ఆదివారం, 22 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

చలికి వేడి వేడి చిరుతిళ్లు

15 గంటల క్రితం

ruchi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 22, 2026, 11:22 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

చల్లని గాలులు వీస్తుంటే వేడివేడిగా ఏదైనా తినాలనిపించడం సహజం. ముఖ్యంగా పిల్లలకు చలికాలమంటేనే రుచికరమైన చిరుతిళ్ల సందడి! వేడి వేడి మొక్కజొన్న కంకులు, నోట్లో వేస్తే కరిగిపోయే పల్లీల చిక్కీలు, బెల్లం నువ్వుల ఉండలు, కమ్మని మసాలా మురుకులు, క్రిస్పీగా ఉండే ఆలూ పకోడీ, వడలు, గారెలు.. ఇలా ఒక్కో స్నాక్ ఒక్కో ప్రత్యేక రుచిని అందిస్తుంది. బయట చలి కమ్ముకుంటుంటే ఇంట్లో అమ్మ చేతి రుచులతో స్నాక్స్ తింటూ కబుర్లు చెప్పుకోవడం ఎంత సరదానో! మరి ఈ చలికాలంలో పిల్లల మనసు దోచే రుచికరమైన చిరుతిళ్లేమిటో.. వాటిని ఆరోగ్యకరంగా, సులభంగా ఎలా తయారు చేసుకోవచ్చో తెలుసుకుందాము.

bangaldumpa pakodi

బంగాళదుంప పకోడీ
కావాల్సినవి: బంగాళదుంపలు – 2, శనగపిండి – 1 కప్పు, బియ్యప్పిండి – 2 స్పూన్లు, కారం – ½ స్పూను, ఉప్పు – తగినంత, వాము – ¼ స్పూను, పసుపు – చిటికెడు, నీళ్లు – తగినన్ని, నూనె – వేయించడానికి సరిపడా.

తయారీ : బంగాళదుంపలను శుభ్రంగా కడిగి, తొక్క తీసి చిన్న ముక్కలుగా కోయాలి. ఒక గిన్నెలో శనగపిండి, బియ్యప్పిండి, కారం, ఉప్పు, వాము, పసుపు వేసి కలపాలి. కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ మరీ పలుచగా కాకుండా పకోడీ పిండిలా కలుపుకోవాలి. బంగాళదుంప ముక్కలను ఈ పిండిలో ముంచి, వేడినూనెలో వేసి మధ్యస్థ మంటపై బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. వేడివేడిగా టమాటా సాస్ లేదా చట్నీతో తింటే ఎంతో రుచిగా ఉంటాయి.

sweetcorn masala chat

స్వీట్ కార్న్ మసాలా చాట్
కావాల్సినవి : స్వీట్ కార్న్ గింజలు – కప్పు, ఉల్లిపాయ – 1, టమాటా – 1, పచ్చిమిర్చి – 1, వెన్న – 1 స్పూను, కారం – ¼ స్పూను,

చాట్ మసాలా – ½ స్పూను, నిమ్మరసం – స్పూను, ఉప్పు – తగినంత, కొత్తిమీర – కొద్దిగా.

తయారీ : ముందుగా స్వీట్ కార్న్ గింజలను నీటిలో వేసి మెత్తగా ఉడికించాలి. అనంతరం నీటిని వడకట్టాలి. ఒక పాన్‌లో వెన్న వేసి కరిగిన తర్వాత ఉడికించిన స్వీట్ కార్న్ గింజలు వేసి రెండు నిమిషాలు వేయించాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి వేసి బాగా కలపాలి. ఇందులో కారం, చాట్ మసాలా, ఉప్పు వేసి కలియబెట్టాలి. చివరగా నిమ్మరసం, కొత్తిమీర చల్లి బాగా కలిపి గిన్నెలోకి తీసుకోవాలి. అంతే స్వీట్‌ ‌కార్న్‌ ‌మసాలా చాట్‌ ‌రెడీ.

vada

శనగపప్పు వడలు
కావాల్సినవి: శెనగపప్పు – కప్పు, ఉల్లిపాయ – 1, పచ్చిమిర్చి – 2, అల్లం – చిన్న ముక్క, జీలకర్ర – ½ స్పూను, సోంపు – ½ స్పూన్, కరివేపాకు – 2 రెమ్మలు, కొత్తిమీర – కొద్దిగా, ఉప్పు – తగినంత, నూనె – వేయించడానికి.


తయారీ : శనగపప్పును శుభ్రంగా కడిగి రెండు గంటల పాటు నీటిలో నానబెట్టాలి. తర్వాత నీటిని పూర్తిగా వడకట్టాలి. నానబెట్టిన శనగపప్పులో కొద్దిభాగాన్ని పక్కన పెట్టి, మిగిలిన పప్పును మిక్సీలో వేసి మరీ మెత్తగా కాకుండా బరకగా రుబ్బుకోవాలి. పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, సోంపు వేసి మరోసారి కలపాలి. ఈ మిశ్రమంలో పక్కన పెట్టిన శనగపప్పు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా తీసుకుని అరచేతితో వడల్లా ఒత్తుకోవాలి. బాండీలో నూనె వేడిచేసి వడలను మధ్యస్థ మంటపై బంగారు రంగు వచ్చేవరకూ వేయించాలి. వేడివేడిగా కొబ్బరి చట్నీ లేదా టమాటా సాస్‌తో తింటే.. ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది.

cutlet

వెజిటబుల్ కట్లెట్
కావాల్సినవి: బంగాళదుంపలు – 2, క్యారెట్ – 1, బీన్స్ – 5, పచ్చిబఠాణీ – ¼ కప్పు, ఉల్లిపాయ – 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ½ స్పూను, పచ్చిమిర్చి – 1, కారం – ½ స్పూను, గరం మసాలా – ¼ స్పూను, ఉప్పు – తగినంత, కొత్తిమీర – కొద్దిగా, బ్రెడ్ పొడి – ½ కప్పు, కార్న్‌ఫ్లోర్ – 2 స్పూన్లు, నూనె – వేయించడానికి.

తయారీ : ముందుగా బంగాళదుంపలు, క్యారెట్, బీన్స్, పచ్చిబఠాణీలను ఉడికించి నీటిని పూర్తిగా వడకట్టాలి. బంగాళదుంపలను మెత్తగా మెదిపి, మిగిలిన కూరగాయలను చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఒక గిన్నెలో మెదిపిన బంగాళదుంపలు, కూరగాయలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, గరం మసాలా, ఉప్పు, కొత్తిమీర వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా తీసుకుని గుండ్రని అండాకారంలో కట్లెట్లుగా ఒత్తుకోవాలి. కార్న్‌ఫ్లోర్‌లో కొద్దిగా నీళ్లు కలిపి పలుచటి మిశ్రమం తయారు చేసుకోవాలి. కట్లెట్లను అందులో ముంచి బ్రెడ్ పొడిలో అటుఇటు దొర్లించాలి. పెనంలో కొద్దిగా నూనె వేసి కట్లెట్లను రెండు వైపులా బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. రుచికరమైన వెజిటబుల్ కట్లెట్స్ సిద్ధం!. కట్లెట్ మిశ్రమంలో పనీర్ తురుము లేదా స్వీట్ కార్న్ గింజలు కలిపితే రుచి మరింత పెరుగుతుంది. పిల్లలకు టమాటా సాస్‌తో ఇవ్వండి. ఎంతో ఇష్టంగా తింటారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్