అసంపూర్తి రోడ్డుపై గిరిజనం ఆందోళన

అసంపూర్తి రోడ్డుపై గిరిజనం ఆందోళన

పనులు చేయకుండానే నిధులు స్వాహా చేశారని ఆరోపణ

విజిలెన్స్‌ దర్యాప్తు, చర్యలకు మన్యవాసుల డిమాండ్‌

ప్రజాశక్తి – అనంతగిరి :అసంపూర్తిగా ఆగిపోయిన రోడ్డు నిర్మాణపనులను తక్షణమే పున్ణప్రారంభించి పూర్తిచేయాలని కోరుతూ కొండశిఖర తోంకోట రిజనులు నిరసన చేపట్టారు. పనులు చేయకుండానే అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై రికార్డులు సృష్టించి నిధులు స్వాహా చేశారని ఆరోపించారు. ఈ మేరకు అధ్వానరోడ్డుపై బైఠాయించి అధికారుల నిర్లక్ష్యం, మొండివైఖరిపై నినాదాలు చేస్తూ వినూత్నరీతిలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామస్తులు పురుగు వెంకటరావు, కింకరి ఈశ్వరరావు తదితరులు మాట్లాడుతూ, మండలంలో మారుమూలన కొండశిఖరుపై ఉన్న తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం లేక పడుతున్న అవస్థలపై అధికారులు, నేతల దృష్టికి తీసుకెళ్లగా 2021-22లో రూ.85 లక్షల నిధులు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. హుకుంపెట మండలం దరెగెడ్డ నుంచి తోంకోట వరకు మూడు కిలోమీటర్ల మెటల్‌ రోడ్డు నిర్మించాల్సి ఉంది. అయితే పనులను ప్రారంభించిన సంబంధిత అధికారులు పూర్తి చేయకుండానే అర్థాంతరంగా వదిలేశారని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. దీనిపై పలుమార్లు అధికారులు, నేతల దృష్టికి తీసుకెళ్లినా ఎటువంటి స్పందన లేదని వాపోతున్నారు. అధికారులను ప్రశ్నిస్తే రోడ్డు పనులు ఎప్పుడో పూర్తిచేసేశామని అంటున్నారు. క్షేత్రస్థాయిలో చూస్తే కనీసస్థాయిలో పనులు జరగలేదని, అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై రికార్డులు సృష్టించి, బిల్లులు డ్రాచేసి కైంకర్యం చేశారని అనుమానం కలుగుతోందన్నారు. దీనిపై ఎన్నికల సంఘానికి, విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు. రోడ్డు నిర్మాణం పూర్తి చేయకుండానే అయిపోయిందంటున్న అధికారుల నిర్వాకంపై దర్యాప్తు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

అసంపూర్తి రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేస్తున్న తోంకోట గిరిజనులు

➡️