డబ్బు అంటే ఏమిటి, దాన్ని ఎలా సంపాదించాలి, ఎలా ఖర్చు చేయాలి, ఎంత పొదుపు చేయాలి.. అనే విషయాలను పిల్లలు తమంతట తామే తెలుసుకోలేరు. ఇవి ఇంట్లో నేర్చుకునే పాఠాలు. బడి చదువు ఎంత ముఖ్యమో, డబ్బు విలువ తెలియడం కూడా అంతే ముఖ్యం. ఈ రోజు చిన్నగా నేర్పిన లెక్క, రేపు వాళ్ల జీవితాన్ని ఆర్థికంగా నిలబెట్టగలదు. అందుకే పిల్లలకు డబ్బు లెక్క నేర్పడం ప్రతి తల్లిదండ్రుల బాధ్యత.
పిల్లలకు డబ్బు మీద అవగాహన కలగాలంటే ముందు ఇంట్లో వాతావరణం అందుకు అనుకూలంగా ఉండాలి. డబ్బు అనేది మాట్లాడకూడని విషయం కాదు. కుటుంబ బడ్జెట్, నెలవారీ ఖర్చులు, పొదుపు గురించి పిల్లల ముందు మాట్లాడవచ్చు. వాళ్ల వయసుకు తగ్గట్టు సరళంగా వివరించాలి. ఇంటికి నెలకు ఎంత వస్తుంది, కరెంటు బిల్లు, పాలు, కూరగాయలు, బడి ఫీజు ఇలా ఎంత ఖర్చు అవుతుందో చెప్పడం ద్వారా డబ్బు అనేది గాలిలోంచి రాదని, దాని వెనుక శ్రమ ఉంటుందని పిల్లలు గ్రహిస్తారు.
ఖర్చు చేయడం..
పిల్లలకు డబ్బు నేర్పడంలో అత్యంత ప్రభావవంతమైన మార్గం చిన్నప్పటి నుంచే జేబు డబ్బు, అంటే పాకెట్ మనీ ఇవ్వడం. వారానికి లేదా నెలకు ఒక నిర్దిష్ట మొత్తం ఇచ్చి, దాన్ని ఎలా ఖర్చు చేయాలో వాళ్లే నిర్ణయించుకోనివ్వాలి. అన్ని కోరికలూ ఒకేసారి తీరవని, ఏది ముఖ్యమో దానికి ముందు ప్రాధాన్యం ఇవ్వాలనీ ఈ అలవాటు ద్వారా నేర్చుకుంటారు. డబ్బు అయిపోతే ఆ నెల మొత్తం ఎదురు చూడాల్సి వస్తుందని తెలిసినప్పుడు, ఖర్చు చేయడంలో జాగ్రత్త వస్తుంది. ఇది వాళ్లలో స్వయం క్రమశిక్షణను పెంచుతుంది.
పొదుపు పాఠాలు..
పొదుపు అలవాటు పిల్లలకు చిన్నప్పుడే నేర్పాలి. పిగ్గీ బ్యాంకు లేదా ఒక చిన్న డబ్బా పెట్టి, అందులో రోజూ లేదా వారానికి కొంత డబ్బు వేయడం ప్రారంభించాలి. కొంత కాలం తర్వాత ఆ డబ్బుతో తనకు నచ్చిన వస్తువు కొనుక్కోనివ్వడం ద్వారా పొదుపు చేసిన డబ్బుకు ఉన్న ఆనందం, విలువ వాళ్లకు అర్థమవుతుంది. బ్యాంకు ఖాతా తెరిచి, అందులో వేసిన డబ్బు వడ్డీ రూపంలో పెరుగుతుందని చిన్నగా చెప్పడం ద్వారా ఆర్థిక అక్షరాస్యతకు మంచి బీజం పడుతుంది.
సంపాదన గురించి చెప్పాలి..
డబ్బు సంపాదించడం గురించి కూడా పిల్లలకు తెలియాలి. ఇంట్లో చిన్న చిన్న పనులు చేయడం, బడి సామగ్రి సర్దుకోవడం, మొక్కలకు నీళ్లు పోయడం వంటి వాటికి ప్రోత్సాహకంగా కొంత డబ్బు ఇవ్వవచ్చు. కానీ ప్రతి పనికీ డబ్బు ఇవ్వడం మంచిది కాదు. ఇంటి పనులు చేయడం వాళ్ల బాధ్యత అని, కుటుంబంలో భాగమని కూడా వాళ్లు గ్రహించాలి. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుందనే భావన కలగడం ముఖ్యం. అదే సమయంలో డబ్బు కోసమే ప్రతిదీ చేయాలనే దృష్టి రాకుండా చూసుకోవాలి.
ఆరోగ్యకరమైన ఆలోచనలు..
పిల్లల ముందు తల్లిదండ్రులు చేసే ప్రవర్తనే వాళ్లకు గొప్ప పాఠం. మీరు ఖర్చు చేసే విధానం, పొదుపు చేసే అలవాటు, అప్పులు తీసుకునే సందర్భాలు, బడ్జెట్ ప్రణాళిక వంటివి పిల్లలు గమనిస్తూనే ఉంటారు.
అనవసరంగా ఖర్చు చేయకుండా, అవసరానికి మించి కొనకుండా ఉండటం ద్వారా మీరు వాళ్లకు ఆదర్శంగా నిలుస్తారు. డబ్బు విషయంలో భయం లేదా అసూయ కలిగించకుండా, ఆరోగ్యకరమైన దృక్పథాన్ని అందించాలి. డబ్బు ఉన్నవాళ్లు గొప్ప, లేనివాళ్లు తక్కువ అనే భావన పిల్లల్లో రాకూడదు. డబ్బు అనేది జీవితాన్ని సులభతరం చేసే సాధనం తప్ప, జీవిత లక్ష్యం కాదని వాళ్లు తెలుసుకోవాలి.
డిజిటల్పై అవగాహన..
ఈ రోజుల్లో డిజిటల్ లావాదేవీలు పెరిగాయి. ఫోన్ తో చెల్లించడం, ఆన్లైన్ షాపింగ్ చేయడం పిల్లలు చూస్తున్నారు. కానీ అప్పుడు డబ్బు ఖర్చు అవుతున్న భావన వాళ్లకు కలగదు. అందుకే నగదు రూపంలో లెక్క నేర్పడం ఇప్పటికీ ముఖ్యం. ఒక వస్తువు ధర, దానికి పన్ను, డెలివరీ ఛార్జీ వంటివి కలిపితే ఎంత అవుతుందో చూపించడం ద్వారా డిజిటల్ ఖర్చు గురించి కూడా అవగాహన కలుగుతుంది.
ప్రణాళిక వేసుకునేలా..
పిల్లలకు డబ్బు లెక్క నేర్పడం ఒక్క రోజులో జరిగే పని కాదు. ఇది సాగే ప్రక్రియ. వయసుకు తగ్గట్టు బాధ్యతలు పెంచుతూ, తప్పులు చేసుకోనిచ్చి, వాటి నుంచి నేర్చుకునే అవకాశం ఇవ్వాలి. కొన్నిసార్లు డబ్బు అయిపోవడం, కోరుకున్న వస్తువు కొనలేకపోవడం వంటివి జరిగితే అది కూడా ఒక పాఠమే. ఆ అనుభవం నుంచి వాళ్లు తదుపరిసారి మెరుగ్గా ప్రణాళిక వేసుకుంటారు.
పిల్లలకు డబ్బు విలువ నేర్పడం అంటే వాళ్లను పొదుపరులుగా మార్చడం మాత్రమే కాదు, బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడం. డబ్బు ఉన్నా లేకపోయినా సంతృప్తిగా, గౌరవంగా జీవించడం ఎలాగో నేర్పడం. ఈ పాఠాలు ఇంటి నుంచే మొదలవ్వాలి. నేటి చిన్న అలవాట్లే రేపటి ఆర్థిక భద్రతకు పునాది. అందుకే ప్రతి తల్లిదండ్రీ తమ పిల్లలకు డబ్బు లెక్క నేర్పడాన్ని ఒక ముఖ్యమైన పేరెంటింగ్ బాధ్యతగా భావించాలి.








కామెంట్లు (0)