mh ad
ఆదివారం, 28 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionకవిత్వాక్షరాలు...!

2 గంటల క్రితం

kavithae
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 28, 2026, 07:12 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

మస్తిష్కాన్ని మధించి మధించి

జ్ఞాన కవ్వంతో చిలికి చిలికి

వెన్నలాంటి భావ వ్యక్తీకరణకై

అహర్నిశలు శ్రమించేతత్వం

పదాల కూర్పులతో నేర్పుగా

వాక్యాల్ని ఇమిడించే నైపుణ్యం

ఎన్ని కణాల్ని ప్రేరేపిస్తేనో

ఒక కవిత్వం పురుడోసుకుంటుంది

ఎన్ని వ్యాపకాల్ని పోగేసుకుంటేనో

ఒక ఆలోచన అక్షర రూపమౌతుంది

ఎన్ని అనుభవాల్ని రంగరిస్తేనో

ఒక కథ ప్రాణం పోసుకుంటుంది

ఎన్ని రాత్రుల్ని జయిస్తేనో

ఒక నవలకు జననం కల్గుతుంది

ఎన్ని స్వప్నాల్ని బంధిస్తేనో

ఒక కథనం అల్లుకుపోతుంది

ఎన్ని గాయాల్ని భరిస్తేనో

ఒక కవిత్వం నినదిస్తుంది

ఎన్ని రాగాలను మిళితం చేస్తేనో ఒక గేయం పరిచయమౌతుంది

ఎన్ని నిర్ణయాల్ని సంధిస్తేనో

ఒక విప్లవ సాహిత్యం

లక్షల సిరా చుక్కలై ఎగస్తుంది

లక్ష్యమనే కక్ష్యను చేరుకుంటుంది

ఎన్ని విమర్శల్ని ఎదుర్కొంటేనో

ఒక అనుభవం సాహిత్యమౌతుంది

ఎన్ని మలుపుల్ని దాటెళ్ళితేనో

ఒక నాటకం రక్తి కడుతుంది

రాయాల్సిన కవితగా రాస్తున్నా

చెప్పాల్సిన విషయాన్ని చెప్తున్నా

ఎన్ని అక్షర ముక్కల్ని అతికిస్తేనో

ఒక రచనకు ఆకారం చేకూరుతుంది

ఎన్ని అలంకారాల్ని అలరిస్తేనో

ఒక పాఠక మనసు ఆకర్షిస్తుంది

యతి ప్రాస చంధస్సుల కలయికలో

సాహితీ కిరణం లోకాన్ని వెలిగిస్తుంది


నరెద్దుల రాజారెడ్డి

9666016636

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్