పిల్లలు పుట్టినప్పటి నుంచీ ఒక సహజమైన ఆసక్తితో ఉంటారు. “అమ్మా, ఆకాశం ఎందుకు నీలంగా ఉంటుంది?” “నాన్నా, చందమామ ఎందుకు వెన్నెల కురిపిస్తుంది?” ఇలా వారి ప్రశ్నలకు అంతు లేదు. కానీ చాలామంది తల్లిదండ్రులు ఈ ప్రశ్నలకు అలిసిపోతుంటారు. కొందరు సమాధానం చెప్పడం మానేస్తారు. మరికొందరు “ఇంత పెద్దవాడివై ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నావా?” అంటూ కోప్పడతారు. కానీ ఆ ప్రశ్నల్లోనే పిల్లల భవిష్యత్తు దాగి ఉంది. ప్రశ్నించే అలవాటు ఉన్న పిల్లలు ఎప్పుడూ ఆలోచనాపరులుగా, సృజనాత్మకంగా, సమస్యలను సొంతంగా పరిష్కరించుకునే శక్తితో ఎదుగుతారు. అయితే ఈ అలవాటును పెంపొందించడం అంత తేలిక కాదు. అందుకే నిపుణులు కొన్ని సులభమైన పేరెంటింగ్ చిట్కాలు చెప్తున్నారు.. అవేంటో తెలుసుకుందాం.
ఓపికగా సమాధానం చెప్పండి. పిల్లల ప్రశ్నలు ఎంత వింతగా, ఎంత అసంబద్ధంగా అనిపించినా వాటిని విస్మరించకండి. వారి ప్రశ్నలకు సమాధానం చెప్పడం ద్వారా వారిలో కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది. మీకు సమాధానం తెలియకపోతే “నాకు తెలీదు, కలిసి వెతుకుదామా?” అని చెప్పండి. అది పిల్లలకు ఒక పాఠం – ఎవరికీ అన్నీ తెలియవు, నేర్చుకోవడం ఎప్పటికీ ఆగదు అనే విషయం వారికి అర్థమవుతుంది.
ప్రోత్సహించండి, అణచివేయకండి
“ఇదో ప్రశ్నా?!” “ఇంక మాట్లాడొద్దు” – ఇలాంటి మాటలు పిల్లల ఆసక్తిని చంపేస్తాయి. బదులుగా “అది మంచి ప్రశ్న! నీకు ఆ ఆలోచన ఎలా వచ్చింది?” అంటూ ప్రోత్సహించండి. పిల్లలు ప్రశ్న అడిగిన ప్రతిసారీ వారి ప్రశ్నను మెచ్చుకోండి. అప్పుడు వారు మరిన్ని ప్రశ్నలు అడగడానికి సాహసిస్తారు.
అడగడం నేర్పండి – మీరే మొదలు పెట్టండి!
పిల్లలు ప్రశ్నించడం నేర్చుకోవాలంటే ముందు మీరు వారిని ప్రశ్నలు అడగడం అలవాటు చేసుకోండి. స్కూల్ నుంచి వచ్చాక “ఏం చదువుకున్నావ్?” అని అడగడం కంటే “ఈరోజు క్లాసులో నీకు బోర్ కొట్టించిన విషయం ఏది? ఎందుకు?” అని అడగండి. “ఈరోజు టీచర్ ఏ ప్రశ్న అడిగారు? నీకు ఆ ప్రశ్న ఎలా అనిపించింది?” అంటూ ప్రశ్నల గురించే మాట్లాడండి. ఇలా చేయడం వల్ల పిల్లలు ప్రశ్నించడం ఒక అలవాటుగా భావిస్తారు.
'సరైన సమాధానం' కంటే 'ఆలోచించే ప్రక్రియ' ముఖ్యం
చాలామంది తల్లిదండ్రులు పిల్లల ప్రశ్నకు వెంటనే సరైన సమాధానం చెప్పాలని తొందరపడతారు. కానీ కొన్నిసార్లు సమాధానం చెప్పకుండా “నీకు ఏమనిపిస్తుంది?” అని ప్రశ్నించడం మంచిది. ఇలా చేయడం వల్ల పిల్లలు తమ ఆలోచనలను స్పష్టంగా వ్యక్తపరచడం నేర్చుకుంటారు. సమాధానం తప్పు అయినా పర్వాలేదు – ఆ తప్పు నుంచి వారు నేర్చుకోవడమే ముఖ్యం.
'ఎందుకు' అనే ప్రశ్నను ఆహ్వానించండి
పిల్లలు “ఎందుకు?” అని అడిగినప్పుడు చాలామంది తల్లిదండ్రులు “అంతే” అని లేదా “అలా ఉండాలి” అని చెప్పేస్తారు. కానీ ఆ ‘ఎందుకు’ అనేదే ఆలోచనా ప్రక్రియకు మొదటి మెట్టు. వారు “ఎందుకు?” అడిగినప్పుడు “అది మంచి ప్రశ్న, దానికి సమాధానం వెతుకుదామా?” అని చెప్పండి. అప్పుడు వారు సమాధానం కోసం వెతకడం, పుస్తకాలు చదవడం, పెద్దలను అడగడం – ఇవన్నీ నేర్చుకుంటారు.
సురక్షితమైన వాతావరణం కల్పించండి
పిల్లలు ఏ ప్రశ్న అడిగినా దాన్ని తీవ్రంగా తీసుకోండి. వారి ప్రశ్నలను ఎగతాళి చేయకండి. వారి ప్రశ్నలకు మీరు శ్రద్ధగా వింటున్నారని, వారి ఆలోచనలను విలువైనవిగా భావిస్తున్నారని వారికి తెలియజేయండి. ప్రశ్నలు అడగడం వల్ల ఎలాంటి ఇబ్బంది లేదని, అది ఒక మంచి అలవాటని వారు అర్థంచేసుకోవాలి.
కేవలం 'అవును' లేదా 'కాదు'
అని కాకుండా వివరించండి
పిల్లలు ఏదైనా అడిగినప్పుడు కేవలం “అవును” లేదా “కాదు” అని చెప్పకుండా కాస్త వివరంగా చెప్పండి. ఉదాహరణకు “నేను ఆట ఆడవచ్చా?” అని అడిగితే “అవును, కానీ హోమ్ వర్క్ ముగించాక” అని చెప్పండి. ఎందుకు అలా చెప్పారో కూడా వివరించండి. ఇలా చేయడం వల్ల పిల్లలు కారణాలను అర్థం చేసుకోవడం నేర్చుకుంటారు.
కలిసి ప్రశ్నలు కనిపెట్టండి
రోజూ ఒక ‘ప్రశ్నల గంట’ పెట్టుకోండి. ఆ సమయంలో మీరు పిల్లలకు ప్రశ్నలు అడగండి. పిల్లలు మీకు ప్రశ్నలు వేయమనండి. “ఈ రోజు నీకు తెలిసిన కొత్త విషయం ఏది?” “ఈ రోజు నిన్ను ఆశ్చర్యపరిచిన విషయం ఏది?” “ఈ రోజు నువ్వు ఎవరినైనా ప్రశ్న అడిగావా?” – ఇలా ప్రశ్నల గురించే మాట్లాడటం అలవాటు చేసుకోండి. ఇది పిల్లల్లో ప్రశ్నించే తత్వాన్ని సహజంగా పెంపొందిస్తుంది.
వీలుగా సమయం ఇవ్వండి
ఈ రోజుల్లో పిల్లలు మొబైల్, టీవీ, గేమ్స్ మధ్య చాలా బిజీగా ఉంటారు. వారికి ఆలోచించడానికి, ప్రశ్నించడానికి సమయం ఉండదు. రోజూ కనీసం 30-45 నిమిషాలు ఫోన్లు, టీవీలు పక్కన పెట్టి పిల్లలతో మాట్లాడండి. ఆ సమయంలో వారు ఏదైనా అడగవచ్చు, మీరు ఏదైనా అడగవచ్చు. ఈ స్వేచ్ఛా వాతావరణం పిల్లల్లో ప్రశ్నించే అలవాటును పెంపొందిస్తుంది.
తప్పులను సహనంతో స్వీకరించండి
ప్రశ్నించే పిల్లలు కొన్నిసార్లు తప్పులు చేస్తారు. తప్పు సమాధానం చెప్పినా, తప్పు ప్రశ్న అడిగినా వారిని తిట్టకండి. “అలా కాదు, ఇలా ఆలోచించు” అని ప్రేమగా చెప్పండి. తప్పులు చేయడం భయం లేని వాతావరణంలోనే పిల్లలు స్వేచ్ఛగా ప్రశ్నిస్తారు. చివరిగా పిల్లల్లో ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించడం అంటే వారికి ఆలోచించే శక్తిని, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని, ప్రపంచాన్ని అర్థం చేసుకునే దృక్పథాన్ని ఇవ్వడమే. ఇది వారి జీవితాంతం ఉపయోగపడే గొప్ప నైపుణ్యం.
గుర్తుంచుకోండి : ఈ రోజు మీ పిల్లలు అడిగే చిన్న చిన్న ప్రశ్నలే రేపు వారిని గొప్ప ఆవిష్కర్తలుగా, ఆలోచనాపరులుగా, సమస్యా పరిష్కర్తలుగా మారుస్తాయి. వారి ప్రశ్నలను ఆహ్వానించండి. వారి ఆలోచనలను గౌరవించండి. ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించండి.
ఎందుకంటే : ప్రశ్నలు లేని మనసు నిద్రిస్తున్న మనసు. ప్రశ్నలు ఉన్న మనసు మేల్కొన్న మనసు. మీ పిల్లల మనసు ఎప్పుడూ మేల్కొని ఉండాలి కదా..








కామెంట్‌లు (0)