చూసేందుకు చిన్నగా... ఆకుపచ్చని రంగులో గుండ్రంగా, బొడిపెలతో ఉండే ఆగాకర లేదా బోడ కాకర కాయల్లో క్యాలరీలు తక్కువ. పోషకాలు ఎక్కువ. పీచు పదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్లు అధిక మోతాదులో ఉంటాయి. వర్షాకాలంలో విరివిగా లభించే ఆగాకర తరచూ తీసుకోవడం వల్ల దగ్గు, జలుబు, వివిధ అలెర్జీలు దూరమవుతాయి. డయాబెటిస్‌ను నియంత్రిస్తుంది. జీర్ణ వ్యవస్థను మెరుగు పరుస్తుంది. ఆకాకరలోని ఫోలేట్ల వల్ల శరీరంలో కొత్త కణాలు వృద్ధి చెందుతాయి. వీటిని వేపుడు, కూర, పచ్చడి.. రకరకాలుగా వండుకోవచ్చు. మరి వాటిని ఎలా చేయాలో తెలుసుకుందాం.

నిల్వ పచ్చడి
కావాల్సినవి: ఆగాకర కాయలు – ½ కిలో, ఆవాలు – 50 గ్రాములు, మెంతులు – స్పూను, ఎండుమిరపకాయలు – 75 గ్రాములు, ఉప్పు – తగినంత,చింతపండు – 50 గ్రాములు, పసుపు – ½ స్పూను, నువ్వుల నూనె – 150 మి.లీ., వెల్లుల్లి రెబ్బలు – 10–12, ఇంగువ – చిటికెడు.
తయారీ : ఆగాకరకాయలను శుభ్రంగా కడిగి, పూర్తిగా తేమ లేకుండా తుడిచి చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. ముక్కలకు కొద్దిగా ఉప్పు, పసుపు కలిపి 2–3 గంటలు ఉంచాలి. తర్వాత వచ్చిన నీటిని పూర్తిగా తొలగించి ముక్కలను శుభ్రమైన గుడ్డపై ఆరబెట్టాలి. ఆవాలు, మెంతులను విడిగా స్వల్పంగా వేయించి చల్లారిన తర్వాత పొడిగా చేసుకోవాలి. ఎండుమిరప కాయలను కూడా పొడి చేసుకోవాలి. చింతపండును గింజలు తీసి, తక్కువ నీటితో చిక్కటి గుజ్జులా చేసుకోవాలి. బాండీలో నువ్వుల నూనె వేడి చేసి, ఇంగువ, వెల్లుల్లి వేసి వేయించాలి. పూర్తిగా చల్లారనివ్వాలి. ఒక పెద్ద గిన్నెలో ముక్కలు, ఆవాల పొడి, మెంతుల పొడి, కారం, ఉప్పు, చింతపండు గుజ్జు వేసి బాగా కలపాలి. చివరగా చల్లారిన నూనెను వేసి మొత్తం మిశ్రమాన్ని బాగా కలిపి, శుభ్రమైన పొడి గాజు సీసాలో నింపాలి. పచ్చడిని 2–3 రోజులు ఉంచి, రోజుకు ఒకసారి పొడి చెంచాతో కలిపితే అన్నీ కలుస్తాయి.
పచ్చడిలో తేమ చేరకుండా జాగ్రత్తపడాలి. ఎప్పుడూ పొడి చెంచానే ఉపయోగించాలి. ఇలా చేస్తే పచ్చడి ఎక్కువకాలం రుచిగా ఉంటుంది.

కూర
కావాల్సినవి : ఆగాకరకాయలు – 250 గ్రాములు, ఉల్లిపాయ – 1, పచ్చిమిర్చి–2, ఎర్ర మిరపకారం – స్పూను, పసుపు – ¼ స్పూను, ధనియాల పొడి – ½ స్పూను, ఉప్పు – తగినంత, ఆవాలు – ½ స్పూన్, జీలకర్ర – ½ స్పూను, మినప్పప్పు – స్పూను, కరివేపాకు – రెండురెమ్మలు, నూనె – 2 స్పూన్లు.
తయారీ : ఆగాకర కాయలను శుభ్రంగా కడిగి, చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. బాండీలో నూనెపోసి, వేడి చేసి ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, కరివేపాకు వేసి తాలింపు పెట్టాలి. అందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి మెత్తగా వేయించాలి. ఇప్పుడు ఆగాకరకాయ ముక్కలు, పసుపు, ఉప్పు వేసి కలిపి, మూత పెట్టి సన్నని మంటపై ఉడికించాలి. ముక్కలు మెత్తగా అయిన తర్వాత మిరపకారం, ధనియాల పొడి వేసి బాగా కలపాలి. మరో 2–3 నిమిషాలు వేయించి దించేయాలి. ఆగాకరకాయలోని సహజమైన వగరు రుచి అలాగే ఉండేలా ఎక్కువగా ఉడికించకుండా చేస్తే కూర మరింత రుచిగా ఉంటుంది.

పులుసు
కావాల్సినవి : బోడ కాకరకాయలు- 250 గ్రాములు, చింతపండు: చిన్న నిమ్మకాయ సైజు, మెంతులు- స్పూను, జీలకర్ర- స్పూను, నువ్వులు- స్పూను, నూనె- తగినంత, పచ్చిశనగపప్పు- రెండు స్పూన్లు, మినప్పప్పు- స్పూను, ఆవాలు- స్పూను, ఇంగువ- స్పూను, కరివేపాకు-రెండు రెమ్మలు, పచ్చిమిర్చి-నాలుగు, ఉల్లిపాయలు- రెండు, వెల్లుల్లి ముద్ద-స్పూను, పసుపు- చిటికెడు, కారం-రెండు స్పూన్లు, ఉప్పు-తగినంత, ధనియాల పొడి- అరస్పూను, దాల్చిన చెక్క-అంగుళం, యాలకులు- రెండు, కొత్తిమీర-కొద్దిగా.
తయారీ: ఒక గిన్నెలో చింతపండును శుభ్రంగా కడిగి,పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి, అందులో మెంతులు, జీలకర్ర, నువ్వులు తీసుకుని దోరగా వేయించుకోవాలి. ఒక గిన్నెలోకి తీసుకుని చల్లార్చాలి. తర్వాత వీటిని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్‌లో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడయ్యాక, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు వేసి దోరగా వేయించాలి. ఇంగువ, కొద్దిగా కరివేపాకు వేసి, మరోసారి వేయించాలి. ఆ తర్వాత పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి, దోరగా వేయించాలి. అందులో వెల్లుల్లి ముద్ద వేసి మరో నిమిషం పాటు వేయించాలి. అందులో పసుపు వేసి, బాగా కలిపి, బోడ ఆకాకరకాయ ముక్కలను వేయాలి. నూనెలో రెండు మూడు నిమిషాలు ఫ్రై చేయాలి. మూత పెట్టి మూడు నిమిషాలు మగ్గనివ్వాలి. తర్వాత కారం వేసి, రెండు నిమిషాల తర్వాత చింత పండు పులుసు వేసుకోవాలి. ఇప్పుడు ఆకాకరకాయ ముక్కలు ఉడికి రసం చిక్కబడుతుంది. వెంటనే మిక్సీపట్టుకున్న నువ్వులు, మెంతుల పొడిని వేసుకోవాలి. తర్వాత ధనియాల పొడి, మెంతి పొడి అన్నీ వేసుకోవాలి. పులుసు బాగా మరగబెట్టుకోవాలి. పులుసు చిక్కబడిన తర్వాత అందులో కొత్తిమీర వేయాలి. అంతే అగాకరకాయ పులుసు రెడీ.







కామెంట్‌లు (0)