అంగన్వాడీలపై నిర్బంధం

Jan 22,2024 00:25

తెనాలి, చిలకలూరిపేటలో సిఐటియు నాయకులకు నోటీసులు ఇస్తున్న పోలీసులు
ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి :
అంగన్వాడీల ఉద్యమంపై ప్రభుత్వం నిర్బంధం మరింత తీవ్రతరం చేసింది. తమ సమస్యలపై జగనన్నకు చెబుదాం పేరుతో సోమవారం చలో విజయవాడకు అంగన్వాడీల యూనియన్లు పిలుపునిచ్చాయి. కోటి సంతకాల ప్రతులను సిఎంకు అందచేసేందుకు విజయవాడకు వెళ్తున్నవారిని ఎక్కడిక కక్కడ నిర్బంధిస్తున్నారు. ఆదివారం సాయంత్రం నుంచి అంగన్వాడీ కార్యకర్తలకు, ఆయాలకు, సహయకులకు, సిఐటియు, ఎఐటియుసి నాయకులకు నోటీసులుజారీ చేశారు. పలు చోట్ల ఇళ్ల నుంచి బయటకు రానివ్వకుండా గృహనిర్బంధం అమలు చేస్తున్నారు. బయటకువచ్చి విజయ వాడకు బయలుదేరిన వారిని ఎక్కడికక్కడ అరెస్టు చేయాలని పోలీసు ఉన్నతాధికారులు అన్నిపోలీసు స్టేషన్‌లకు ఆదేశాలుజారీ చేశారు. జాతీయ రహదారితో పాటు ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రధాన మార్గాలో చెక్‌పోస్టులు, పికెట్‌లు ఏర్పాటు చేశారు. తాడేపల్లి సిఎం నివాసం చుట్టూ ఐదు కిలో మీటర్ల మేరకు వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించారు. సిఎం నివాసం పరిసరాల్లో దాదాపు 500 మంది పోలీసులను మొహరించారు. 100 మంది మహిళా పోలీసులను కూడా రప్పించారు. కాజ టోల్‌ గేట్‌ వద్ద వాహనాల తనిఖీ జరుగుతోంది. అనుమానితులను ప్రశ్నించి పంపుతున్నారు. అంగన్వాడీల చలో విజయవాడకు అనుమతి లేదని చెబుతున్న పోలీసులు నిబంధనలు ఉల్లఘిస్తే కఠిన చర్యలు తప్పవంటున్నారు. అయితే చలో విజయవాడ నిర్వహించి తీరుతామని అంగన్వాడీలు స్పష్టం చేశారు. డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని తేల్చి చెప్పారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఆదివారం రాత్రి నుంచి కీలకమైన నేతల రాకపోకలపై నిఘాతోపాటు పలువురికి నోటీసులు జారీ చేశారు.
విధుల్లో చేరకుంటే తొలగిస్తాం : కలెక్టర్‌
ప్రభుత్వం విధించిన గడువు మేరకు సోమవారం ఉదయం 9 గంటల కల్లా విధులకు హాజరవ్వని అంగన్వాడీలను తొలగించేందుకు ఉత్తార్వులు జారీ చేస్తామని గుంటూరు జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం రాత్రి పొద్దుపోయిన తరువాత ప్రకటన జారీ చేశారు. అంగన్వాడీలకు ఇదే చివరి అవకాశమని పేర్కొన్నారు.
చలో విజయవాడకు అనుమతి లేదు : ఎస్పీ
ఇదిలా ఉండగా అంగన్వాడీలు సోమవారం నిర్వహించ తలపెట్టిన ‘చలో విజయవాడ, చలో తాడేపల్లి’ కార్యక్రమాలకు అనుమతుల్లేవని జిల్లా ఎస్‌పి ఆరిఫ్‌ హఫీజ్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. గుంటూరులో సెక్షన్‌ 30 అమలులో ఉందన్నారు. పోలీసుల ఆదేశాలను ధిక్కరించి ఎవరైనా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

➡️