శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన మారథాన్ ఫ్యూజన్ సంస్థ ఇటీవల చేసిన ఒక ప్రకటన శాస్త్రసాంకేతిక రంగంలో ఆసక్తికరమైన చర్చకు తెరతీసింది. కేంద్రక సంలీన (న్యూక్లియర్ ఫ్యూజన్) ప్రక్రియలో ఉత్పత్తయ్యే అత్యంత శక్తిమంతమైన న్యూట్రాన్లను ఉపయోగించి పాదరసాన్ని స్థిరమైన బంగారంగా మార్చినట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఐరోపా అణు పరిశోధనా సంస్థ సెర్న్ గతంలో సాధించిన ఉత్పత్తి రేటుతో పోలిస్తే పదిరెట్లు ఎక్కువగా బంగారాన్ని ఉత్పత్తి చేయగలిగామని పేర్కొంది. ఈ సాంకేతికతను భారీ స్థాయిలో అమలు చేయగలిగితే భవిష్యత్తులో ఫ్యూజన్ విద్యుత్ కేంద్రాలు విద్యుత్‌తోపాటు బంగారాన్ని కూడా ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుందని అంచనా వేస్తోంది. ప్రయోగశాలలో ఒక మూలకాన్ని మరో మూలకంగా మార్చడం శాస్త్రీయంగా సాధ్యమే. కానీ దాన్ని తక్కువ ఖర్చుతో, భారీ పరిమాణంలో ఉత్పత్తి చేయడం అంత సులభం కాదు.
రసవాదుల కల
బంగారాన్ని కృత్రిమంగా తయారు చేయాలన్న ఆలోచన ఇప్పటిది కాదు. వేల సంవత్సరాలుగా మనిషిని ఆకర్షిస్తున్న ఈ ప్రయత్నానికి ఆధునిక అణు విజ్ఞానం కొత్త మార్గాన్ని చూపుతోంది. మధ్యయుగాల్లో యూరప్, అరబ్ దేశాలు, చైనా, భారతదేశాల్లో రసవాదులు వివిధ లోహాలను బంగారంగా మార్చగల పదార్థం కోసం అన్వేషించారు. దానినే 'ఫిలాసఫర్స్ స్టోన్' అని పిలిచేవారు. పాదరసం, గంధకం వంటి పదార్థాలను ప్రత్యేక పద్ధతుల్లో కలిపితే బంగారం తయారవుతుందని నమ్మేవారు. ఈ ప్రయత్నాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోయినా రసాయన శాస్త్ర అభివృద్ధికి కొంతవరకు దోహదపడ్డాయి. ఆధునిక శాస్త్రం ఒక కీలకమైన విషయాన్ని గుర్తించింది. ఒక పదార్థం బంగారమా, రాగినా, పాదరసమా అనేది దాని రంగు, బరువు, మెరుపును బట్టి నిర్ణయించబడదు. అణు కేంద్రకంలో ఎన్ని ప్రోటాన్లు ఉన్నాయన్నదే ఆ మూలకాన్ని గుర్తిస్తుంది. బంగారంలో 79 ప్రోటాన్లు ఉంటే, పాదరసంలో 80 ఉంటాయి. కాబట్టి పాదరసాన్ని బంగారంగా మార్చాలంటే దాని అణు కేంద్రకంలో ఒక ప్రోటాన్ తగ్గాలి. సాధారణ రసాయన చర్యల్లో అణువుల మధ్య ఎలక్ట్రాన్ల మార్పిడి, రసాయన బంధాల్లో మార్పులు మాత్రమే జరుగుతాయి. అణు కేంద్రకంలో మార్పు జరగదు. అందువల్ల ఒక మూలకాన్ని మరో మూలకంగా మార్చడం సాధ్యం కాదు. అందుకు అణు చర్యలు అవసరం.
అణు ప్రయోగాలు
బంగారాన్ని కృత్రిమంగా తయారు చేయడం అసాధ్యమేమీ కాదని 20వ శతాబ్దపు అణు పరిశోధనలు నిరూపించాయి. 1924లో జపాన్ భౌతిక శాస్త్రవేత్త హంటారో నగావోకా పాదరసాన్ని బంగారంగా మార్చే ప్రయోగాల గురించి ఆలోచనలు వ్యక్తం చేశారు. 1925లో నేచర్ పత్రికలో తన ప్రయత్నాలపై నివేదిక కూడా ప్రచురించారు. అయితే అప్పటి సాంకేతిక పరిజ్ఞానంతో ఆయన ఆశించిన ఫలితాన్ని సాధించలేకపోయారు. 1941లో అమెరికాలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు వేగవంతమైన న్యూట్రాన్లతో పాదరసంపై ప్రయోగాలు చేసి బంగారపు అణుధార్మిక ఐసోటోపులను సృష్టించారు. 1980లో గ్లెన్ సీబోర్గ్ సహా పరిశోధకులు బర్కిలీలోని లారెన్స్ బర్కిలీ జాతీయ ప్రయోగశాలలో బిస్మత్ అణు కేంద్రకాలపై కార్బన్, నియాన్ అణు కేంద్రకాలతో దాడి చేసి బంగారు కేంద్రకాలను సృష్టించారు. ఈ ప్రయోగాలు అణు కేంద్రకంలో మార్పులు చేయడం ద్వారా బంగారాన్ని తయారు చేయవచ్చని నిరూపించాయి. అయితే వాటి ద్వారా ఉత్పత్తయిన పరిమాణం చాలా తక్కువ. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో ఏర్పడిన బంగారం అణుధార్మిక స్వభావం కలిగి ఉండేది. దీంతో ఈ పద్ధతులు వాణిజ్యపరంగా ఉపయోగపడలేదు.
మరో ముఖ్యమైన ఘట్టం 2025లో స్విట్జర్లాండ్‌లోని సెర్న్ పరిశోధనా కేంద్రంలో చోటుచేసుకుంది. లార్జ్ హాడ్రాన్ కొలైడర్‌లో అత్యంత వేగంతో ప్రయాణిస్తున్న సీసం అణు కేంద్రకాలు ఒకదానికొకటి అతి సమీపంగా వచ్చినప్పుడు ఏర్పడిన బలమైన విద్యుదయస్కాంత క్షేత్రాల ప్రభావంతో కొన్ని ప్రోటాన్లు, న్యూట్రాన్లు బయటకు వెళ్లిపోయాయి. సీసంలో 82 ప్రోటాన్లు ఉంటాయి. బంగారంలో 79 మాత్రమే ఉంటాయి. మూడు ప్రోటాన్లు కోల్పోయిన సీసం కేంద్రకం బంగారంగా మారింది. 2015–2018 మధ్య జరిగిన ప్రయోగాల్లో నాలుగు ప్రధాన పరిశోధనా కేంద్రాల్లో కలిపి సుమారు 860 కోట్ల బంగారు కేంద్రకాలు ఏర్పడ్డాయని సెర్న్ తెలిపింది. అయితే వాటి మొత్తం బరువు 29 పికోగ్రాములు (0.000000029 గ్రాములు) మాత్రమే! అంటే కంటికి కనిపించనంత అతి సూక్ష్మ పరిమాణం.
కొత్త పద్ధతి
ఇప్పుడు మారథాన్ ఫ్యూజన్ ప్రతిపాదిస్తున్న విధానం గత ప్రయోగాలకంటే భిన్నమైనది. ఇందులో పాదరసంలోని మెర్క్యురీ-198 అనే ఐసోటోప్‌ను ఉపయోగిస్తారు. డ్యూటీరియం, ట్రిటియం అనే హైడ్రోజన్ ఐసోటోపుల కేంద్రకాలు కలిసే సంలీన ప్రక్రియలో అత్యంత శక్తిమంతమైన న్యూట్రాన్లు ఉత్పత్తవుతాయి. ఒక్కో న్యూట్రాన్‌కు 14 మిలియన్ ఎలక్ట్రాన్ వోల్టుల శక్తి ఉంటుంది. ఈ న్యూట్రాన్లను మెర్క్యురీ-198పై ప్రయోగిస్తే దాని కేంద్రకం నుంచి రెండు న్యూట్రాన్లు బయటకు వెళ్లి మెర్క్యురీ-197 ఏర్పడుతుంది. ఇది స్థిరమైనది కాదు. అణుధార్మిక క్షయం సమయంలో ఎలక్ట్రాన్ క్యాప్చర్ అనే ప్రక్రియ ద్వారా కేంద్రకంలోని ఒక ప్రోటాన్ న్యూట్రాన్‌గా మారుతుంది. దీంతో 79 ప్రోటాన్లు కలిగిన గోల్డ్-197 ఏర్పడుతుంది. ఇది సహజంగా లభించే
స్థిరమైన బంగారమే ! ఈ పద్ధతిలోని ప్రత్యేకత ఏమిటంటే, *ఫ్యూజన్ విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగించే న్యూట్రాన్లనే బంగారం తయారీకి కూడా వినియోగించుకోవచ్చు. ఫ్యూజన్ కేంద్రాల్లో ట్రిటియం ఇంధనాన్ని తిరిగి ఉత్పత్తి చేయడానికి న్యూట్రాన్లు అవసరం. ఈ ప్రక్రియలో వాటి సంఖ్యను పెంచేందుకు ఉపయోగించే ప్రత్యేక పొరలో మెర్క్యురీ-198ను చేర్చవచ్చని సంస్థ ప్రతిపాదిస్తోంది.
ఆచరణలో సవాళ్లు
2026 అక్టోబరు 21న మారథాన్ ఫ్యూజన్ సంస్థ తాము ఫ్యూజన్ న్యూట్రాన్ల సాయంతో పాదరసాన్ని స్థిరమైన బంగారంగా మార్చినట్లు ప్రకటించింది. సెర్న్ గతంలో సాధించిన ఉత్పత్తి రేటుతో పోలిస్తే పదిరెట్లు ఎక్కువ రేటును సాధించామని పేర్కొంది. అయితే ఆ బంగారం స్వచ్ఛత ఎంత? ప్రయోగానికి ఎంత శక్తి ఖర్చయింది? పదిరెట్ల ఉత్పత్తి రేటును ఏ ప్రాతిపదికన లెక్కించారు? వంటి వివరాలను సంస్థ పూర్తిగా వెల్లడించలేదు.
ఈ ప్రయోగాల్లో అత్యంత కీలకమైన సమస్య అణుధార్మికత. మెర్క్యురీ-197 సుమారు 64 గంటల అర్ధాయుష్షుతో క్షయించి స్థిరమైన బంగారంగా మారుతుంది. అయితే పెద్ద స్థాయిలో అణు ప్రక్రియలు జరిగినప్పుడు ఇతర అణుధార్మిక ఐసోటోపులు కూడా ఏర్పడే ప్రమాదం ఉంది. వాటిని వేరు చేసి బంగారాన్ని సురక్షితంగా ఉపయోగించుకునే స్థాయికి తీసుకురావడానికి ప్రత్యేక శుద్ధి, నిల్వ ప్రక్రియలు అవసరం. కొన్ని అణుధార్మిక అవశేషాలు పూర్తిగా క్షీణించడానికి కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు. ఇక వాణిజ్య స్థాయిలో ఫ్యూజన్ విద్యుత్ కేంద్రాల నిర్మాణం కూడా ఇంకా పెద్ద సవాలు. అలాంటి కేంద్రాల్లో బంగారం ఉత్పత్తి చేయాలంటే అదనపు సాంకేతిక ఏర్పాట్లు, శుద్ధి ప్రక్రియలు అవసరమవుతాయి. బంగారం అమ్మకం ద్వారా వచ్చే ఆదాయం కంటే దాని తయారీ, శుద్ధి, భద్రత, నిల్వ ఖర్చులే ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. అందువల్ల ప్రయోగశాలలో బంగారాన్ని తయారు చేయడం సాధ్యమేనని శాస్త్రం ఇప్పటికే నిరూపించింది. కానీ దాన్ని తక్కువ ఖర్చుతో, లాభదాయకమైన స్థాయిలో ఉత్పత్తి చేయగలమా అన్నదే అసలు ప్రశ్న.








కామెంట్‌లు (0)