ఆందోళనలో మహీధర్‌రెడ్డి అనుచరులు

Feb 17,2024 21:47
కందుకూరులోని మానుగుంట కార్యాలయంలో వైసిపి శ్రేణులు

కందుకూరులోని మానుగుంట కార్యాలయంలో వైసిపి శ్రేణులు
ఆందోళనలో మహీధర్‌రెడ్డి అనుచరులు
ప్రజాశక్తి-కందుకూరు : అంతా అనుకున్నట్లే అయింది.. సాధారణ ఎన్నికల వ్యూహంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా వైసిపి అధిష్టానం చేపట్టిన ఇన్‌ఛార్జుల మార్పు ప్రభావం కందుకూరు పైనా పడింది. తమిళనాడు రాష్ట్రానికి చెందిన కటారి అరవింద యాదవ్‌ను కందుకూరు నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జిగా నియమిస్తూ వైసీపీ అధిష్టానం శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. తిరుపతి జిల్లా గూడూరులోని ఆదిశంకర ఇంజినీరింగ్‌ కళాశాలల చైర్మన్‌ వంకి పెంచలయ్య కుమార్తె, తమిళనాడు రాష్ట్ర ఉన్నత, సాంకేతిక విద్యా శాఖ మంత్రి కె పొన్మూడి కోడలైన కటారి అరవింద యాదవ్‌ నియామకం ప్రకటన కందుకూరు నియోజకవర్గ ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. శనివారం ఉదయం ఎక్కడ నలుగురు చేరినా నియోజకవర్గం అంతా ఇదే చర్చ నడుస్తోంది. వైసీపీ అధిష్టానం చేపట్టిన అనేక సర్వేలలో సైతం జిల్లాలో వైసీపీ గెలుపు అభ్యర్థులలో జాబితాలో ముందు వరుసలో ఉన్న స్థానిక శాసనసభ్యులు మానుగుంట మహీధర్‌ రెడ్డిని కాదని మన రాష్ట్రం దాటి పక్క రాష్ట్రం నుంచి అభ్యర్థులను దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని నియోజకవర్గ ప్రజలు భావిస్తున్నారు. ఎవరిని తెచ్చిపెట్టినా జనం నన్ను చూసే ఓటేస్తారన్న ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఒంటెద్దు పోకడ మరోసారి నిరూపితమైందని మహీధర్‌ రెడ్డి అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహీధర్‌ రెడ్డి అనుచరులలో అలజడి. కందుకూరు నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జిగా వంకి పెంచలయ్య కుమార్తె అరవింద యాదవ్‌ను నియమిస్తున్నట్లు వైసీపీ అధిష్టానం ప్రకటించింది. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం 9 గంటలకే భారీ సంఖ్యలో మహీధర్‌ రెడ్డి అనుచరులు కందుకూరు-పామూరు రోడ్డులోని ఆయన క్యాంపు కార్యాలయానికి భారీగా చేరుకున్నారు. వైసీపీ అధిష్టానం నిర్ణయం పై మహీధర్‌రెడ్డి స్పందన ఎలా ఉంటుందని తెలుసుకునేందుకు అను చరులు ప్రయత్నిం చినప్పటికీ ఆయన మాత్రం ఎందుకు ఆందోళన చెందుతున్నారు.. ఇంకా సమయం ఉంది కదా అని సమాధానం దాట వేస్తున్నట్లు చెబుతున్నారు. దీనిపై నియోజకవర్గ వైసిపి కార్యకర్తలు పలువురు మహీధర్‌ రెడ్డి వైసీపీకి రాజీనామా చేస్తారా.. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారా.. లేక ఇప్పటివరకు తన ప్రత్యర్థి పార్టీ అయిన టిడిపిలో చేరతారా.. అంటూ తమ ఆందోళనను వెళ్లబుచ్చు తున్నారు.కందుకూరు నియోజకవర్గ వైసిపి ఇన్‌ఛార్జి మార్పుపై నియో జకవర్గ టిడిపి నాయకులు, కార్యకర్తలు కొంత ఆనందోత్సాహలు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. శనివారం పార్టీ కార్యాలయంలో ఆయన అనుచరులు మాత్రం ఎన్నికల సమయానికి వైసిపి బీ ఫారం మహీధర్‌ రెడ్డికె ఇస్తారని ఆశిస్తుండడం గమనార్హం.

➡️