ఆదివారం, 20 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionటాక్సిక్ స్నేహాలపై అప్రమత్తంగా..

4 గంటల క్రితం

mother.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 20, 2026, 09:59 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

టీనేజ్ అంటే అందమైన రంగుల ప్రపంచం. ఈ వయసులో హార్మోన్ల హెచ్చుతగ్గులతో పాటు భావోద్వేగాల కల్లోలం కూడా తికమక పెడుతుంటుంది. స్నేహితులే ప్రపంచంగా భావించే ఈ దశలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా, స్నేహం అనే ముసుగులో పిల్లలు ‘టాక్సిక్’ బంధాల్లో చిక్కుకునే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాంటి పరిస్థితుల నుంచి పిల్లలను కాపాడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. దీన్ని పిల్లలు గుర్తించేలా చేయడమే పేరెంట్స్ ప్రధాన ధ్యేయం.

టాక్సిక్ ఫ్రెండ్ షిప్ అంటే ఏమిటో పేరెంట్స్ గా ముందు మీరు అర్థం చేసుకోవాలి. చిన్నప్పుడు బొమ్మలు, చాక్లెట్లే గొడవలకు కారణమవుతాయి. కానీ టీనేజీకి వచ్చేసరికి స్నేహ సంబంధాల సమీకరణాలు పూర్తిగా మారిపోతాయి. చాలామంది పిల్లలకు ఈ వయసులో స్నేహితులే లోకంగా మారతారు. కష్టసుఖాల్లో తోడుంటూ సరదాగా గడిపే స్నేహం ఎంతో ఆనందాన్నిస్తుంది. కానీ అందుకు భిన్నంగా, తన స్నేహితురాలిని ఎప్పుడూ నలుగురిలోనూ కించపరచాలని చూడటం, ప్రైవసీని పబ్లిక్ చేయడం, చిన్నచిన్న విషయాలకే నిలదీయడం, నియంత్రించడం, మాట వినకపోతే బ్లాక్ మెయిల్ చేయడం వంటివి చేస్తుంటే ఆ వ్యక్తి టాక్సిక్ ఫ్రెండ్ అని గుర్తించాలి.

పరిశీలించడం ముఖ్యం..

పిల్లల ప్రవర్తనలో మార్పులు, వారి మానసిక స్థితిలో హెచ్చుతగ్గులు గమనించినప్పుడు, వారి స్నేహం యొక్క స్వభావాన్ని పరిశీలించడం చాలా ముఖ్యం. ఎప్పుడూ నవ్వుతూ తిరిగే అమ్మాయి హఠాత్తుగా ఎవరితోనూ మాట్లాడకుండా గదిలో తలుపు వేసుకుని కూర్చోవడం, రాత్రిపూట ఫోన్ చూస్తూ ఏడవడం, ‘నాకెవరూ ఫ్రెండ్స్ లేరు’, ‘నేనంటే ఎవరికీ ఇష్టం లేదు’ అని తరచూ చెప్పడం వంటి సంకేతాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తం కావాల్సిందే. ఇవన్నీ పిల్లలు టాక్సిక్ స్నేహాల బారిన పడినట్లు సూచించే హెచ్చరిక సంకేతాలు.

పిల్లలు పెరిగి పెద్దవుతున్న కొద్దీ వారి స్నేహితుల వలయం పెరుగుతుంది. అప్పుడు వారు చెడు స్నేహాల బారిన పడే ప్రమాదం క్రమంగా పెరుగుతుంది. చాలా సందర్భాల్లో, తమ పిల్లలు తప్పుడు వ్యక్తుల ప్రభావానికి లోనవుతున్నారని తల్లిదండ్రులు చాలా ఆలస్యంగా గ్రహిస్తారు. ప్రతి ఒక్కరితో స్నేహం చేయడం మంచిది కాదని, వారి వల్ల హాని ఉంటే కచ్చితంగా వారికి దూరంగా ఉండాలని పిల్లలకు చెప్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే.

images.jpg

మంచి.. చెడు విచక్షణ నేర్పాలి..

ఒక మంచి స్నేహానికి ఏది దోహదపడుతుందో, ఏది చేయదో పిల్లలకు నేర్పించడం చాలా అవసరం. గౌరవం, మద్దతు, ఆనందం వంటివి మంచి స్నేహానికి పునాదులు. అలాగే ఎల్లప్పుడూ తమ ఇష్టానికి తగ్గట్టు మాట్లాడటం, తక్కువ చేయడం, అబద్ధం చెప్పడం, బ్లాక్మెయిల్ చేయడం, బెదిరించడం లేదా ఒత్తిడి చేయడం వంటివి టాక్సిక్ స్నేహం యొక్క లక్షణాలని పిల్లలకు అర్థమయ్యేలా వివరించాలి. ఒక స్నేహితుడు వారిని ఏదైనా తప్పు చేయమని రెచ్చగొడితే, వారిని ఇబ్బంది పెడితే, వారి వస్తువులను పాడు చేస్తే లేదా వారు తమ గురించి చెడుగా భావించేలా చేస్తే, ఇవి మంచి స్నేహానికి సంకేతాలు కావని స్పష్టం చేయాలి.

ఆంక్షలు కాదు.. ధైర్యం చెప్పాలి..

పిల్లలను తప్పుడు మార్గం నుంచి కాపాడటానికి కఠినమైన ఆంక్షలు సరిపోవు. పిల్లలతో మనసు విప్పి మాట్లాడటం, వారి స్నేహితులను గమనించడం, మంచి చెడుల మధ్య తేడాను వివరించడం, వారిని సానుకూల కార్యకలాపాల్లో నిమగ్నం చేయడం వంటివి పిల్లలను సరైన మార్గంలో నడిపిస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలతో స్నేహం గురించి తరచుగా మాట్లాడటం, వారి స్నేహితులను తెలుసుకోవడం, వారి భావాలను గౌరవించడం వంటివి చేయాలి. ఒకవేళ స్నేహం ప్రతికూలంగా ఉంటే, పిల్లలకు ధైర్యం చెప్పి, ఆ బంధం నుండి బయటపడటానికి సహాయపడాలి.

​అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే, పిల్లలు తమ తల్లిదండ్రులు తమ మాట వింటారని, తమ భావోద్వేగాలను అర్థం చేసుకుంటారని భావించాలి. అప్పుడే వారు తమ సమస్యలను బహిరంగంగా పంచుకోగలుగుతారు. పిల్లల స్నేహం విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండటమే కాకుండా, వారికి సరైన మార్గనిర్దేశం చేయడం ద్వారా ఆరోగ్యకరమైన స్నేహ సంబంధాలను ఏర్పరచుకునే శక్తిని పిల్లలకు అందించాలి. మీ పిల్లలు ఎప్పుడూ సురక్షితంగా ఉండి, మంచి విలువలతో పెరగాలని మీరు కోరుకుంటే, వారి స్నేహ సంబంధాల పట్ల మీరు చూపించే శ్రద్ధ, అవగాహనే వారికి అతిపెద్ద ఆసరా.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్