అధ్వానరోడ్లతో అవస్థలపై డోలీ మోతలతో వినూత్న నిరసన

డోలీ మోతలతో వినూత్న నిరసన

ఏళ్లతరబడి నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యం

అసంపూర్తి రహదారులతో అనునిత్యం అవస్థలు పడుతున్నామని ఆవేదన

ప్రజాశక్తి -అనంతగిరి : ఏళ్ల తరబడి రోడ్డుపనుల్లో తాత్సారం, నిర్లక్ష్యంతోపాటు అసంపూర్తి రహదారులతో తాము పడుతున్న అవస్థలపై పలు గ్రామాల గిరిజనులు డోలీ మోతలతో వినూత్న నిరసన చేపట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు మంజూరు చేసినా, అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ల నిర్వాకం వల్ల పనులు పూర్తికాక తాము అనునిత్యం నానాయాతన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.మండలంలోని మారుమూల పిన్నకోట, పెద్దకోట, కివర్ల పంచాయతీల పరిధిలోని చట్టకంభ, పూతికపుట్టు, జగడల మామిడి, జీడిమెట్టు, గడ్డిబంధ, బోనూరు, గంగవరం, టంగలబంద తదితర 12 గ్రామాల్లో దాదాపు రెండువేల మంది గిరిజనం నివాసముంటున్నారు. ఆయా గ్రామాలకు రింగురోడ్డు నిర్మాణం ద్వారా మన్యవాసులకు రహదారి సౌకర్యాన్ని కల్పించాలనే ఉద్దేశ్యంతో కేంద్ర హోంశాఖ రూ. 20 కోట్ల నిధులను మంజూరు చేసింది. 17 కిలోమీటర్లు రోడ్డు నిర్మాణంలో భాగంగా 2022లో మట్టిపనులు చేశారు. టంగేలబంద నుంచి రెండు కిలోమీటర్ల మేర రోడ్డుకు మెటల్‌ వేసి వదిలేశారు. దీంతో ఆయా గ్రామాలకు బైక్‌లు, అంబులెన్స్‌లు కూడా వెళ్లలేని స్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాలకు బోనూరు నుంచి జగలడ మామిడి వరకు రోడ్డు పూర్తిగా కోతకు గురై రాకపోకలకు ఇబ్బందికరంగా తయారైంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని గిరిజనులు కోరుతున్నారు. తక్షణమే రోడ్డు పనులు ప్రారంభించి పూర్తి చేయాలని కోరుతున్నారు. రహదారి నిర్మాణం పూర్తిచేయకుండా తమ గ్రామాలకు ఓట్లు అడిగేందుకు నాయకులు ఎలా వస్తారో చూస్తామని వారు హెచ్చరిస్తున్నారు.

డోలిమోతలతో నిరసన వ్యక్తం చేస్తున్న గిరిజనులు

➡️