ఆదివారం, 12 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఎదురు చూపుల దారి..

1 గంట క్రితం

eduru chuupula dari..
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 12, 2026, 07:59 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

నువ్వు వెళ్లిపోయాక

దారులేవీ మూసుకుపోలేదు

ఇప్పటికీ అదే నిశ్శబ్దాన్ని మోస్తున్నాయి

నమ్మి నడిచిన

నా అడుగులే తడబడుతున్నాయి

గమ్యం ఎప్పటిలా

అక్కడే నిలబడి

ఆలస్యంగా వచ్చే అతిథిలా

నా కోసం ఎదురుచూస్తూ

నేను మట్టిలో నీ జాడ వెతుకుతున్నప్పుడు

ఆకాశంలో నువ్వు నీ పేరు రాసుకున్నావు

తెలియని మీమాంసలో కొట్టుకుపోతూ

తెలిసే నన్ను చేజార్చుకున్నాను

ప్రపంచం సముద్రమంతటి గాంభీర్యాన్ని మోస్తున్నా

కాలం ఇప్పటికీ నదిలా

నిర్మలమై ప్రవహిస్తున్నది

అల్లుకుపోయిన ఆశలన్నీ

మనసు లోతుల్లో వేర్లు దిగిన చెట్టులా

ప్రతి ఋతువులోనూ అదే నీడను

అదే వేదనను అదే పరిమళాన్ని

మళ్లీ మళ్లీ గుర్తు చేస్తున్నాయి

నువ్వు దూరమైన తర్వాతే

కేవలం ఊపిరి తీసుకోవడమే

జీవితం కాదని

ఉదయాస్తమయాల్ని మాయ చెయ్యకుండా

రేపటి దిశగా అడుగులు వెయ్యడమే

నిజమైన బతుకని తెలుసుకున్నాను

ఎప్పుడైనా ఈ దారిలో నువ్వు మళ్లీ ఎదురైతే—

"ఎక్కడికి వెళ్లావు?" అని అడగను

ఈ దారి.. నిన్ను గుర్తుపట్టిందా?

లేదంటే నాలాగే ఇప్పటికీ

నీ అడుగుల శబ్దాన్ని

తన మౌనంలో దాచుకుని ఎదురు చూస్తున్నదా!?


వైష్ణవిశ్రీ

8074210263

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్