అరుకు ఎంపి బరిలో బాబూరావు నాయుడు?

Feb 20,2024 21:15

ప్రజాశక్తి-పాలకొండ : అరుకు ఎస్టీ పార్లమెంట్‌ నియోజకవర్గానికి తెలుగుదేశం టికెట్‌ రేసులో విశ్రాంత ఐఎఎస్‌ అధికారి బాబురావునాయుడు ఉన్నట్లు తెలుస్తుంది. ఇటీవలే కేంద్ర మాజీ మంత్రి కిషోర్‌ చంద్రదేవ్‌ టిడిపి పార్టీకి రాజీనామా చేయడంతో ఎంపి అభ్యర్థిగా టిడిపి నుంచి బాబురావు నాయుడు పేరు వినిపిస్తోంది. 2014, 19 ఎన్నికల్లో అరుకు ఎంపీ సీటు వైసీపీ ఖాతాలోనే చేరింది. దీంతో ఈసారి టిడిపికి ఎలాగైనా ఈ నియోజకవర్గం ఎంపి సీటు దక్కాల్సిందేనని పార్టీ శ్రేణులు గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. మాజీ మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్‌కు పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించినప్పటికీ కేడర్‌ను కలుపుకొనే పరిస్ధితి లేకపోవడంతో పాటు ఆ స్థాయిలో పరిచయాలు కూడా లేవని, దీంతో టికెట్‌ విషయంలో ఇంకా స్పష్టత లేదని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. అరుకు ఎంపి పరిధిలో బగతకు చెందిన తెగలు ఎక్కువగా ఉన్నాయి. ఆ తర్వాత కొండ దొరలు, సవరలు తదితర కులాలు ఉన్నారు. అయితే బగత కులానికి చెందిన బాబూరావునాయుడుకు టికెట్‌ ఇస్తే రంపచోడవరం, పాడేరు, అరుకు ప్రాంతాల్లో టిడిపికి అనుకూలంగా ఉంటుందని ఆ పార్టీలో కొందరు భావిస్తున్నారు. అలాగే రంపచోడవరం, సీతంపేట ఐటిడిఎ పిఒగా గతంలో విధులు నిర్వహించిన బాబురావు నాయుడు గిరిజనులతో సత్సంబంధాలు కలిగి ఉండడం ఆయనకు కలిసి వచ్చే విషయం. పార్వతీపురం ఐటిడె పరిధిలో కూడా ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయి రాష్ట్ర వెలుగు డైరెక్టర్‌గా పని చేసిన సమయంలో అక్కడ ప్రజలకు చేరుయ్యారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. పొత్తుల్లో భాగంగా బిజెపికి ఈ సీటు కేటాయిస్తారనే ప్రచారం జరుగుతోంది. గతంలో వైసిపి తరపున గెలిచిన కొత్తపల్లి గీత ప్రస్తుతం బిజెపిలో చేరి టికెట్‌ ఆశిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే గతంలో ఎంపిగా ఉన్న సందర్భంలో ఆమె నియోజకవర్గాన్ని కనీసం పట్టించుకోలేదనే విమర్శలతో పాటు ఆమె ఎస్టీ కాదని కూడా న్యాయస్థానంలో కేసు పెండింగులో ఉండడం ఆమెకు ప్రతికూల అంశాలుగా పరిగణిస్తున్నారు. అరుకు పార్లమెంట్‌ పరిధిలో బిజెపికి పూర్తి వ్యతిరేక ఓటు ఉండడం కూడా ప్రతికూల అంశమే. వైసిపి తరపున పార్లమెంట్‌ అభ్యర్థిగా పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మిని ఢ కొట్టాలంటే ప్రజల్లో పేరున్న బాబురావు నాయుడు లాంటి వ్యక్తి అయితే సరిగ్గా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయ్యన్నపాత్రుడును కలిసిన బాబురావు నాయుడుమాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడ్ని ఇటీవల బాబూరావు నాయుడు కలిసినట్లు తెలుస్తోంది. అరుకు పార్లమెంట్‌ ఎంపి సీటు విషయంలో చర్చలు జరిపినట్టు తెలిసింది. అలాగే మాజీ మంత్రి నక్కా ఆనందబాబు కూడా ఈ విషయంలో బాబూరావు నాయుడుకు సానుకూలంగా ఉన్నట్లు సమాచారం.

➡️