పరీక్ష ఫెయిలైనందుకో...
పేపర్లు లీక్ అయినందుకో...
రాసిన పేపర్లు కుట్రపూరితంగా
తారుమారైనందుకో...
అందుకో... మరొకందుకో...
గుండె లోతుల్లోంచి సుళ్ళు తిరుగుతున్న
దుఃఖ సముద్రపు తాకిడికి
కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్న కన్నీటి పక్షులు
కళ్ళ మేఘాల్లోంచి రెక్కల్ని విదిల్చుకుంటూ
చెంపల కొమ్మల మీద చడీచప్పుడూ
లేకుండా కూలబడుతుంటాయి!
అప్పుడు కాసేపు దిక్కు తోచదు
దారి కనబడదు
కాలం కొండరాతి బండలా
కదలదూ మెదలదు
బతుకును వరించే ధైర్యాన్ని కోల్పోయి
చావుకు తెగించే దుందుడుకు చర్యలకు
గుండె సమాయత్తం అవుతున్న
సంధి కాలం అది!
అలాంటి దయనీయ స్థితిలోకి
దివాళాకోరు వ్యవస్థ
నిర్దాక్షిణ్యంగా నెట్టేసినప్పుడు
బళ్ళున పగిలిన అక్వేరియంలోంచి
తుళ్ళిపడిన చేపపిల్లల్లా
గిలగిలా కొట్టుకొని గోస పెట్టకు!
స్థిమ్మితంగా కూర్చొని, దొరికిన
స్పూర్తివంతమైన వొక కవిత చదువు!
చీకటి సంద్రంలోంచి చీల్చుకొచ్చిన
సూర్యబింబంలాంటి వొక పద్యాన్ని పఠించు!
నరాల్లోంచి నెత్తుటి విద్యుత్ తరంగాల్ని
పొర్లెత్తించే వొక పోరాటగీతాన్ని ఆలపించు!
అప్పుడా కవితే
చదువుల పరీక్షల సంసార బంధాల
తుప్పలూ డొంకల మధ్య
తప్పిపోయిన నీ తలపుల గొర్రెపిల్లకు
దారి చూపే ఆపన్న హస్తమై
గుండె బరువును దించి
గుచ్చి బాధిస్తున్న నొప్పి నుంచి
గుప్పెడు ఉపశాంతిని ప్రసాదిస్తుంది!
అప్పుడా పద్యమే
రమ్యమైన రేపటి గమ్యానికి
అడ్డు తగులుతున్న గడ్డుకాలం
నడ్డి విరగ్గొట్టే ఆత్మీయ నేస్తమై
అభిజాత్యపు అహంకారంతో
కళ్ళు పొరలు గమ్మిన
అవినీతి దున్నపోతుల కొమ్ములు
విరవగల దమ్ము చూపిస్తుంది!
అప్పుడా పాటే
మొద్దు బారిన మెదడు
నాడుల్ని సవరించి
కమ్ముకున్న చిమ్మచీకట్లను
తరిమికొట్టే వెలుగు కిరణాల
కాంతి పిడికిళ్ళతో నిద్ర నటిస్తున్న
నిర్వాకపు గుండెల మీద
తాండవ నృత్యం చేసి తాట తీస్తుంది !
కవిత్వానికి అంత ప్రాణశక్తి ఉంది
అది నీ గాయాన్ని మాత్రమే కాదు
రాజ్యం రోగాన్ని సైతం నయంచేసే సంజీవని!
అది చూపించిన కంటకాల
మంటల దారుల్లోంచి ముందుకుపో!
పీడన లేని ఒక సామ్యవాద స్వర్గసీమ
పూల దోసిళ్లతో స్వాగతం పలుకుతుంది!
పతివాడ నాస్తిక్
9441724167









కామెంట్‌లు (0)