బాల్యాన్ని కప్పేసిన మేటలు కింద
జ్ఞాపకాల వెతుకులాటలో
నేనూ, నా గతం
పోటా పోటీగా తవ్వుతూనే ఉన్నాం
తొలూత, ఊరి బడే దొరికింది
గోడకు అతుక్కుపోయిన కడుపుతో
నేను కూర్చున్న చోటు ఖాళీగానే ఉంది
ఎక్కడో, దూరాన పొలాల గట్లంటా
బడితె పట్టుకొని ధా..ధా.. అంటూ
బక్కలను అదిలిస్తున్న కేకలైతే
బడి మధ్యకు వినబడుతూనే ఉన్నాయి
పాపిష్టి కడుపుకు లొంగిపోయి
కన్నవాళ్ళ తీపిని నిలువునా చీల్చి
ఖైదీలమయిన హాస్టల్ గోడల మధ్య
మమకారాలను బలిచ్చేసిన గంజినీళ్ళు
బతుకు నిండా పారుతూనే ఉన్నాయి
మార్కుల గానుగ చుట్టూ
గుడ్డెద్దుల్లా తిరగలి చుడుతూ
స్కూల్లా ఆశల చక్రాల్లో నలిగిపోయి
చదువుకూ స్నేహానికి, రెంటికీ చెడి
పెచ్చులు ఊడిపోయిన మస్తిష్కంలా
పేరు పెట్టి పిలిచినా పలకని,
అనాథ మనిషిలానే ఉన్నాను
పట్టు తప్ప్పుతున్న రెక్కల కష్టం నుండి నాగలి కర్రును గుంపాలకెత్తుకొని
చిలక్కొయ్యకు కట్టేసిన చదువుల
చొక్కా ఒంటిపైనవి పచ్చబొట్టులంటేందేగానీ
మచ్చగట్టేసిన ఆకలి దప్పిక గాయాలనీ
ఇసుమంత అనుమానం నాక్కూడా రాలేదు
సరిగ్గా మొగ్గే తొడగని మీసాల నుండి
బోసిపోయిన బాల్యాన్ని మూటగట్టుకొని
అట్నుంచి అటే, ఏ కూతకో వేలాడుతూ,
సరిహదుల్లో కళ్ళు పొదిగేందుకు పోతే
బాల్యం పట్టుమీదే కూచుని ఉంటుందా?
జ్ఞాపకాల్లో తవ్వుతున్న మట్టంతా
వర్తమానాన్ని చుట్టుముట్టేస్తుంటే
ఉక్కిరిబిక్కిరై, నేనైతే బయటపడ్డానుగానీ
నా గతమే, తిరిగిరాని బాల్యంలో
తీయని జ్ఞాపకాలకై దేవుతూనే ఉంది
వినోద్ కుత్తుం
9634314502








కామెంట్‌లు (0)