అవుట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలి

Mar 25,2024 21:27

ప్రజాశక్తి – పాచిపెంట:  ట్రైబల్‌ వెల్ఫేర్‌ సహకార సొసైటీ ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న అవుట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, ప్రభుత్వాలు వీరి పట్ల ప్రత్యేక దృష్టి పెట్టి ఆదుకోవాలని సిఐటియు నాయకులు కోరాడ ఈశ్వరరావు ప్రభుత్వానికి, అధికారులకు విజ్ఞప్తి చేశారు. మండలంలోని పి.కోనవలస ఆశ్రమ పాఠశాలలను సోమవారం సందర్శించిన ఈశ్వరరావు సిబ్బంది ప్రకాశరావు, సింగారపు విజరు, నరసింహులుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. 30 నుంచి 40 ఏళ్లుగా సేవలందిస్తున్న ఈ ఉద్యోగులను ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యారంగం అభివృద్ధి జరగాలంటే ముందుగా ఔట్సోర్సింగ్‌, కాంట్రాక్టు ఉద్యోగులకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 560మందికి పైగా ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉద్యోగులు దుర్భరమైన జీవితాలను గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యారంగాన్ని నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగా వీరి గురించి ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదన్నారు. ఇప్పటికైనా వారి సమస్యలపై ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. కలెక్టర్‌, ఐటిడిఎ పిఒ, ఉన్నతాధికారుల పర్యవేక్షణలో వీరిని రెగ్యులరైజ్‌ చేసేలా కృషి చేయాలని కోరారు.

➡️