రాతియుగం నాటి అరుదైన ఆనవాళ్ల నుంచి రాజవంశాల వైభవానికి ప్రతీకగా నిలిచే చారిత్రక కట్టడాల వరకు... పుణ్యక్షేత్రాల నుంచి ప్రకృతి ఒడిలో పరవశించే అటవీ ప్రాంతాల వరకు... కర్నూలు జిల్లా పర్యాటకులకు ఒక అద్భుత ప్రపంచాన్ని ఆవిష్కరిస్తోంది. శతాబ్దాల ఘన చరిత్రను చాటిచెప్పే కొండారెడ్డి బురుజు, ప్రకృతి చెక్కిన శిల్పం లాంటి బెలూన్ గుహలు, నల్లమల పచ్చదనం మధ్య వెలసిన ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలం, యాత్రికులను ఆకర్శించే మంత్రాలయం, యాగంటి, ఆహోబిలం... ఇలా ప్రతి అడుగులోనూ ఒక అద్భుతం పలకరిస్తుంది. ప్రాచీన వారసత్వ సంపదను, ప్రకృతి రమణీయతను ఒకే చోట అనుభూతి చెందేందుకు దేశ విదేశీ పర్యాటకులను సైతం కనువిందు చేసే పర్యాటక ప్రదేశాల నిలయం కర్నూలు ఉమ్మడి జిల్లా.
కొండారెడ్డి బురుజు: కర్నూలు పేరు చెప్పగానే తొలుత కొండారెడ్డి బురుజు గుర్తుకు వస్తుంది. నగర నడిబొడ్డున ఉండే ఈ అపురూప కట్టడం వెనుక వందల యేళ్ల చరిత్ర ఉంది. క్రీ.శ. 1542లో శ్రీకృష్ణదేవరాయల అచ్యుత దేవరాయల కాలంలో నిర్మించారని చరిత్ర కారులు చెబుతారు. ఈ బురుజు కర్నూలు చిహ్నంగానే కాకుండా ఇటీవల సినిమా షూటింగులకు కూడా ఉపయోగిస్తున్నారు. కర్నూలు ఉస్మానియా కళాశాల సమీపలోని అబ్దుల్ వహాబ్ టోంబ్ మనకు కన్పిస్తుంది. దీనిని ఔరంగజేబు తన గురువుకు కట్టించిన సమాధి అని చెబుతారు. ఇక్కడ రెండు గమ్మజ్లున్నాయి. పెద్దగుమ్మజ్ చాలా అద్భుతమైన ఇంజనీరింగు నైపుణ్యాలు కనిపిస్తాయి. ప్రపంచంలోనే రెండో అతి పెద్ద గోల్ గుమ్మజ్ మొదటిది. ఇవన్నీ తుంగభద్ర నది, దాని ఉపనది హంద్రీ, వక్కెరవాగుల మధ్యనే ఉన్నాయి.
2017 మే 10న బైర్లూటి సమీపంలో నిర్మించిన ఎకో టూరిజం కేంద్రానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ రాజధాని ఢిల్లీ నుంచీ యాత్రికులు తరలివస్తున్నారు.
నాగార్జునసాగర్-శ్రీశైలం పెద్దపులుల అభయారణ్యం : దేశంలోనే టైగర్ రిజర్వు ఫారెస్టు నాగార్జునసాగర్-శ్రీశైలం పెద్దపులుల అభయారణ్యం, అరుదైన వృక్షజాతులను, వన్యప్రాణులను, వీక్షించేందుకు 15 కిలో మీటర్ల జంగిల్ సఫారి చేయొచ్చు. అతిప్రాచీన దేవాలయాలు, కోనేరు, మాజీ రాష్ట్ర పతి నీలం సంజీవరెడ్డి మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ తదితరులు మొక్కలు నాటిన ప్రదేశాలు సందర్శకులను ఆకట్టుకుంటాయి. ఆరు కిలో మీటర్ల మేర కొండలు, గుట్టలు ఎక్కేందుకు ట్రెక్కింగ్ మార్గాన్ని, అటవీప్రాంత భూమి సారూప్యత, వృక్షాలు, పక్షులు, క్రిమికీటకాలను తదితర వాటిని గురించి తెలుసుకునేందుకు నేచర్ వాక్‌ని అందుబాటులో ఉంచారు. ఇది చెంచుల జీవనానికి ఆర్థికంగా తోడ్పాటునందిస్తోంది. 20 మంది చెంచులను ఎంపిక చేసి టూరిజం కేంద్రానికి సెక్యూరిటీగార్డులు, సఫారి గైడ్స్, అటవీ ఉత్పత్తులను విక్రయించే సిబ్బందిని నియమించారు.
నల్లమల అడవులు: నల్లమల పర్వతశ్రేణి శ్రీశైలం నుంచి కడప జిల్లా వరకు 113 కి.మీ మేర ఉన్నాయి. కృష్ణానదికి ఇరువైపులా ప్రాంతాన్ని కేంద్ర ప్రభుత్వం పులుల అభయారణ్యంగా ప్రకటించింది. ఇక్కడ పులులతో పాటు అనేక వన్య మృగాలు, పక్షులు కనిపిస్తాయి. జీవవైవిధ్య పరమైన అనేక క్రిమి కీటకాలు రాక్షససాలీడు లాంటివి కనిపిస్తాయి. గుండ్ల బ్రహ్మేశ్వర అభయారణ్యం ఆత్మకూరు నుంచి బండి ఆత్మకూరు సరిహద్దు వరకు ఉంది. ఇక్కడి దొరికే ఎర్రచందనం ప్రపంచంలోనే అత్యుత్తమైనదిగా గుర్తింపు పొందింది. కేవలం నల్లమల, శేషాచలం అడవుల్లో మాత్రమే ఇవి దొరుకుతాయి. ఈ అడవుల్లో, పులుల నుంచి నక్కల వరకు అనేక జంతువులు, పక్షులు మనకు కనువిందు చేస్తాయి. ఓర్వకల్లు మండలం కేతవరంలో ఆదిమకాలం నాటి అవశేష చిత్రాలు, ఓర్వకల్లు రాక్ గార్డెన్స్, వైఎస్ఆర్ స్మృతి వనం, రోళ్లపాడు బట్టమేక పక్షి ఉన్నాయి.
శ్రీశైలం, కొలనుభారతి, మాహానంది, అహొబిళం, రుద్రకోటేశ్వర స్వామి, ఓంకారం లాంటి అనేక దేవాలయాలు ఈ అడవుల్లో ఉన్నాయి. మంత్రాలయం, శ్రీశైలం, అహోబిళం క్షేత్రాలు పర్యాటకులతో రద్దీగా ఉంటున్నాయి. ఆదోని సమీపంలో పెద్ద తుంబళం జైన కేంద్రంగా ఉంది. ఇవేకాకుండా ప్రఖ్యాత చర్చిలు, మసీదులు కూడా ఉన్నాయి.

అబ్బురపరిచే బెలుంగుహలు: ప్రపంచ ప్రఖ్యాతి గడించిన బెలుంగుహలు 4,500 ఏళ్ల క్రితం ఏర్పడ్డాయని చరిత్రకారులు చెబుతున్నారు. 1987 రాబర్ట్ పూటే అనే ఆంగ్లేయుడు ఈ ప్రాంతంలో ఖనిజాల కోసం అన్వేషిస్తుండగా సుమారు 270 గుహలను ఆయన గుర్తించారు. ప్రపంచంలో రెండోస్థానం, ఆసియాఖండంలో మొదటి స్థానంలో ఈ గుహలు ఉన్నాయి.
బనగానపల్లె నుంచి బేతంచెర్ల వైపు వెళ్తే నాపరాళ్లు, రంగురాళ్ల గనులను చూడొచ్చు. బేతంచెర్లకు 10 కి. మీ. దూరంలో మద్దిలేటి స్వామిని లోయలో దర్శించొచ్చు. మద్ది లేరులో ప్రకృతి సోయగం చూడ ముచ్చటగా ఉంటుంది. ఓర్వకల్లు వద్ద గల ప్రపంచంలోనే రెండో స్థానం ఆసియాలో మొదటిస్థానాన్ని ఆక్రమించిన రాక్ గార్డెన్స్ వింత అనుభూతిని ఇస్తాయి. కేతవరం రాక్ పెయింటింగ్స్ ఆదిమానవుడు కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇక్కడ నివసించేడనడానికి ఆనవాళ్ళు అక్కడ కనిపిస్తాయి. తాండ్రపాడు గుట్టపైన రూపాల సంగమేశ్వరుని గుడిలో గల అద్భుత శిల్పసౌందర్యాన్ని వీక్షించొచ్చు.
శ్రీశైలం: ఇక్కడి శ్రీ భ్రమరాంబ మల్లి ఖార్జున స్వామి ఆలయానికి దేశం నలుమూలల నుంచి యాత్రికులు వస్తుంటారు. కర్ణాటక, మహారాష్ట్ర ల నుంచి సందర్శకులు ఎక్కువగా వస్తారు. కర్నూలుకు 190 కి. మీ. హైదరాబాదు 210 కి.మీ దూరంలో ఉంది. ఇక్కడ ఆలయ మేకాక, శివుడి అవతారాన్ని దర్శింపజేసే నవబ్రహ్మాలయం, ఔషధాలతో నిండిన మల్లికాగుండం, వృద్ధ మల్లిఖార్జున లింగం, సీతాదేవి ప్రతిష్టించిన శివ లింగం పాండవులు ప్రతిష్టించిన శివలింగాలు, సంతానానిచ్చే త్రిపలేశ్వరి వృక్షం, అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన భ్రమరాంబాదేవి ఆలయం, అంకాలమ్మ ఆలయం, అక్కమహాదేవిబిలం, శివాజీ స్ఫూర్తి కేంద్రం, పాతాళగంగ, నల్లమల కొండల్లో అతి ఎత్తైన శిఖరం, హటకేశ్వరాలయం, పాలధార, పంచధార, ప్రకృతి సిద్ధ జలధార, ఆదిశంకరులు తపస్సు చేసిన చోటు. శివానందలహరి, సాక్షిగణపతి ఆలయం, రోప్ వే పాతాళగంగకు అతిపెద్ద జల విద్యుత్ కేంద్రం, చెంచులక్ష్మి మ్యూజియం ఆకర్శిస్తున్నాయి.
కొలనుభారతి : దేశంలో మూడో సరస్వతీ ఆలయమైన కొలను భారతి ఆత్మకూరు తాలుకాలో కొత్తపల్లి మండలం, శివపురానికి 3కి. మీ. దూరంలో ఉంది. నల్లమల పాదాలవద్ద చారు ఘోషిని నది ఒడ్డున ఈ ఆలయం ఉంది. శ్రీశైలం బ్యాక్ వాటర్ లో కొన్నినెలలపాటు మునిగిపోయే సంగమేశ్వరాలయం ప్రత్యేక ఆకర్షణ.
మహానంది : నల్లమల పాదసీమలో అందమైన ప్రకృతిలో మహానంది ఆలయం ఉంది. శివలింగం అడుగు నుంచి వచ్చే నీటిధార కొలనులో చేరుతూ ఏడాది పొడవునా ఎంతో స్వచ్చంగా ఉంటుంది. నల్లమల పాదాల వద్ద, గుండ్లబ్రహ్మేశ్వరం, రుద్ర కోటేశ్వరం, ఓంకారాశ్వరుడు మనకు ఆత్మకూరు నుంచి వెలుగోడు ఈ అడవుల్లో కనిపిస్తాయి.
బనగానపల్లెలో నవాబుల కాలంనాటి పాడుపడిన కోట, బ్రహ్మంగారి మఠాలు, కోవెలకుంట్లలోని పాండురంగ స్వామి ఆలయం, బనగానపల్లె నుంచి బెలుంగుహలకు వేళ్లే దారిలో అవుకు రిజర్వాయ, యాగంటి వెళ్లే రస్తాలోని నవాబు పాతపాడు బంగ్లాను చూడొచ్చు. అక్కడి ఉమమహేశ్వర క్షేత్రం, మూడు అద్భుత గుహలు, దీప స్థంభం పర్యాటకులకు అద్భుత అనుభూతిని ఇస్తాయి. నల్లమల్లలోని అహోబిల నరసింహస్వామి ఆలయం, తుంగభద్ర నది ఒడ్డునున్న మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మఠానికి యాత్రికులు వస్తుంటారు.








కామెంట్‌లు (0)