నాగలి మొన
భూమిని చీల్చిన ప్రతిసారీ
మట్టితో ఒక మౌన ఒప్పందం!
నేలతల్లి గర్భంలో
అప్పుల పత్రాల ముద్రలు
ఎండిన చెరువు కట్టపై
గడ్డిపరకల నిట్టూర్పుల సెగలు!
ఒకప్పుడు ఆకాశం
తన అందాన్ని చూసి మురిసిన నీలి జలాశయం
ఇప్పుడు కన్నీటి పొరల వెనుక
కరిగిపోయిన దృశ్యం
బావి గొంతు ఎండిపోయింది
కాలువ దారి తప్పింది
పొలిమేరల్లో పంటలకు బదులు
రియల్ ఎస్టేట్ రాళ్లు మొలకెత్తుతున్నాయి
చేల కంచెల్ని తెంచుకుని
ధరలు ఆకాశానికి ఎగబాకుతుంటే
పచ్చదనం సమాధి అయిన చోటే
కాంక్రీటు అంతస్తులు ప్రాణం పోసుకుంటున్నాయి
మట్టిలోకి ఇంకాల్సిన వాన చినుకుల్ని
సిమెంటు రోడ్లపైకి నెట్టేసి
దానికి 'వరద' అని
పేరు పెట్టుకున్నాం
ఆకాశం వైపు చూస్తున్న
రైతు కళ్లలో కారుమేఘాలు
వాన కోసం తపన
బతుకును గెలవాలనే మొండితనం
అన్నీ కలిసి గుండెల్లో విరబూసే
ఓ పచ్చని కల
కోరలు చాచి నిలబడ్డ వడ్డీ
కుంచించుకుపోతున్న పంట పొలాలు
మిగిలిన కాస్త భూమి పైనా
పెత్తనం వేరెవరిదో
చీకటి ముసురుకున్న వేళ
పొలిమేర గట్టున కూర్చుని
మట్టిని దోసిట్లోకి తీసుకుంటాడు
వేళ్ల సందుల్లోంచి జారిపోతూ
ఆరుగాలం శ్రమ..
చెమట..మట్టి కలగలసిన
నెత్తుటి సుగంధం
నేల తడవకముందే
బ్యాంకు నోటీసు తలుపు తడుతుంది
నోటి కాడి ముద్ద కూడా
ఎగతాళి చేస్తుంది
అయినా సరే...
అతని చేతులు విత్తనాన్ని వదిలిపెట్టవు!
ఏదో ఒకరోజు...
ఈ మట్టి తన దుఃఖాన్ని తాగి
మళ్లీ పచ్చటి నవ్వులు పూయిస్తుందనే
నమ్మకమే ఊపిర్లూదుతుంది
మట్టితో..బతుకుతో
ఆఖరి ఒప్పందం నెరవేరని నాడు...
రేపటి రోజున ఈ నేలపై
మనిషి మిగిల్చిన కన్నీళ్లే మొలకెత్తుతాయి!
వైష్ణవి శ్రీ
8074210263








కామెంట్‌లు (0)