అట్టహాసంగా రాష్ట్ర మహిళా కబడ్డీ పోటీలు

Dec 19,2023 21:54

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  :  రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి జన్మదినం సందర్భంగా డిప్యూటీ మేయర్‌ కోలగట్ల శ్రావణి సౌజన్యంతో, జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర మహిళ కబడ్డీ పోటీలు ను జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి ప్రారంభించారు. మంగళవారం నుంచి మూడు రోజుల పాటు ఈ పోటీలు స్థానిక మహిళా పార్కు వేదికగా జరుగుతున్నాయి. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని అందులో బాగంగా ఆడుదాం ఆంధ్ర పేరుతో క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారని తెలిపారు. క్రీడల ద్వారా మంచి భవిష్యత్‌ ఉందని, బాగా ఆడి క్రీడా స్ఫూర్తిని నింపాలని అన్నారు. రాష్ట్ర పోటీలకు 8 జిల్లాల నుంచి జట్లు పాల్గొన్నాయి. డిప్యూటీ మేయర్‌ శ్రావణి మాట్లాడుతూ జిల్లాలో రాష్ట్ర మహిళ కబడ్డీ పోటీలు నిర్వహించడం ఇదే తొలిసారన్నారు. కార్యక్రమంలో మేయర్‌ విజయలక్ష్మి, డిప్యూటి మేయర్‌ లయా యాదవ్‌ నగర మహిళా కార్పొరేటర్లు పాల్గొన్నారు.

➡️