మేఘాలు చెదిరిపోతూ వలసెళ్ళుతున్నాయి
ఎక్కడ పాగా వేసినా ఒకటే వరుస
విత్తనాలకు గోనె సంచుల్లో ఊపిరాడక
మరణ శయ్యపై తల పెట్టి పడుకున్నాయి
గాలి వాటపు గమనాలదే కాలమైంది
సేను సెలకల్లో సాలళ్ళు పూడుకుపోయి
కలుపు మొక్కల సైన్యం ధాటికి
గులకరాళ్ళు కూడా గమ్మున కూర్చున్నాయి
నాగలి పట్టని సేద్యం చిన్నబోయింది
విత్తు విత్తని భూమి మూగబోయింది
కరువు రక్కసి కోరలు చాస్తాదని భయం
ఊరించే ముసురు మేఘాల మూకుమ్మడికి
ఆశ బారడై నాగలి పట్టి కాచుకుంటుంది
తడి ఎరుగని కుండ అడుగు భాగం
ఎండిపోయి కనిపిస్తూ కలవరపెడుతుంటే
వలస మార్గానికేసి చూపు పరిగెడుతోంది
ముంచుకొచ్చే ముప్పు ముంచేయక ముందే
తరుముకొచ్చే కరువు కాటేయకముందే
కాళ్ళకు చక్రాలు కట్టుకుని సిద్ధం కావాలని
నమ్మకం చెదిరిన రైతు లోకం మేల్కొంది
పండాల్సిన విత్తనం పుచ్చు పట్టకముందే
పొడిభారిన నేలలో పారేయకముందే
అమ్మకానికి బొమ్మలా తీర్చిదిద్దాలి
చెదిరిపోయే చినుకు చుక్కల్ని చూస్తూ
తలెత్తి చూసే కర్షకుని ఎదురు చూపులకు
పదును పెట్టే అదును తప్పిపోయింది
కుదురు లేని వర్షం తలాకో చుక్క పంచుతూ
రాళ్ళ సందుల్లో జారిపోతూ ఆవిరౌతుంటే
వలసెళ్ళక తప్పదేమో అన్నట్టుగా
రైతు జీవనం అయోమయంలో పడింది
నరెద్దుల రాజారెడ్డి
9666016636







కామెంట్‌లు (0)