అవ్వాతాతలకు అండగా ప్రభుత్వం

Jan 3,2024 21:05

ప్రజాశక్తి – పార్వతీపురంరూరల్‌ : రాష్ట్ర ప్రభుత్వం అవ్వాతాతలకు అండగా ఉంటూ, వైఎస్‌ఆర్‌ పింఛను కానుకగా రూ.3 వేలకు పెంచినట్టు ఉప ముఖ్యమంత్రి పి.రాజన్నదొర తెలిపారు. పెంచిన పింఛను కానుక పంపిణీ కార్యక్రమం స్థానిక లయన్స్‌ క్లబ్‌లో బుధవారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఆర్థికంగా మహిళలకు చేయూత ఇవ్వడానికి ప్రభుత్వం అనేక పథకాలు అందిస్తున్నారన్నారు. పింఛనును సద్వినియోగం చేసుకోవాలనికోరారు. ప్రతీ ఒక్కరూ ఆర్థిక అభ్యున్నతి దిశగా అడుగులు వేయాలని సూచించారు. స్థానిక ఎమ్మెల్యే ఎ.జోగారావు మాట్లాడుతూ ప్రతి నెలా మొదటి తేదీన ఉదయాన్నే తలుపుతట్టి పింఛను అందించడం జరుగుతోందన్నారు. కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ మాట్లాడుతూ జిల్లాలో కొత్తగా 1693 పింఛన్లు మంజూరయ్యాయన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 1,43,800 మంది పింఛను దార్లు ఉన్నారన్నారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్‌ పర్సన్‌ బోను గౌరీశ్వరి, వైస్‌ చైర్‌ పర్సన్‌ కొండపల్లి రుక్మిణి, డిఆర్‌డిఎ పీడీ పి.కిరణ్‌ కుమార్‌, వార్డు కౌన్సిలర్లు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

➡️