ఆరోగ్యవంతమైన సమాజానికి విస్తృత పరిశోధనలు

Feb 2,2024 23:03

ప్రజాశక్తి – ఎఎన్‌యు : రోజురోజుకు కొత్తకొత్త రుగ్మతలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజల్ని కాపాడేందుకు నూతన పరిశోధనలు రావాలని, తద్వారా ఆరోగ్యవంతమైన సమాజం కోసం పాటుపడాలని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ పట్టేటి రాజశేఖర్‌ సూచించారు. ఇమ్యునాలజీ- బయోడైవర్సిటీ -ఆక్వా కల్చర్‌ అండ్‌ ఆక్వాటిక్‌ టాక్సికాలజీ అంశంపై వర్సిటీ జువాలజీ, ఆక్వాకల్చర్‌ విభాగం సంయుక్తంగా నిర్వహిస్తున్న జాతీయ సదస్సును వీసీ శుక్రవారం ప్రారంభించి మాట్లాడారు. సంతోషకరమైన, ఆరోగ్య వంతమైన జీవనశైలి కోసం ఇన్నర్‌ ఇంజినీరింగ్‌ పనిచేయాలని సూచించారు. సదస్సు డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ కె.సునీత మాట్లాడుతూ రెండు రోజుల జాతీయ సదస్సులో 10 చర్చలు, 80 మౌఖిక, పోస్టర్‌ ప్రదర్శనలు పరిశోధన ఫలితాలు వివరించేందుకు దేశవ్యాప్తంగా 300 మంది హాజరయ్యారని పేర్కొన్నారు. సదస్సు ఉద్దేశాలను సదస్సు లక్ష్యాలను వివరించిన ఆమె ఇటువంటి సదస్సులు నిరంతరం జరగాలని తద్వారా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పరిశోధనలు రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. సదస్సు లో విద్యావేత్తలు, పరిశ్రమ, వైద్య రంగాలను మిళితం చేసే పరిశోధన పత్రాలు, నైపుణ్యాలపై చర్చించనున్నట్లు వివరించారు. సదస్సులో ఎన్నారై కళాశాల ఫలమనాలజీ విభాగాధిపతి డాక్టర్‌ ఆర్‌.రామకృష్ణ, ఐసిఎఆర్‌ నుంచి డాక్టర్‌ ఆర్‌.రాథోడ్‌, భారతిదాసన్‌ వర్సిటీ నుంచి ప్రొఫెసర్‌ సంతానం, ప్రొఫెసర్‌ రాజారాం, విజ్ఞాన్‌ యూనివర్సిటీ నుంచి డాక్టర్‌ ఎన్‌.ఎస్‌.సంపత్‌ కుమార్‌, డాక్టర్‌ సిహెచ్‌. అంజనదేవి, విశాఖపట్నంలోని సిసిబిఎస్‌ నుంచి డాక్టర్‌ జాన్‌ డాగ్లస్‌ పల్లేటి, విభాగం అధ్యాపకులు ప్రొఫెసర్‌ పద్మావతి, ప్రొఫెసర్‌ వీరయ్య, ప్రొఫెసర్‌ సింహాచలం, ప్రొఫెసర్‌ వెంకటరత్నమ్మ, డాక్టర్‌ గోపాలరావు పాల్గొన్నారు.

➡️