వాడు తన బాల్యపు తూనీగ తోకకి
బిగించిన దారం ముడి విప్పుకోలేక__
ఉక్కిరి బిక్కిరవుతున్నాడు
ఆమె తన ఉనికిని వణికిస్తోన్న
మనువాద ఉచ్చునుంచి తప్పించుకోక
ముప్పు తిప్పలు పడుతోంది
అతడు అహర్నిశలూ ఆరుగాలం
ఒళ్లంతా కుళ్ళబొడుచుకొని సృష్టించిన
స్వేద ఫలాలన్నీ ఈనగాచి
నక్కలపాలవుతున్నందుకు
ఈసురోమంటూ కక్కటిల్లి రోధిస్తున్నాడు
నేనేమో బాల్యం కాళ్లు విరిగి__
యవ్వనం రెక్కలు తెగి
ఇప్పుడీ వృద్ధాప్యంలో
వెనక్కి తిరిగి చూసుకుంటే
మొత్తం జీవితమే గల్లంతై
తల్లడిల్లుతున్నవాణ్ణి
దగాపడ్డ మేమంతా కాలం గాలానికి
చిక్కి గిలగిలా గింజుకుంటోంటే
వాడు మాత్రం చెమట చిందకుండానే
ఎంచక్కా జీవితం రెక్కల గుర్రాన్ని
అవకాశాల కళ్లెంతో నియంత్రిస్తూ
ఆకాశాలను అరిపాదాల ముందు
దాసోహం గావించుకుంటున్నాడు
ఏమిటీ చిత్రం ఎక్కడుంది లోపం
ఆలోచిస్తోంటే అన్నాడొకడు
అది మీ అసమర్ధ మానసిక దౌర్బల్యం!
దృఢమైన వ్యక్తిత్వాన్ని నిర్మించుకొండి!
పోటీప్రపంచపు అంచుల్ని తాకి
గెలుపు నగరా మోగించాలంటే
మిమ్మల్ని మీరు సాన పెట్టుకునే
గట్టి కౌన్సెలింగ్ అవసరమని
గుర్తించండి!
కౌన్సెలింగ్...!
మా పిల్లల తూనీగ తోకలకు దారాలు కట్టి
బాల్యాన్ని బాహాకంగా దొంగిలిస్తున్న
దండాకోర్లకు లేని కౌన్సెలింగ్
విశ్వ చైతన్య వీణా తంత్రుల్ని
మీటాల్సిన మా ఆడపడుచుల_
అస్తిత్వం చుట్టూ ఉచ్చు బిగించిన
మతోన్మాద కంత్రీలకు లేని కౌన్సెలింగ్
మా శ్రమజీవుల నెత్తుటి స్వేదాన్ని
గుత్తకు తీసుకొని పెత్తనం చెలాయిస్తున్న
దగుల్బాజీ దళారీ పెట్టుబడి
పోతురాయుళ్లకు లేని కౌన్సిలింగ్
మాకెందుకు...?
చెప్పండయ్యా! మాకే ఎందుకు?
ఎందుకంటే...
సెంటు పూసిన మీ చొక్కాలు
చెక్కు చెదరకుండా ఉండటంకోసం
మా చేతనే ఇస్త్రీ పెట్చటించటానికి!
కుట్రపూరితంగా మీరు నిర్మించిన
పాకురుపట్టిన పాత సనాతనపు
పచ్చి గోడలన్నింటికీ మా చేతనే
పెయింటింగులు వేయించి
మళ్లీ కొత్తగా మెరిపించటానికి!
స్పీడ్ అఫ్ డూయింగ్ దుందుడుకు
పరుగు పోటీల్లో విరిగిపోయిన
మీ సామ్రాజ్యవాద శకటాన్ని
మాచేతనే రిపేర్లు చేయించి
మా మీదనే స్వారీ చేయించటానికి!_
_
అవును. మా ఎముకల్లో ఇంకా
మిగిలి ఉన్న_ రక్త మాంసాల మూలుగుల్ని
మా చేతనే మీనోటికి అందిపుచ్చుకొని
లొట్టలేసుకుని చప్పరించటానికి!
అర్థమౌతోంది మీ అసలు గుట్టు
ఇక మీ మకిలి వేషాల ఆటకట్టు!
ఇదిగో చెబుతున్నాను!
బతుకు జంజాటం నుంచి
బయటపడటానికి
వాడూ ఆమే అతడూ నేనూ
కదలని కాలపు రెక్క వంటి
ఈ ముష్కర రాజ్యపు గుంజకు కట్టిన
తాళ్ళను తెంచుకొని, కౌన్సెలింగ్ కాదు
కంచు నగారా మోగిస్తాం!
_- పతివాడ నాస్తిక్
9441724167_








కామెంట్‌లు (0)