ఆటస్థలం అన్యాక్రాంతం

Jan 2,2024 23:13
ఆడుదాం ఆంధ్రా' పేరుతో

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి’

ఆడుదాం ఆంధ్రా’ పేరుతో క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నామంటూ ప్రచారం చేస్తున్న వైసిపి సర్కారు ఆచరణలో భిన్నమైన విధానాలను అవలంభిస్తోంది. ఆటల్లో ఆణిము త్యాలను వెలికితీస్తామంటూ చెబుతూనే మరోపక్క ఉన్న ఆటస్థ లాన్ని ఆక్రమణదారులకు కట్టబెట్టేందుకు కుట్రలు పన్నుతోంది. అధికారపక్షం ప్రజాప్రతినిధుల వల్ల ఆడుదాం ఆంధ్ర కాస్తా ఆడుకోలేం ఆంధ్రాగా మారుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.ధవళేశ్వరం జూనియర్‌ కళాశాలకు నాలుగు దశాబ్దాలకు పైగా చరిత్ర ఉంది. ఎంతో మంది ఈ కళాశాలలో చదివి ఉన్నత స్థానాల్లో నిలిచారు. విద్యార్థులు, ఎస్‌ఎఫ్‌ఐ పోరాటాల నేపథ్యంలో కళాశాలకు సొంత స్థలాన్ని, భవనాలను ప్రభుత్వం కల్పించింది. 2004లో ఎస్‌డబ్ల్యూఎం క్లబ్‌ ఉండే ప్రాంతంలో 2.05 ఎకరాల విస్తీర్ణంలో ప్రభుత్వ కాలేజీ ఏర్పాటు చేశారు. కాలేజీ నిర్మాణానికి అప్పటి ఎంపీ ఎస్‌పిబికెఆర్‌.సత్యనారాయణ ఎంపీ నిధుల నుంచి రూ.10 లక్షలు, రాజ్యసభ సభ్యులు దాసరి నారాయణరావు, టి.సుబ్బిరామిరెడ్డి, ఖాన్‌ ఒకొక్కరు రూ.5 లక్షలు చొప్పున రూ.15 లక్షలు, ఒఎన్‌జిసి సిఎస్‌ఆర్‌ నిధులు రూ.9.20 లక్షలు, బోర్డు ఆఫ్‌ ఇంటర్మీడియెట్‌ నుంచి రూ.6.90 లక్షలు, పుష్కర నిధుల నుంచి రూ.2 లక్షలు వెచ్చించి భవనాలను నిర్మించారు. విశాలమైన ఆటస్థలంతో కళాశాల భవనం నిర్మితమైంది. 2007లో అప్పటి శాసన సభ్యులు జక్కంపూడి రామ్మోహనరావు రూ.60లక్షలతో కళాశాల కాన్ఫరెన్స్‌ హాలు నిర్మించారు. ఇది స్థానిక ప్రజల శుభకార్యాలు, ఇతర కార్యక్రమాలు వినియోగించుకోవడం ద్వారా వచ్చే ఆదాయాన్ని కళాశాల అభివృద్ధికి వెచ్చించాలనే ఆలోచనతో దీన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ కాన్ఫరెన్స్‌ హాలును కళ్యాణ మండపంగా మార్చేశారు. అంతేకాకుండా కళ్యాణమండపంతో పాటూ క్రీడా స్థలంలో సగభాగం లీజుకు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశారు. దీని వెనుక అధికార పక్షం ప్రజాప్రతినిధి ఉండటం, ఆయనకు ఓ ఉన్నతాధికారి అండదండలు కూడా ఉండటంతో ఏకపక్షం నిర్ణయం చేసి కళాశాల ఆటస్థలం మధ్యగా గోడను నిర్మించారు.ఏడాదికి రూ.2 లక్షల చొప్పున లీజుకు… ధవళేశ్వరంలో ఎకరా స్థలం రూ.2కోట్లుపై మాటే. కళాశాలలో కళ్యాణ మండపంతో పాటు, ఆటస్థలంలో సగభాగం కలిపి ఏడాదికి రూ.2 లక్షల చొప్పున ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఓ చారిటబుల్‌ ట్రస్ట్‌కు ఐదేళ్ల పాటు లీజుకు ఇవ్వాలని అదికార యంత్రాంగం ఇంటర్మీడియట్‌ బోర్డుకు 2023 డిసెంబరు 12న ప్రతిపాదనలు పంపింది. కాని బోర్డు నుంచి ఇప్పటి వరకూ ఎలాంటి ఆదేశాలు రాలేదు. అయినప్పటికీ యుద్ధప్రాతిపదికన కళాశాల ఆటస్థలాన్ని రెండుగా విభజిస్తూ అడ్డుగా గోడను నిర్మిస్తున్నారు. ఈ గోడ నిర్మాణం కోసం నాడు -నేడు నిధులు రూ.8.81 లక్షలు వెచ్చిస్తున్నారు. కేవలం ఇద్దరు పేరెంట్స్‌తో ఏర్పడిన కాలేజీ డెవలప్‌మెంట్‌ కమిటీ 2022 నవంబరు 4న తీర్మాణం చేసి ఉన్నతాధికారులకు నివేదించినట్లు రికార్డులు చెబుతున్నాయి. జిల్లాలోని ఓ ఉన్నతాధికారి 2022 నవంబరు 1న మౌఖిక ఆదేశాలివ్వటంతో ప్రణాళికా బద్ధంగా స్థలం అన్యాక్రాంతం అవుతోందని స్పష్టమవుతోంది.

➡️