ఆదివారం, 23 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఒక పరోటా.. బోలెడు వెరైటీలు!

1 గంట క్రితం

paneer.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 23, 2026, 10:10 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

పరోటా అంటే ముందుగా గుర్తొచ్చేది దాని రుచికన్నా పొరల మృదుత్వం. అయితే పరోటాను సరైన పదార్థాలతో కలిపితే, పోషకాహారంలోనూ భాగం చేసుకోవచ్చు. గోధుమ పిండి, ఆకుకూరలు, కూరగాయలు, పప్పులు, పనీర్‌ వంటి పదార్థాలను పరోటాలో చేర్చడం ద్వారా రుచి మాత్రమే కాదు, ప్రొటీన్‌, ఫైబర్‌, విటమిన్లు, ఖనిజాలు వంటి పోషకాలు కూడా అందేలా చేయవచ్చు. రుచికి, ఆరోగ్యానికి మధ్య సమతుల్యతతో చేసుకుంటే పరోటా కూడా రోజువారీ ఆహారంలో అప్పుడప్పుడు చక్కని ఎంపికగా నిలుస్తుంది. మరి రకరకాల పరోటాలను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.

పల్లీ–పనీర్‌తో..

కావాల్సినవి: గోధుమ పిండి – 2 కప్పులు, పనీర్‌ – 100 గ్రాములు, పల్లీలు – ½ కప్పు, పచ్చిమిర్చి – 5, ధనియాలు – స్పూను, జీలకర్ర – ½ స్పూను, కొత్తిమీర – కొద్దిగా సన్నగా తరిగినది, ఉప్పు – తగినంత, నీరు – అవసరమైనంత, నూనె లేదా నెయ్యి – పరోటాలు కాల్చడానికి తగినంత.

తయారీ : ముందుగా బాండీలో పల్లీలు, పచ్చిమిర్చి, ధనియాలు, జీలకర్ర స్వల్పంగా వేయించి చల్లార్చాలి. అందులో కొత్తిమీర, ఉప్పుతో కలిపి ముద్దలా చేసుకోవాలి.

ఒక గిన్నెలో గోధుమ పిండి తీసుకుని, అవసరమైనంత నీటిని కొద్దికొద్దిగా పోస్తూ మెత్తగా పిండిని కలిపి, 10–15 నిమిషాలు మూతపెట్టి ఉంచాలి. తయారు చేసుకున్న పల్లీల ముద్దను, తురిమిన పనీర్‌ను వేసి కలిపి ఉంచాలి. గోధుమపిండిని సమానమైన ఉండలుగా చేసుకుని, ఒక్కో ఉండను గుండ్రంగా చెపాతీలా ఒత్తుకుని, దానిపై పల్లీ పన్నీర్‌ ‌మిశ్రమం అప్లై చేయాలి. దానిపై మరో చెపాతీ పెట్టి పైపైన ఒత్తుకోవాలి. ఇలా పరోటాలు చేసుకుని, పెనంపై వేసి రెండు వైపులా మోస్తరు మంటపై కాల్చుతూ, అవసరమైనంత నూనె లేదా నెయ్యి రాయాలి. రెండు వైపులా బంగారు రంగు మచ్చలు వచ్చి పరోటా చక్కగా కాలిన తర్వాత తీసేయాలి. పల్లీలు, పనీర్‌ ఈ పరోటాకు ప్రోటీన్‌, ఆరోగ్యకరమైన కొవ్వులు అందుతాయి. రుచికరమైన ఈ పరోటాలకు పెరుగు, పుదీనా–కొత్తిమీర చట్నీ, కూరగాయల రైతా మంచి కాంబినేషన్‌.

palak parota.jpg

నువ్వులు-పాలకూరతో

కావాల్సినవి: గోధుమ పిండి – 2 కప్పులు, నువ్వులు-కప్పు, పాలకూర – 2 కప్పులు, ఉల్లిపాయ – 1, పచ్చిమిర్చి – 2, జీలకర్ర – ½ స్పూన్, ధనియాల పొడి – 1 స్పూను, అల్లం – చిన్నముక్క, ఉప్పు – తగినంత, నూనె – అవసరమైనంత, నీరు – అవసరమైనంత.

తయారీ : పాలకూరను శుభ్రంగా కడిగి నీరు పూర్తిగా పోయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఒక గిన్నెలో గోధుమ పిండి, పాలకూర, ఉల్లిపాయ, సన్నగా వేయించి పెట్టుకున్న నువ్వులు, పచ్చిమిర్చిముక్కలు, జీలకర్ర- ధనియాల పొడి, అల్లం ముద్ద, ఉప్పు వేసి బాగా కలపాలి. పాలకూర, ఉల్లిపాయల నుంచి కొంత తేమ వస్తుంది.. కాబట్టి నీటిని కొద్దికొద్దిగా మాత్రమే పోస్తూ మెత్తని పిండిలా కలపాలి. రెండుస్పూన్లు నూనె వేసి మరోసారి బాగా కలిపి, 10–15 నిమిషాలు మూతపెట్టి ఉంచాలి. పిండిని సమానమైన ఉండలుగా చేసుకుని, గోధుమ పిండి చల్లి పరోటాల్లా ఒత్తుకోవాలి. వేడిచేసిన పెనంపై పరోటా వేసి, రెండు వైపులా కాలిన తర్వాత కొద్దిగా నూనె రాస్తూ బంగారు రంగు వరకూ కాల్చాలి. వీటిని టమోటా కొత్తిమీర పచ్చడి, పెరుగు రైతాతో తింటే నోటికి ఎంతో రుచిగా ఉంటాయి. పాలకూరలో ఫైబర్‌, ఫోలేట్‌, విటమిన్‌ కె వంటి పోషకాలు ఉంటాయి. ఎదిగే పిల్లలకు ఇలాంటి పరోటాలు పెడితే బాగుంటుంది.

34ef10ecf1db5fc18d8425ff8aa3b5e0.jpg

వెజిటబుల్స్‌‌తో..

కావాల్సినవి: గోధుమ పిండి – 2 కప్పులు, క్యారెట్ – 1, బీన్స్ – ½ కప్పు, క్యాప్సికమ్ – ½ కప్పు, ఉల్లిపాయ – 1, పచ్చిమిర్చి – 2, కొత్తిమీర – కొద్దిగా, జీలకర్ర – ½ స్పూను, ధనియాల పొడి – స్పూను, అల్లం – కొద్దిగా, ఉప్పు – తగినంత, నూనె – 2 స్పూన్లు, నీరు – అవసరమైనంత, పరోటాలు కాల్చడానికి నూనె లేదా నెయ్యి – తగినంత.

తయారీ : క్యారెట్‌, బీన్స్‌, క్యాప్సికమ్‌, ఉల్లిపాయలను శుభ్రంగా కడిగి సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఒక పాన్‌లో కొద్దిగా నూనె వేసి జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి వేసి స్వల్పంగా వేయించాలి. తర్వాత ఉల్లిపాయ, బీన్స్‌, క్యారెట్‌, క్యాప్సికమ్‌ వేసి 2–3 నిమిషాలు మోస్తరు మంటపై వేయించాలి. కూరగాయలు పూర్తిగా మెత్తబడకుండా కొద్దిగా క్రంచీగా ఉండేలా చూసుకోవాలి. ధనియాల పొడి, ఉప్పు, కొత్తిమీర వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. మరో గిన్నెలో గోధుమపిండి వేసి, ఉప్పు, కొద్దికొద్దిగా నీరు పోసి చపాతిముద్దలా చేసుకొని పక్కనపెట్టుకోవాలి. మొదట చపాతీలు చేసుకొని, వాటిమీద ఈ కూరగాయల మిశ్రమాన్ని వేసి ఫోల్డ్‌ ‌చేయాలి. కూర బయటకు రాకుండా, ఒక్కొక్కటి గోధుమ పిండి చల్లి పరోటాల్లా ఒత్తుకోవాలి. వేడిచేసిన పెనంపై వేసి, రెండు వైపులా కాల్చుతూ కొద్దిగా నూనె లేదా నెయ్యి రాయాలి. రెండు వైపులా బంగారు రంగు మచ్చలు వచ్చాక ప్లేట్‌‌లోకి తీసుకోవాలి. ఈ కూరగాయల పరోటాలతో ఫైబర్‌, విటమిన్లు, ఖనిజాలు లభిస్తాయి. ఈ పరోటాలను బంగాళదుంప కుర్మా, పచ్చిమిర్చి పచ్చడితో కలిపి తింటే అద్భుతంగా ఉంటాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్