అభివృద్ధి ముసుగులో దోపిడీ : పట్టాభిరామ్‌

Dec 15,2023 20:28

ప్రజాశక్తి-విజయనగరంకోట  :  అభివృద్ధి ముసుగులో పూర్తిగా జిల్లాను దోచుకుంటున్నారని టిడిపి జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ అన్నారు. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ యువగళం పాదయాత్ర సందర్భంగా పోలిపల్లిలో నిర్వహించే ముగింపు సభ ఏర్పాట్లను పరిశీలించేందుకు వచ్చిన ఆయన అశోక్‌బంగ్లాలో నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పట్టాభిరామ్‌ మాట్లాడుతూ లోకేష్‌ బాబు పాదయాత్ర ముగింపు సభను ప్రజలందరూ విజయవంతం చేయాలని కోరారు. గత ఐదేళ్లగా ఏమాత్రం అభివృద్ధికి నోచుకోకుండా పెద్ద ఎత్తున దోపిడీకి గురైన జిల్లా విజయనగరం అన్నారు.’ మనం గతంలో డీ కంపెనీ గురించి విన్నాం. డి అంటే దావూద్‌ కంపెనీ, ఆ కంపెనీ ముంబై నగరాన్ని ఎలా దోచుకుందో అనేక రకాలుగా పుస్తకాల్లో చదివాం, సినిమాల్లో చూసాం. అటువంటిదే బి- కంపెనీ విజయనగరంలో ఆవిర్భవించింది. వారు జిల్లాను అడ్డుగోలుగా దోచుకుంటున్నారు. బి- కంపెనీ అంటే బాద్‌షా కుటుంబ భాగస్వాములు. వీరిలో జిల్లా పరిషత్‌ చైర్మన్‌ చిన్న శీను, నెల్లిమర్ల ఎమ్మెల్యే అప్పలనాయుడు, గజపతినగరం ఎమ్మెల్యే అప్పల నరసయ్య పార్టనర్స్‌’ అంటూ విమర్శించారు. నెల్లిమర్ల ఎమ్మెల్యే 420 ఎకరాలు సాగుదారుల నుంచి నష్టపరిహారం దోచుకోవడానికి చూస్తే దాన్ని టిడిపి నాయకులు బంగారు రాజు అడ్డుకున్నారని అన్నారు. గ్రావెల్స్‌ , మైనింగ్‌ దోచుకుంటున్నారని తెలిపారు. ఈ ఐదేళ్లలో ఒక్క కంపెనీ అయినా పెట్టారా? ఉన్న వాటిని అభివృద్ధి చేశారా అని ప్రశ్నించారు. పొలిట్‌ బ్యూరో సభ్యులు పూసపాటి అశోక్‌ గజపతి రాజు మాట్లాడుతూ లోకేష్‌ బాబు పాదయాత్ర ముగింపు సభ చరిత్రలో గొప్ప సభగా మిగిలిపోవాలన్నారు. కిమిడి నాగార్జున మాట్లాడుతూ జగన్మోహన్‌ రెడ్డి బెయిల్‌ రద్దయి జైలుకి వెళ్లిపోతే వైసిపి నాయకులంతా ఆ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడం ఖాయమని అన్నారు. ప్రభుత్వం తీసుకొస్తున్న మద్యం పాలసీ వలన ప్రజలలో పరివర్తన వస్తుందని అనడం బొత్స సత్యనారాయణకే సాధ్యమన్నారు. మద్యం రేట్లు పెంచేసి చిన్న కుటుంబాలను చిన్నాభిన్నం చేశారని అన్నారు. జగన్మోహన్‌ రెడ్డి పాదయాత్ర సమయంలో ప్రజలకు ఇచ్చిన మద్యపాన నిషేధం హామీ ఏమైందని మండిపడ్డారు. కార్యక్రమంలో విజయనగరం పార్లమెంట్‌ పార్టీ అధ్యక్షులు కిమిడి నాగార్జున , నియోజకవర్గ ఇంచార్జ్‌ అదితి గజపతి రాజు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️