పిల్లలు పెరిగే క్రమంలో అనేక రకాల ప్రవర్తనలను ప్రదర్శిస్తారు. కొన్ని మంచివి, కొన్ని తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టేవి. "పొరపాటు" అనే మాట వినగానే చాలామంది తల్లిదండ్రులు ఆందోళన చెందుతారు. కానీ పిల్లల ప్రవర్తనలోని "పొరపాట్లు" అనేవి వాస్తవానికి వారి ఎదుగుదలలో భాగమే. అవి వారి మనస్సు ఎలా పనిచేస్తుందో, వారు ప్రపంచాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నారో తెలిపే సంకేతాలు. తల్లిదండ్రుల పాత్ర ఈ ప్రవర్తనలను అణచివేయడం కాదు; వాటిని అర్థం చేసుకొని సరైన దిశలో మళ్లించడం.
ఒకప్పుడు పిల్లల ప్రవర్తనలో ఏవైనా పొరపాట్లు కనిపిస్తే.. చిన్నపిల్లలు కదా... పెద్దయ్యాక వాళ్లే నేర్చుకుంటారులే! అని వదిలేసేవారు. కానీ, సమాచారం వేగంగా మారుతూ, సాంకేతికత అందుబాటులోకి వచ్చేసిన నేటి కాలంలో పెద్దయ్యాక తెలుసుకుంటారని వేచి చూడడం అంటే.. పిల్లల భవిష్యత్తును ప్రమాదంలో పడేయడమే. మెదడు అత్యంత చురుగ్గా, కొత్త విషయాలను త్వరగా గ్రహించే బాల్య దశలోనే పిల్లలకు మంచి-చెడు, తప్పొప్పుల సరిహద్దులను స్పష్టంగా వివరించాలని మానసిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
పొరపాట్లు అంటే ఏమిటి?
పిల్లలు ఏడవడం, కోపం ప్రదర్శించడం, పట్టుబట్టడం, అబద్ధం చెప్పడం, కొట్టడం, వస్తువులను విసిరేయడం వంటివి చేస్తుంటారు. పెద్దల దృష్టికి ఇవి తప్పు ప్రవర్తనలుగా కనిపిస్తాయి. కానీ పిల్లల మెదడు ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందదు. భావోద్వేగాలను నియంత్రించుకునే పరిపక్వత ఉండదని మనస్తత్వ శాస్త్ర పరిశోధనలు చెబుతున్నాయి. అంటే పిల్లలు కోపం, నిరాశ, భయం వంటి భావోద్వేగాలను పెద్దల్లా నిర్వహించలేరు. వారి ప్రవర్తన ఆ భావోద్వేగాలకు వ్యక్తీకరణ మాత్రమే. ఉదాహరణకు, మూడేళ్ల పిల్లవాడు దుకాణంలో చాక్లెట్ అడిగి, దొరక్కపోతే నేలపై పడి ఏడుస్తాడు. ఇది తన కోరికను వ్యక్తపరిచే ఏకైక మార్గం అది. అలాగే పదేళ్ల పిల్లవాడు పరీక్షలో ఓడిపోయాక అబద్ధం చెప్పడం వెనుక శిక్షకు భయపడే భావన ఉంటుంది. ప్రవర్తనను చూసి తీర్పు చెప్పే ముందు దాని వెనుక ఉన్న వాస్తవాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యం.
సమతుల్యత పాటించాలి..
పిల్లల ప్రవర్తన పొరపాట్లను ఎదుర్కోవడంలో తల్లిదండ్రుల స్పందన నిర్ణాయక పాత్ర పోషిస్తుంది. కొందరు తల్లిదండ్రులు తక్షణమే కోప్పడతారు, కొందరు పట్టించుకోకుండా వదిలేస్తారు, మరికొందరు అతిగా లొంగిపోతారు. ఇవేవీ సమస్యను పరిష్కరించవు. మొదటిది పిల్లల్లో భయాన్ని, దూరాన్ని పెంచుతుంది. రెండోది ప్రవర్తనను మరింత పెంచుతుంది. మూడోది పిల్లలను అతి కోరికలుగా మారుస్తుంది.
సరైన విధానం ఏమిటంటే, మొదట ప్రశాంతంగా ఉండడం. పిల్లవాడు కోపంగా ఉన్నప్పుడు పెద్దలూ కోప్పడితే పరిస్థితి మరింత ఉద్రిక్తమవుతుంది. "నీకు కోపం వచ్చిందని నాకు అర్థమవుతోంది" అని చెప్పడం ద్వారా పిల్లల భావనను గుర్తిస్తూ, తర్వాత ప్రవర్తనకు హద్దులు విధించడం అవసరంం. ఉదా:"కోపం రావడం తప్పు కాదు, కానీ కొట్టడం తప్పు" అని చెప్పడం. ఇది భావనను అంగీకరిస్తూనే ప్రవర్తనకు స్పష్టమైన హద్దు పెడుతుంది.
స్థిరత్వం, స్పష్టత ముఖ్యం..
పిల్లలు నియమాలను పరీక్షిస్తుంటారు. ఈ రోజు ఒక పనికి అనుమతిచ్చి, రేపు అదే పనికి తిరస్కరిస్తే వారు గందరగోళానికి గురవుతారు. తల్లిదండ్రులు ఇద్దరూ ఒకే విధమైన నియమాలను పాటించడం, వాటిని స్థిరంగా అమలు చేయడం అవసరం. నియమాలు స్పష్టంగా, సులభమైన మాటల్లో చెప్పాలి. "సాయంత్రం ఎనిమిది గంటలకు పడుకోవాలి" అనే నియమం ఉంటే, ప్రతిరోజూ పాటించాలి. ఒకరోజు మినహాయింపు ఇస్తే, మరుసటి రోజు పిల్లవాడు అదే మినహాయింపు కోరుతాడు.
శిక్ష విషయంలోనూ స్పష్టత అవసరం. శారీరక శిక్ష లేదా అవమానకరమైన మాటలు పిల్లల మనస్సుపై దీర్ఘకాలిక ప్రభావం చూపుతాయి. వాటికి బదులు సహజ పరిణామాలు అనుసరించడం మంచిది. ఉదాహరణకు, బొమ్మలు చెదరగొట్టిన పిల్లవాడు వాటిని స్వయంగా సర్దాలి. ఇది శిక్ష కాదు; బాధ్యతను నేర్పే అవకాశం.
ప్రశంస మంచి థెరిపీ..
చాలామంది తల్లిదండ్రులు పిల్లలు తప్పు చేసినప్పుడే గమనిస్తారు. మంచి ప్రవర్తన చూపినప్పుడు మౌనంగా ఉంటారు. ఇది పిల్లలను తప్పు చేయడం ద్వారానే దృష్టిని ఆకర్షించవచ్చని నేర్పుతుంది. మంచి ప్రవర్తనను గుర్తించి ప్రశంసించడం ద్వారా ఆ ప్రవర్తన పునరావృతమయ్యే అవకాశం పెరుగుతుంది. "నువ్వు ఆటి బొమ్మలు సర్ది పెట్టావు, చాలా బాగుంది" అనే ఒక చిన్న మాట పిల్లవాడిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ప్రశంస ఫలితాన్ని కాకుండా ప్రయత్నాన్ని గుర్తించాలి. "నువ్వు గెలిచావు" కాకుండా "నువ్వు చాలా కష్టపడ్డావు" అని చెప్పడం ఎదుగుదల మనోభావాన్ని పెంచుతుంది.
పెద్దల ఆచరణ కీలకం..
పిల్లల ప్రవర్తన తరచుగా తల్లిదండ్రుల ప్రవర్తనను ప్రతిబింబిస్తుంది. పెద్దలు కోపంగా మాట్లాడితే పిల్లలు కూడా అలాగే మాట్లాడతారు. ఇంట్లో ఎక్కువగా గొడవలు జరిగితే పిల్లలు ఆ ఉద్రిక్తతను ప్రవర్తనలో చూపిస్తారు. కాబట్టి పిల్లల ప్రవర్తనను మార్చాలనుకునే ముందు తల్లిదండ్రులు తమ ప్రవర్తనను పరిశీలించుకోవాలి. పిల్లలు చెప్పిన మాటలను కాకుండా చేసే పనులను ఎక్కువగా గమనిస్తారు. కాబట్టి ఆచరణ ప్రభావవంతం.
భావోద్వేగాలను గుర్తించడం..
పిల్లలు తమ భావోద్వేగాలను గుర్తించడం, వాటికి పేరు పెట్టడం నేర్చుకోవాలి. "నీకు కోపం వచ్చిందా?", "నువ్వు భయపడుతున్నావా?", "నీకు బాధగా ఉందా?" అని అడగడం ద్వారా వారు తమ భావనలను గుర్తించడం నేర్చుకుంటారు. భావనకు పేరు తెలిస్తే దానిని వ్యక్తీకరించడం సులభమవుతుంది. అప్పుడు కొట్టడం, ఏడవడం వంటి ప్రవర్తనల అవసరం తగ్గుతుంది. "కోపం వచ్చినప్పుడు ఇలా మాట్లాడు" అని ప్రత్యామ్నాయ మార్గాలను నేర్పడం ముఖ్యం.
పరిమితులు... స్వేచ్ఛ
పిల్లలకు హద్దులు అవసరం. అదే సమయంలో స్వేచ్ఛ కూడా అవసరం. అతిగా కట్టుబాట్లు విధిస్తే పిల్లలు భయంతో లేదా తిరుగుబాటుతో స్పందిస్తారు. పూర్తి స్వేచ్ఛ ఇస్తే క్రమశిక్షణ లోపిస్తుంది. సమతుల్యత కీలకం. చిన్న చిన్న విషయాల్లో పిల్లలకు ఎంపిక చేసుకునే అవకాశం ఇవ్వడం.. ఏ దుస్తులు వేసుకోవాలి, ఏ ఆట ఆడాలి .. వారిలో స్వతంత్రతను, బాధ్యతను పెంచుతుంది. పెద్ద విషయాల్లో తల్లిదండ్రుల మార్గదర్శకత్వం అవసరం. పిల్లల ప్రవర్తన పొరపాట్లు అనేవి శత్రువులు కావు; అవి సంభాషణకు ఆహ్వానాలు. ప్రతి పొరపాటు వెనుక ఒక అవసరం, ఒక భావన, ఒక పాఠం ఉంటుంది. తల్లిదండ్రులు శిక్షకులుగా కాకుండా మార్గదర్శకులుగా, వినేవారుగా, అర్థం చేసుకునేవారుగా మారాలి. అప్పుడు పిల్లలు ఆత్మవిశ్వాసంతో, భావోద్వేగ సమతుల్యతతో ఎదుగుతారు. పేరెంటింగ్ అనేది పిల్లలను మార్చే ప్రక్రియ కాదు; తల్లిదండ్రులు తమను తాము మార్చుకుంటూ పిల్లలతో కలిసి ఎదిగే ప్రయాణం. ఆ ప్రయాణంలో సహనం, ప్రేమ, స్థిరత్వం మూడూ కలిసి ఉంటే ప్రతి పొరపాటు ఒక అవకాశంగా మారుతుంది.
పోలికలు వద్దు..
ప్రవర్తన మార్పు ఒక్కరోజులో జరగదు. పిల్లలు పొరపాట్లు చేస్తూనే ఉంటారు. తల్లిదండ్రులు ప్రతిసారీ స్థిరంగా, ప్రశాంతంగా స్పందిస్తే క్రమంగా మార్పు కనిపిస్తుంది. పిల్లలను ఇతరులతో పోల్చడం, "నీ వయసులో వాడు ఇలా చేస్తాడు" అని చెప్పడం వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంది. ప్రతి పిల్లవాడూ వేరు. వారి స్వంత వేగంతో ఎదుగుతారు.








కామెంట్‌లు (0)