అగ్రిగోల్డ్‌ బాధితుల ఒక్కరోజు సత్యాగ్రహ దీక్ష

అమరావతి: అగ్రిగోల్డ్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో పెదకూరపాడు నియోజకవర్గ పరిధిలో శనివారం అమరావతి అంబేద్కర్‌ విగ్రహం దగ్గర అగ్రిగోల్డ్‌ డిపాజిట్‌ దారులు చేసిన దీక్షకు రాష్ట్ర సిపిఐ సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్‌ మోసపూరితమైన ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయకపోవడమంటే అగ్రి గోల్డ్‌ బాధితులను నమ్మించి మోసం చేయడమేనని విమర్శించారు. సిపిఎం మం డల కార్యదర్శి బి.సూరి బాబు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అగ్రిగోల్డ్‌ డిపాజిట్‌ దారులకు బకాయిలను చెల్లిస్తామని హామీ ఇచ్చి, నాలుగున్నరేళ్లు కావస్తున్నా ఎటువంటి చెల్లింపులకు ముందుకు రాలేదని, ప్రభుత్వం వెంటనే బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. టిడిపి నాయకులు కన్యదార వసంతరావు, కాంగ్రెస్‌ నాయకులు గంటా గోపి, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, మహిళలు పాల్గొన్నారు. చిలకలూరిపేట: అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేస్తానని చెప్పి గద్దెనెక్కిన జగన్‌మోహన్‌రెడ్డి, ముఖ్యమంత్రి అయిన తర్వాత వారి సమ స్యలను పూర్తిగా విస్మరించారని పల్నాడు జిల్లా సిపిఐ కార్యదర్శి ఎ.మారుతీవరప్రసాద్‌ విమర్శించారు. పట్టణంలోని సిపిఐ కార్యాలయం ఎదుట అగ్రిగోల్డ్‌ కస్టమర్స్‌ అండ్‌ ఏజెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఒకరోజు సతా ్యగ్రహదీక్షను ఆయన ప్రారంభించారు. కార్యక్రమానికి అసో సియేషన్‌ పల్నాడు జిల్లా అధ్యక్షుడు కె.మంత్రునాయక్‌ అధ్యక్షత వహించారు. ఈ సందర్బంగా మారుతీ వరప్రసాద్‌ మాట్లాడుతూ మూడున్నర లక్షల మంది బాధితులకు కేవలం రూ. 96 కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకొన్నారని విమ ర్శించారు అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం జరగక పోతే సమర శంఖం పూరిస్తామని, ఇందుకు సంబంధించిన కార్యాచరణ సిద్దం చేసినట్లు చెప్పారు. సిపిఎం పట్టణ కార్యదర్శి పేరుబోయిన వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అగ్రిగోల్డ్‌ బాధితుల్లో గతంలో రూ.5 లక్షలు ఇచ్చిన వారికి మరో రూ.5 లక్షలు ఇవ్వా లని, గతంలో లబ్ది పొందని వారికి రూ.10 లక్షల చొప్పున ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సిపిఐ పల్నాడు జిల్లా సహాయ కార్యదర్శి కాసా రాంబాబు, సిపిఐ ఏరియా కార్యదర్శి నాగబైరు రామసుబ్బాయమ్మ, కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఎం రాధాకృష్ణ, టిడిపి రాష్ట్ర కార్యదర్శి ఇనగంటి జగదీష్‌, రాష్ట్ర మహిళా కార్యదర్శి షేక్‌ జరినా సుల్తానా తదితరులు పాల్గొన్నారు.

➡️