ఆదివారం, 12 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionపచ్చని ప్రాణగీతం

1 గంట క్రితం

kavitha
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 12, 2026, 08:17 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

భూమి ఒక కన్నతల్లి

తన గర్భంలో గింజల్ని దాచుకుని

మన రేపటికి పాలిచ్చే అనంత కరుణాముర్తి

ఆమె జడలో పెనవేసుకున్న అడవులు

ఒకప్పుడు పచ్చని పద్యాలయ్యాయి

ఆకుల సవ్వడులు గాలిలో జాలువారేవి

నదులు ఆమె చిరునవ్వుల పాదాలకి అలంకరించిన

వెండి పట్టీల గజ్జెల్లా మోగుతూ

పల్లెల మట్టిముఖచిత్రాలపై

చల్లని అమృత జల్లులు చల్లేవి.

నిలువెత్తు కొండలు ఆకాశానికి దీపస్తంభాల్లా ఉండేవి

మబ్బులు వాటి భుజాలపై వాలి

విశ్రాంతి తీసుకునే శ్వేత పావురాలయ్యేవి.

కానీ ఇప్పుడు—

మనిషి దాహం ఉక్కు దంతాలై

అడవుల సమూహాన్ని నరికేస్తూ రక్తమోడిస్తోంది.

చెట్ల కొమ్మల ఊయలలపై ఊగాల్సిన కిలకిల పక్షిగీతాలు

కాలుష్య పొగ గొట్టాల నల్లని గొంతుకల్లో చిక్కుకుని

రాగం రాని మూగవీణలౌతున్నాయి

నదుల ఒడిలో స్వేచ్ఛగా, స్వచ్ఛంగా తేలియాడే చంద్రబింబం

ప్లాస్టిక్ మలినాల ఉచ్చులో చిక్కుకుని మసకబారుతోంది.

పచ్చిక బయళ్లు ఇక మెత్తని తివాచీలు కావు—

యంత్రాల కాళ్లకింద నలిగిన గాయాల కారిడార్లు

గాలి ఇక మనుషులకు చల్లని జోలపాట కాదు—

ఫ్యాక్టరీల అరుపులతో,కేకలతో గాయపడిన శ్వాస.

వానలు రాకపోతే ఆకాశాన్ని దుర్బాషలాడతాం

కానీ ఏడవలేని స్థితికి భూమిని చేర్చింది మనమే కదా...

వేర్లు తెగిపోయిన చెట్టు ఎలా భూమిలో నిలవదో,

ప్రకృతిని కోల్పోతున్న మనిషి కూడా అలాగే కూలిపోతాడు.

ఒక మొక్క నాటడం అంటే

భూమి నుదుటిపై చందనం పులిమి

ఆకుపచ్చని సంతకం చేయడం,

ఒక చెరువును కలుషితం కాకుండా కాపాడడం అంటే

దాహంగొన్న భవిష్యత్ తరాల అధరాలపై జల సంతకం చేయడం

అందుకే అందరూ కలిసి రండి

మన చేతుల్ని మళ్లీ ఓసారి మట్టితో మమేకం చేద్దాం,

మనందరి హృదయాల్లో ఆకుపచ్చని దీపాల్ని వెలిగిద్దాం;

ప్రకృతిని సంరక్షించడం కాదు ఇక

మన భవిష్యత్తు శ్వాసకు వేర్లు నాటుదాం.


​రేపాక రఘునందన్

9440848924

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్