అంగన్‌’వేడి’

అంగన్వాడీ ఉద్యమం వేడెక్కుతోంది. కడప, అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ల ఎదుట గతంలో ఎన్నడూ లేని విధంగా సడలని పట్టుదలతో ఉద్య మాన్ని పతాకస్థాయికి చేరుకుంది. 33 రోజులుగా కొత్త సంవత్సరం, సక్రాంతి వంటి పండుగలను సైతం లెక్కచేయకుండా ఉద్యమం రోజురోజుకూ కొత్తశిఖరాలకు చేరుకుంటోంది. ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేస్తున్నారనే కనికరం లేకుండా ఎస్మాస్త్రాలను ప్రయోగించినా పట్టువదలని పోరాటం అనన్య సామాన్యమని చెప్పాలి. ఇటువంటి గట్టి పట్టుదలకు పోరాడితేనే ప్రభుత్వాలు కళ్లు తెరిచే అవకాశం ఉందని చెప్పవచ్చు. లేకపోతే భవిష్యత్‌ పోరాటాలపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది. 2024 సార్వత్రిక ఎన్నికల ముంగిట భయపడి లొంగిపోతే భవిష్యత్‌ పోరాటాలు చేయడానికి అవకాశం ఉండదనే సంగతిని గుర్తెరగాల్సి ఉంది. పోరాట నాయకత్వాలు సైతం పట్టువదలని పోరుబాటను కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంగన్వాడీలు పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని కోరుతున్న న్యాయమైన డిమాండ్లను పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మినీ అంగన్వాడీల అప్‌గ్రెడేషన్‌ నుంచి సమాన పనికి సమాన వేతనం, అంగన్వాడీ సెంటర్ల అద్దె చెల్లింపులు వంటి న్యాయమైన డిమాండ్లను విస్మరించలేనివి. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం వంటి డిమాండ్లను సానుకూల దృక్పథంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఇటువంటి సహజ న్యాయ సూత్రాలను సానుకూల దృక్పథంతో పరిశీలన చేయకుండా, అణచివేత థోరణికి ఎంచుకోవడం, ఎస్మాస్త్రం వంటి ప్రయోగాలు చేయడం, నోటీసులు ఇవ్వడం, విధుల్లో చేరాలని హుకూంలు జారీచేయడం నియంతృత్వానికి నిదర్శనం. ఇటువంటి పెత్తందారీ పోకడలను డౌన్‌ ట్రెండ్‌పై ప్రయోగించాలనుకోవడం విస్మయాన్ని కలిగిస్తోంది. అంగ న్వాడీలు, ఆశాలేమీ గొంతెమ్మ కోర్కెలను కోరడం లేదు. పొరుగు రాష్ట్రం తెలంగాణ కంటే రూ.వెయ్యి అధికంగా చెల్లిస్తామని పాదయాత్రలో ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరడం మినహా మరేమీ లేదు. సార్వత్రిక ఎన్నికల ముంగిట ఇటువంటి అహంకార పూరిత థోరణి ప్రదర్శిస్తున్న ప్రభుత్వం సాధారణ రోజుల్లో ఎటువంటి నియంతృత్వ థోరణిని ప్రదర్శించేదో అర్థం చేసుకోవాల్సి ఉంది. అంగన్వాడీల ఆందోళన కారణంగా తల్లీబిడ్డల ఆరోగ్యం దగ్గర నుంచి అన్ని రకాల సేవలు నిలిచిపోవ డంతో సమాజం అతలా కుతలమవుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం పట్టువిడుపుల ధోరణిని ప్రదర్శించాల్సిన అవసరం ఉరుముతోంది. లేనిపక్షంలో సంక్షేమ పథకాల పేరుతో ఇంతకాలం చేసిన శ్రమ వృథాగా మారిపోయే అవకాశం ఉంది. రాష్ట్రంలోని ప్రతిపక్షాలు ప్రభుత్వ సంక్షేమ వ్యయంపై ఎక్కుపెట్టిన బాణాలు సైతం తగిలే అవకాశం ఉందని గ్రహించాల్సిన అవసరం ఉంది. పట్టువిడుపుల థోరణితో సమయానికి తగిన విధంగా ప్రాప్తకాలజ్ఞతను ప్రదర్శించకుండా అహంకారాన్ని ప్రదర్శిస్తే సార్వత్రిక ఎన్నికల్లో భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుందనే వాస్తవాన్ని గ్రహించాలి.- ప్రజాశక్తి – కడప ప్రతినిధి

➡️