాత్రాన వ్యక్తి తన జీవితాన్ని ఆపివేయాల్సిన అవసరం లేదనే భావన ఇందులో ఉంది. కీళ్లవాతం ఉన్న వ్యక్తి తన సమస్యను అర్థం చేసుకుని, వైద్యుల సలహా తీసుకుని, అవసరమైన చికిత్సను కొనసాగిస్తూ, తనకు అనుకూలమైన శారీరక చురుకుదనాన్ని కొనసాగించాలి. ఆరోగ్య పరిస్థితికి తగిన మార్పులతో ఉద్యోగం, కుటుంబం, ప్రయాణం, అభిరుచులు, లక్ష్యాలు కొనసాగించడానికి ప్రయత్నించాలి. కీళ్ల నొప్పి మన జీవితానికి ముగింపు కాదు. అది మన శరీరం ఇచ్చే ఒక హెచ్చరిక. ఆ హెచ్చరికను సరిగ్గా అర్థం చేసుకుని తగిన చర్యలు తీసుకుంటే జీవన నాణ్యతను మెరుగుపరుచుకునే అవకాశం ఉంటుంది.

మొత్తంగా పరిశీలిస్తే.. సాధారణంగా కీళ్లవాతం (Rheumatoid Arthritis) సమస్యలు రావడానికి కారణాలు అనేక రకాలు. వాటిని పరీక్షించి, వ్యాధి నిర్ధారణ చేసి తగిన వైద్యం అందించాలి. కీళ్ల అరుగుదల (కీళ్ల నొప్పులకు) పరీక్షలు నిర్వహించి వ్యాధి నిర్ధారణ చేసి తగిన వైద్యం అందిస్తే తగ్గిపోతాయి. కీళ్లవాతం సమస్యల్లో ఎక్కువగా కీళ్లవాపు, నొప్పి, బిగుతు వంటి లక్షణాలు సర్వసాధారణంగా కన్పిస్తాయి. కీళ్ల కదలికల్లో ఇబ్బంది ఏర్పడి, రోజువారీ పనులు చేయటం కూడా కష్టంగా మారొచ్చు. కొందరికి నిద్ర కూడా సరిగా పట్టదు (నొప్పి వలన). కీళ్లలో వాపు, నొప్పి అధికంగా ఉన్నప్పుడు సరైన కారణాన్ని రుమటాలజీ వైద్య నిపుణులు గుర్తించి నిర్ధారించి వైద్యాన్ని అందిస్తారు. అలాగే కీళ్ల అరుగుదల వలన కీళ్ల నొప్పులకు పరీక్షలు నిర్వహించి వ్యాధి నిర్ధారణ చేసి తగిన వైద్యాన్ని అందిస్తారు. కీళ్ల అరుగుదల సమస్య తీవ్రంగా ఉంటే అవసరాన్ని బట్టి, రోగి ఆరోగ్య స్థితిని బట్టి అవసరమైన శస్త్ర చికిత్సలను ఆర్థోపెడిక్‌ వైద్య నిపుణులు కూడా నిర్వహిస్తారు.

  • నొప్పిని అర్థం చేసుకోండి.. కదలికను కొనసాగించండి

  • కీళ్ల ఆరోగ్యంపై అవగాహన కలిగి ఉండటం, సమస్యను ప్రారంభ దశలోనే గుర్తించడం

  • సరైన నిపుణుడిని సంప్రదించడం, వైద్యుల సూచనలను పాటించడం

  • జీవనశైలిలో అవసరమైన మార్పులు చేసుకోవడం ద్వారా కీళ్ల సమస్యలను మెరుగ్గా నిర్వహించుకోవచ్చు.

  • నొప్పిని నిర్లక్ష్యం చేయకండి. స్వయంగా చికిత్స చేసుకోకండి. సరైన వైద్యుడిని సంప్రదించండి. కదలికను పూర్తిగా ఆపేయకండి. జీవనశైలిని మార్చుకోండి. కీళ్లను కాపాడుకోండి. కలలను మాత్రం ఆపకండి. “Achieve Your Dreams”


- డాక్టర్‌ సురేష్‌ ఇర్రంకి

MS (Ortho ‘Manipal’), DNB (Ortho), FNBE (CMC.Ldh.) Orthopedician, Trauma Surgeon

ఎముకలు, కీళ్ళు, కండరాల సాధారణ చికిత్సలు,

లైఫ్‌లైన్‌ త్రిమూర్తి హాస్పిటల్‌,

సూర్యారావుపేట, విజయవాడ.

9490608122

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్