ఎండైనా...
వానైనా...
తుఫానైనా...
ప్రకృతి తన పని తాను చేసుకుంటుంది.
కానీ...
ఒక ప్రముఖుడి రాక కోసం
ఆగిపోతుంది రహదారి...
నిలిచిపోతుంది నగరం...
బందీ అవుతుంది ప్రజల శ్వాస.
సైరన్‌ల హోరు...
బారికేడ్ల గోడలు...
చేతులు ఊపే భద్రతా దళాలు...
కదలలేని సామాన్యుడి జీవితం.
ఆ బస్సులో
పరీక్షకు పరుగెత్తే విద్యార్థి...
ఆ ఆటోలో
నొప్పితో విలవిలలాడే రోగి...
ఆ కారులో
నెలలు నిండిన గర్భిణి...
ఆ బైక్‌పై
ఎండలో అలసిపోయిన వృద్ధుడు...
తల్లి ఒడిలో
ఏడుస్తున్న పసిపాప...
వాళ్లందరి సమయానికి
విలువ లేదా?
ఒక్కరి ప్రయాణం కోసం
వేలమంది ప్రయాణాలు
ఎందుకు బందీ కావాలి?
చూడండి...
ఎవరూ గొడవపడరు.
ఎవరూ ప్రశ్నించరు.
కళ్లలో అసహనం...
పెదవులపై మౌనం...
ఎందుకంటే...
ప్రశ్నించే ధైర్యం కంటే
పరిణామాల భయమే పెద్దది.
_
ఎవరో ఒకరు
"ఇది సరైంది కాదు" అని
గొంతెత్తినా...
ఆ గొంతుకు తోడుగా
మరో గొంతు వినిపించదు.
అలా...
నిజం ఒంటరిగా నిలబడుతుంది.
మౌనం మాత్రం
జనసమూహంగా మారుతుంది.
ప్రజాస్వామ్యం అంటే
ప్రజల కోసం వ్యవస్థ నడవడం.
ప్రజలే ఆగి,
అధికారమే దూసుకుపోవడం కాదు.
ఆ రోజు వస్తుందా?
సైరన్ శబ్దం కంటే
సామాన్యుడి నిట్టూర్పు
పెద్దగా వినిపించే రోజు...
ఆ రోజు వస్తుందా?
వీఐపీ కాన్వాయ్ కంటే
ఒక అంబులెన్స్‌కు,
ఒక గర్భిణికి,
ఒక వృద్ధుడికి,
ఒక పసిపాపకు
దారి ఇచ్చే సంస్కారం
మన పాలనకు అలవడే రోజు...
ఆ రోజు కోసం...
ఈ మౌనం
ఒక ప్రశ్నగా మారాలి.
ఆ ప్రశ్న
వేల గొంతుల ప్రతిధ్వనిగా మారాలి.
అప్పుడే...
రహదారులు నిజంగా
ప్రజలవి అవుతాయి.
శ్రీనివాస రెడ్డి కొమ్మారెడ్డి,
8500653332








కామెంట్‌లు (0)