అంగన్‌వాడీ సమ్మెను పరిష్కరించాలి: ఐద్వా

ప్రజాశక్తి-సంతనూతలపాడు: అంగన్వాడీ కార్యకర్తలు గత పది రోజులుగా చేస్తున్న నిరవధిక సమ్మెను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఐద్వా జిల్లా కార్యదర్శి కంకణాల రమాదేవి డిమాండ్‌ చేశారు. గురువారం స్టానిక బస్టాండ్‌ సెంటర్లో ఐద్వా కార్యకర్తలు అంగన్వాడీ సమ్మెకు మద్దతుగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ వారి ఉద్యమానికి అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం సంపూర్ణంగా మద్దతిస్తున్నదని అన్నారు. పేదలు నివసిస్తున్న ప్రాంతాల్లో పౌష్టికాహారం పంపిణీ తో పాటు ఆరోగ్య సేవలు అందించేటువంటి బాధ్యతను అంగన్వాడీ కేంద్రాలు నిర్వహిస్తున్నాయని, ఈ కేంద్రాల్లో అటువంటి సౌకర్యం అందకపోతే పేదలకు అనేక ప్రమాదాలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉందని ప్రభుత్వం ఇవన్నీ ఆలోచించి మానవతా దృక్పథంతో అంగన్వాడీ కార్యకర్తలకు గతంలో ఇచ్చిన హామీలను సక్రమంగా అమలు చేయమని డిమాండ్‌ చేశారు. అంగన్వాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తేనే భవిష్యత్తు భారతదేశం ఆరోగ్యకరంగా ఉంటుందని అన్నారు. ఐద్వా జిల్లా అధ్యక్షురాలు సయ్యద్‌ షర్మిల మాట్లాడుతూ ఇప్పటికే దేశం ఆకలి నమూనాలో 114వ స్థానానికి చేరిందన్నారు. పోషకాహార లోపంతో పసిబిడ్డలు, మహిళలు అనేక వ్యాధులకు గురవుతున్నారన్నారు. ముఖ్యంగా మహిళలు రక్తహీనతకు గురై చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. ఇటువంటి స్థితిలో అంగన్వాడీ కేంద్రాలను కేంద్ర ప్రభుత్వం పటిష్టం చేయకపోగా, నిర్వీర్యం చేసే కుట్రలకు కేంద్ర రాష్ట్ర పాలకులు సిద్ధపడుతున్నారన్నారు. ఈ కాలంలో మహిళల మీద దాడులు అకృత్యాలు తీవ్ర రూపం దాల్చాయని వాటిని అరికట్టడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో దశలవారీగా సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తామని ప్రభుత్వం చెప్పి ఐదేళ్లయినా అది అమల్లోకి రాలేదని అన్నారు. ఆడవాళ్లను ఏడిపించిన ప్రభుత్వాలు ఏవీ మనుగడ సాగించలేదని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా నాయకురాళ్లు ఎన్‌ మాలతి, బి పద్మ, కె ప్రసన్న, జి భానుమతి, ఎస్కే మధారమ్మ, ఎస్‌కే ఖాదరున్నీసా సిహెచ్‌ శాంతకుమారి, అమ్మ అంజమ్మ, కే రేణుక, కే రత్తమ్మ, తదితరులు పాల్గొన్నారు.

➡️