mh ad
ఆదివారం, 28 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionక్యాబేజీ.. వంటల్లో వెరైటీ

2 గంటల క్రితం

greenkyabeji
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 28, 2026, 07:29 పూర్వాహ్నం | 4 నిమిషాల చదవడం

ఆకుపచ్చని రంగుతో కనిపించే క్యాబేజీ కేవలం ఒక కూరగాయ మాత్రమే కాదు ఆరోగ్యాన్ని కాపాడే పోషకాల భాండాగారం. విటమిన్ C, K, ఫోలేట్, పీచు, పొటాషియం వంటి ఎన్నో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. క్యాబేజీ రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. గుండె ఆరోగ్యం నుంచి బరువు నియంత్రణ వరకూ ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. ఫ్రై, కూరగానే కాకుండా రకరకాలుగానూ దీన్ని వండుకోవచ్చు. ఈ కూరగాయను ఎలా వండితే ఎక్కువ పోషకాలు లభిస్తాయి? ఎలా వండుకోవాలో? తెలుసుకుందాం.

pacchadi

పచ్చడి

కావాల్సినవి: క్యాబేజీ ముక్కలు- 2 కప్పులు, పచ్చిమిర్చి- పది, ఎండుమిర్చి- 3 లేదా 4, టొమాటో- ఒకటి, చింతపండు- నిమ్మకాయ సైజు, ధనియాలు- స్పూను, జీలకర్ర-స్పూను, మినప్పప్పు- స్పూను, వెల్లుల్లి రెబ్బలు- 5 లేదా 6, పసుపు- పావు స్పూను, ఉప్పు- రుచికి సరిపడా, నూనె- 2 స్పూన్లు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు కలిపి- స్పూను చొప్పున, కరివేపాకు- ఒక రెమ్మ, ఇంగువ- చిటికెడు.

తయారీ : స్టవ్ మీద బాండీ పెట్టి, నూనె పోసి వేడి చేయాలి. మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర వేసి దోరగా వేయించాలి. అవి కాస్త వేగాక పచ్చిమిర్చి, ఎండుమిర్చి ముక్కలు కూడా వేసి, నిమిషం పాటు వేయించి, వాటన్నింటినీ ఒక ప్లేట్‌లోకి తీసి చల్లార్చుకోండి. అదే పాన్ లో మరికొద్దిగా నూనె వేసి, తరిగిన క్యాబేజీ ముక్కలు, పసుపు వేయాలి. క్యాబేజీలోని పచ్చివాసన పోయి, ముక్కలు కాస్త మెత్తబడే వరకూ మీడియం ఫ్లేమ్‌పై 4-5 నిమిషాలు వేయించండి. క్యాబేజీ సగం వేగాక, అందులోనే టొమాటో ముక్కలు కూడా వేసి, సాఫ్ట్‌గా అయ్యే వరకు మూత పెట్టి వేయించాలి. స్టవ్ ఆపేసి, మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వండి. మొదట మిక్సీ జార్‌లో వేయించి పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర, మిర్చి, వెల్లుల్లి రెబ్బలు, నానబెట్టిన చింతపండు రుచికి సరిపడా ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చల్లార్చుకున్న క్యాబేజీ, టొమాటో మిశ్రమాన్ని కూడా అందులో వేసి మిక్సీ పట్టుకోవాలి. ఒక గిన్నెలోకి తీసుకోవాలి. మరో బాండీలో నూనె పోసి, తాలింపు గింజలు వేయాలి. కరివేపాకు, ఇంగువ వేసి తాలింపును బాగా వేయించాలి. దీన్ని ల్యాబేజీ పచ్చడిలో వేసి కలపాలి. అంతే! ఎంతో రుచికరమైన, ఘాటైన క్యాబేజీ పచ్చడి రెడీ.

kyabejivadalu

వడలు

కావాల్సినవి: సన్నగా తరిగిన క్యాబేజీ తురుము - పెద్ద కప్పు, శనగపప్పు (లేదా మినప్పప్పు)- కప్పు (కనీసం 2 గంటలు నానబెట్టినది), ఉల్లిపాయ- 1 (సన్నగా తరిగినది), పచ్చిమిర్చి- 3 లేదా 4, అల్లం ముక్కలు లేదా అల్లం వెల్లుల్లి పేస్ట్- స్పూన్, కొత్తిమీర తరుగు- పావు కప్పు, కరివేపాకు- రెండు రెమ్మలు (సన్నగా తరిగినవి), జీలకర్ర- స్పూన్, బియ్యప్పిండి- 2 స్పూన్లు, ఉప్పు- రుచికి సరిపడా, నూనె- వేయించడానికి సరిపడా.

తయారీ : మొదట నానబెట్టిన శనగపప్పులోని నీళ్లన్నింటినీ పూర్తిగా వడకట్టాలి. ఆ పప్పును మిక్సీ జార్‌లో వేసి, నీళ్లు పోయకుండా బరుకుగా (కచ్చాపచ్చాగా) గ్రైండ్ చేసుకోవాలి. పిండిని ఒక వెడల్పాటి గిన్నెలోకి తీసుకోవాలి. అందులో సన్నగా తరిగిన క్యాబేజీ తురుము, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేయండి. బియ్యప్పిండిని కూడా ఇందులో కలపండి. నీళ్లు పోయకుండా ఈ మిశ్రమాన్ని గట్టిగా, వడల పిండిలా బాగా కలుపుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టి, వేయించడానికి నూనె పోసి వేడి చేయాలి. నూనె కాగాక, చేతికి కొద్దిగా నీరు లేదా నూనె రాసుకుని, పిండిని కొంచెం కొంచెంగా తీసుకుని, అరచేతిపై వడల్లా ఒత్తుకోండి. వీటిని కాగుతున్న నూనెలో వేయాలి. మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి, వడలు రెండు వైపులా బంగారు రంగు వచ్చేవరకూ వేయించుకుని, ప్లేట్ లోకి తీసుకోవాలి. అంతే! ఎంతో కరకరలాడే, వేడి వేడి క్యాబేజీ వడలు రెడీ. స్నాక్స్‌లా టొమాటో కెచప్ లేదా అల్లం పచ్చడితో తింటే చాలా అద్భుతంగా ఉంటాయి.

manchuria

మంచూరియా

కావాల్సినవి: సన్నగా తరిగిన లేదా తురిమిన క్యాబేజీ- 2 కప్పులు, సన్నగా తరిగిన క్యారెట్ తురుము- పావు కప్పు, మైదాపిండి- 4 స్పూన్లు, మొక్కజొన్న పిండి- 3 స్పూన్లు, అల్లంవెల్లుల్లి పేస్ట్- స్పూను, మిరియాల పొడి- అరస్పూను, కారం- అరస్పూను, ఉప్పు- రుచికి సరిపడా, నూనె- డీప్ ఫ్రై చేయడానికి సరిపడా. సాస్ కోసం: సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు- స్పూను, సన్నగా తరిగిన అల్లం ముక్కలు- స్పూను, పచ్చిమిర్చి- రెండు, ఉల్లికాడలు- అరకప్పు, సోయా సాస్ - స్పూను, రెడ్ చిల్లీ సాస్- స్పూను, టొమాటో కెచప్- రెండు స్పూన్లు, వెనిగర్- స్పూను, కార్న్ ఫ్లోర్ - స్పూను, మిరియాల పొడి- పావు స్పూను, ఉప్పు- రుచికి సరిపడా.

తయారీ : ఒక మిక్సింగ్ బౌల్‌లో తురిమిన క్యాబేజీ తీసుకొని, అందులో కొద్దిగా ఉప్పు వేసి, కలిపి ఐదు నిమిషాలు పక్కన పెట్టండి. తర్వాత క్యాబేజీ తురుములోకి మైదా పిండి, కార్న్ ఫ్లోర్, అల్లం-వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి, కారం, ఉప్పు వేసి బాగా కలపాలి. నీళ్లు పోయకుండా చపాతీ పిండిలా ముద్దగా చేసుకోవాలి. తర్వాత చిన్న చిన్న సాఫ్ట్ బాల్స్ చుట్టుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టి, వేయించడానికి సరిపడా నూనె పోసి బాగా వేడి చేయాలి. నూనె కాగాక, మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి, చేసి పెట్టుకున్న మంచూరియన్ బాల్స్‌ను ఒక్కొక్కటిగా నూనెలో వేయాలి. బాల్స్ లోపలి వరకూ బాగా వేగి, పైన క్రిస్పీగా, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకూ వేయించి, ప్లేట్‌లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. వేరే పాన్ తీసుకుని, నూనె వేసి, బాగా వేడి చేయాలి. తరిగిన వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి ముక్కలు వేసి, అర నిమిషం పాటు వేయించాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు లేదా ఉల్లికాడల తరుగు వేసి కాస్త పచ్చివాసన పోయేవరకూ వేయించాలి. ఇప్పుడు మంటను సిమ్‌లో పెట్టి.. సోయాసాస్, చిల్లీ సాస్, టొమాటో కెచప్, వెనిగర్, మిరియాల పొడి, కొద్దిగా ఉప్పు వేసి, హై ఫ్లేమ్‌పై 20 సెకన్లు కలపండి. తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ ఫ్లోర్ నీళ్లను ఇందులో పోసి కలపండి. సాస్ కొద్దిగా చిక్కబడటం స్టార్ట్ అవుతుంది. సాస్ బుడగలు వస్తూ చిక్కబడ్డాక, వేయించి పెట్టుకున్న మంచూరియన్ బాల్స్ వేసి సాస్ అంతా బాల్స్‌కు పట్టేలా హై ఫ్లేమ్‌పై 1-2 నిమిషాల పాటు బాగా టాస్ చేయండి. చివరగా పైన మరికొన్ని ఉల్లికాడల తరుగు చల్లుకుంటే వేడి వేడి, జ్యూసీ జ్యూసీ క్యాబేజీ వెజ్ మంచూరియన్ రెడీ! దీనిని ఇలాగే డ్రై స్టార్టర్‌గా సర్వ్ చేసుకోవచ్చు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్