గురువారం, 09 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

కష్టజీవికి ఎంతకష్టం..

4 రోజుల క్రితం

gulf workers
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 05, 2026, 08:43 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

తుమ్మల్లో పొద్దుగుంకినాక

గుండెల్లో తుమ్మ ముళ్ళులాగ గుచ్చుకుంటాడు

గుబులొచ్చి ఏడుస్తావుంటే

మళ్ళా పొద్దు విచ్చుకోనంటది

ఏదో పనిచేసుకో మావా అంటే డబ్బుకాశపడి

అరబ్బు దేశమెళ్ళేడు

అక్కడ ఎన్ని బాధలు పడుతున్నాడో

రాత్రిళ్ళు పిల్లలు వినకుండా కన్నీళ్లు ఫోనులోంచి

వినిపిస్తుంది లచ్చి

గుండె సీకటిసేసినా గుడిసెలో రెండు దీపాలు

ఎలిగించి పోయేడు

అవి అచ్చరాలెలిగించాలంటే పైసలు గావాలి

చెమట చుక్కయ్ పాపం మూడు దీపాలు

ఆరిపోకండా ఎలుగుతున్నాడు

ఫోనట్టుకొంటే లచ్చిమ్కి మావను

చుట్టుకున్నట్టుంటుంది

మరో పక్క అక్కడి పెమాదాలు వింటుంటే

వికృతనవ్వేదో తనని చూసి ఇకిలిస్తున్నట్టు

వణుకు పుడతాది

అంతా సాఫీగా పోతుండగా అనుకోకుండా

మృత్యుజ్వాలలాంటి వార్త..!

ఆయిల్ బావిలో జరిగిన ప్రమాదంలో

అసువులు బాసిన కార్మికుల్లో మావ కూడా

ఉన్నాడన్న పిడుగులాంటి వార్త!

జీవచ్ఛవంలా కూలబడిపోయింది లచ్చిమి

ధేవుడా! ఏం కర్మిది..

బయట ఆకాశం ఏడుస్తున్నట్టు భోరున వాన

గుండెల్లో సుళ్ళు తిరిగే వేదన

కళ్ళలో ఎప్పటికీ తగ్గని తుఫాను..!

(గల్ఫ్ దేశాల్లో ప్రమాదాల్లో చనిపోతున్న

కార్మికులకు నివాళిగా )

భీమవరపు పురుషోత్తమ్

9949800253

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్