చల్లని వాతావరణంలో వేడివేడి సూప్ చేతిలో ఉంటే ఆ హాయే వేరు! కడుపుకు తేలికగా, రుచికి రుచి.. శరీరానికి ఆరోగ్యాన్ని అందించడంతో పాటు కూరగాయలు, ఆకుకూరలు, పప్పులు వంటి పోషక పదార్థాలను ఆహారంలో చేర్చుకోవడానికి సూప్‌లు సరైనవి. ముఖ్యంగా వర్షాకాలం, చలికాలంలో వేడివేడి సూప్ శరీరానికి వెచ్చదనాన్ని, మనసుకు హాయిని అందిస్తుంది. ఇంట్లో దొరికే తాజా పదార్థాలతో తక్కువ నూనె, ఉప్పుతో తయారు చేసుకుంటే రుచికరమైన సూప్ ఆరోగ్యకరమైన ఆహారంలోనూ భాగమవుతుంది. మరి ఆ సూప్‌లు ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం.
జొన్న సూప్
కావలసినవి: జొన్న పిండి- 1½ స్పూను, నెయ్యి- స్పూను, జీలకర్ర- స్పూను, వెల్లుల్లి- నాలుగు రెమ్మలు, ఉల్లిపాయ- ఒకటి, అల్లం- చిన్నముక్క, తెల్ల నువ్వులు- స్పూను, ఉప్పు- రుచికి సరిపడా, ధనియాల పొడి- చిటికెడు, పసుపు- చిటికెడు, ఎండు మిరపకాయలు- మూడు, కొత్తిమీర-గుప్పెడు.
తయారీ: జొన్నపిండిని చిన్న గిన్నెలోకి తీసుకొని ఉండలు కట్టకుండా కొద్దిగా నీరు పోసి, బాగా కలిపి పక్కనపెట్టుకోవాలి. బాండీ పొయ్యిమీద పెట్టి, నూనెపోసి వేడి చేయాలి. జీలకర్ర, తరిగిన వెల్లుల్లి వేసి వేయించాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, అల్లం తరుము వేసి, దోరగా వేయించాలి. తర్వాత నువ్వులు వేసి కాసేపు వేగనివ్వాలి. వెంటనే నీళ్ళు పోసి, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా మరిగించాలి. అందులో ముందుగా కలిపి పెట్టుకున్న జొన్నపిండి మిశ్రమాన్ని తిప్పుతూ నెమ్మదిగా తిప్పాలి. పసుపు, ధనియాల పొడి వేసి, కాస్త చిక్కబడే వరకూ సిమ్‌లో ఉడికించాలి. చివరగా ఎండుమిర్చి ముక్కలు, కొత్తిమీర తరుగు చల్లుకోవాలి. అంతే జొన్నజావ రెడీ. వేడిగా సర్వ్ చేసుకుంటే.. నోటికి రుచిగా ఉంటుంది.
ఆల్మండ్ సూప్
కావలసినవి: బాదం పప్పులు- 15 నుండి 20 (నానబెట్టి, పొట్టు తీసినవి), వెన్న / నెయ్యి- స్పూను, వెల్లుల్లి తరుగు- స్పూను, ఉల్లిపాయ తరుగు- 2 స్పూన్లు, జీడిపప్పులు- 5 / 6 (నానబెట్టినవి), మొక్కజొన్నపిండి / జొన్నపిండి- స్పూను, పాలు- ½ కప్పు, నీళ్ళు- 1½ కప్పులు, ఉప్పు- రుచికి సరిపడా, మిరియాల పొడి- ½ స్పూను, కొత్తిమీర తరుగు- కొద్దిగా.
తయారీ: ముందుగా నానబెట్టి పొట్టు తీసిన బాదం పప్పులు, జీడిపప్పులను కొద్దిగా నీళ్ళు / పాలు పోసి మిక్సీలో మెత్తని పేస్ట్‌లా రుబ్బుకొని, పక్కన పెట్టుకోవాలి. బాండీ పొయ్యి మీద పెట్టి వెన్న / నెయ్యి వేసి వేడిచేయాలి. అందులో సన్నగా తరిగిన వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించాలి. తర్వాత జొన్న పిండి వేసి, పచ్చివాసన పోయేలా కాసేపు వేగనివ్వాలి. ఇప్పుడు ఉడకబెట్టిన బాదం-జీడిపప్పు పేస్ట్ వేసి, తిప్పాలి. వెంటనే పాలు, నీళ్ళు పోసి ఉండలు లేకుండా బాగా కలపాలి. రుచికి సరిపడా ఉప్పు, మిరియాల పొడి వేసి సన్నన మంటపై సూప్ చిక్కబడే వరకూ మరిగించాలి. చివరగా కొత్తిమీర తరుగు చల్లుకుని, స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే ఎంతో పోషకాలు ఉన్న వేడి వేడి ఆల్మండ్ సూప్ రెడీ! పిల్లలకి కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది!
రాగి సూప్
కావలసినవి: రాగి పిండి- 2 స్పూన్లు, నూనె (లేదా నెయ్యి)- స్పూను, జీలకర్ర- ½ స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్- ½ స్పూను, ఉల్లిపాయ ముక్కలు- కప్పు, క్యారెట్ ముక్కలు- అరకప్పు, టమాటా ముక్కలు- అరకప్పు, బీన్స్ ముక్కలు- కప్పు, నీళ్ళు- 2 కప్పులు, ఉప్పు- రుచికి సరిపడా, మిరియాల పొడి- ½ స్పూను, కొత్తిమీర తరుగు- గుప్పెడు, నిమ్మరసం- స్పూను.
తయారీ: రాగిపిండిని చిన్న గిన్నెలోకి తీసుకొని ఉండలు కట్టకుండా కొద్దిగా నీరు పోసి, బాగా కలిపి పక్కనపెట్టుకోవాలి. బాండీ పొయ్యిమీద పెట్టి, నూనె వేసి వేడిచేయాలి. జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, బీన్స్, టమాటా ముక్కలు వేసి, ముక్కలు మెత్తబడే వరకూ దోరగా వేయించండి. వెంటనే రెండు కప్పుల నీళ్ళు పోసి, రుచికి సరిపడా ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా మరిగించాలి. నీళ్ళు మరుగుతున్నప్పుడు, అందులో ముందుగా కలిపి పెట్టుకున్న రాగిపిండి మిశ్రమాన్ని వేసి తిప్పుతూ నెమ్మదిగా కలపాలి. రెండు నుండి మూడు నిమిషాల పాటు కాస్త చిక్కబడే వరకూ సిమ్‌లో ఉడికించాలి. చివరగా కొత్తిమీర తరుగు వేసి, స్టవ్ ఆఫ్ చేసాక నిమ్మరసం పిండుకోవాలి. అంతే ఆరోగ్యకరమైన వేడి వేడి రాగిసూప్ రెడీ. తాగితే బాడీకి ఎంతో బలం, నోటికి చాలా రుచిగా ఉంటుంది.
చిరుధాన్యాల సూప్
కావలసినవి: కొర్రలు / సామలు/అరికెలు- 2 స్పూన్లు, నూనె / నెయ్యి- స్పూను, జీలకర్ర- ½ స్పూను, అల్లంవెల్లుల్లి పేస్ట్- ½ స్పూను, ఉల్లిపాయ ముక్కలు- 2 స్పూన్లు, క్యారెట్ ముక్కలు- 2 స్పూన్లు, స్వీట్ కార్న్ విత్తనాలు- 2 స్పూన్లు, బీన్స్ ముక్కలు- 2 స్పూన్లు, నీళ్ళు- 2½ కప్పులు, ఉప్పు- రుచికి సరిపడా, మిరియాల పొడి- ½ స్పూను, కొత్తిమీర తరుగు- గుప్పెడు, నిమ్మరసం- స్పూను.
తయారీ: ముందుగా చిరుధాన్యాలను (కొర్రలు/సామలు) శుభ్రంగా కడిగి, రెండు గంటల పాటు నానబెట్టి, ఆ తర్వాత మెత్తనిపొడిలా / మిక్సీలో బరకగా రుబ్బుకోవాలి. గిన్నెలో కొద్దిగా నీరు పోసి, ఆ పిండిని ఉండలు కట్టకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి. బాండీ పొయ్యిమీద పెట్టి, నూనె వేసి వేడిచేయాలి. జీలకర్ర, అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. తర్వాత ఉల్లిపాయ, క్యారెట్, స్వీట్ కార్న్, బీన్స్ ముక్కలు వేసి, కాస్త మెత్తబడే వరకూ దోరగా వేయించాలి. వెంటనే రెండున్నర కప్పుల నీళ్ళు పోసి, రుచికి సరిపడా ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా మరిగించాలి. నీళ్ళు మరుగుతున్నప్పుడు, ముందుగా కలిపి పెట్టుకున్న మిల్లెట్ మిశ్రమాన్ని వేసి తిప్పుతూ నెమ్మదిగా కలపాలి. నాలుగు నుండి ఐదు నిమిషాల పాటు చిక్కబడే వరకూ సిమ్‌లో ఉడికించాలి. చివరగా కొత్తిమీర తరుగు వేసి, స్టవ్ ఆఫ్ చేసాక నిమ్మరసం పిండుకోవాలి. అంతే ఎంతో ఆరోగ్యకరమైన వేడి వేడి మిల్లెట్స్ సూప్ రెడీ! బరువు తగ్గాలనుకునే వారికి, షుగర్ ఉన్నవారికి ఇది చాలా మంచి ఆహారం.








కామెంట్‌లు (0)