ఆ వాక్యం ఇంకా అసంపూర్తిగానే మిగిలింది...
ఎన్నో నీడలను తనలో దాచుకుంటూ,
అన్వేషణలకై నిత్యం పోరాటం చేస్తూ,
ఒకే వర్ణంలో నేల కింద విత్తుగా నిలిచింది!
చరిత్ర రంగులు వేస్తూ అణగదొక్కింది,
ఆశల రెక్కలను అడుగడుగునా నరుకుతూ,
ఎర్రటి అక్షరాలతో నేలకు అభిషేకం చేస్తూ,
కాలపు సాక్ష్యాలకు గాయాలను మిగిల్చింది…
నది నడికల్లో నాగరికత పుడితే,
కత్తుల వంతెనపై గొంతులు తెగితే,
అభాగ్యుడి ధైర్యమంతా నేలలో ఇంకిపోతే,
నేడు అణు విజ్ఞానం ఆకాశాన మెరుస్తుంది…
ఎన్ని కథలు పుట్టాయో విజయగాథలకు,
రణరంగపు విన్యాసాల శవాల దిబ్బలపై!
బడుగుల ఆయుష్షులో ఆకలి పోరాటం తప్ప,
విజయకేతనాలు మోసిన చరిత్రలేవీ లేవు..
భూమండలమంతా భస్మంగా మార్చేందుకు,
పిశాచ సమూహాలను ప్రేరేపిస్తూ,
కన్నీటి వర్షాలలో ఆయుధాలను కడుగుతూ,
కడుపు మంటల్ని రగిలించిన చిచ్చులే ఇవన్నీ!
ముగింపు లేని ఈ కావ్యాలన్నింటికీ,
ఎన్ని శాంతికపోతాలు ఎర్రగా మారాయో!
గులాబీ తోటల్లో రెక్కలొరిగి ఎన్ని వాలాయో!
చీకటి జీవితంలో తెల్లటి సంతకం ఎప్పుడొస్తుందో..?
కొప్పుల ప్రసాద్
9885066235








కామెంట్‌లు (0)