ఆరోపణలు నిరూపించగలరా? : ఎమ్మెల్యే బొత్స

Feb 17,2024 21:24

 ప్రజాశక్తి-గజపతినగరం  : గంట్యాడ శంఖారావం సభలో మాజీ ఎమ్మెల్యే కె.ఎ.నాయుడు తనపై చేసిన ఆరోపణలు నిరూపించగలరా? అని ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య సవాల్‌ చేవారు. ఆరోపణలు నిరూపిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని, లేకుంటే కె.ఎ.నాయుడు రాజకీయాల నుంచి తప్పుకుంటారా? అని ప్రశ్నించారు. స్థానిక వైసిపి కార్యాలయంలో శనివారం విలేకరులతో ఆయన మాట్లాడారు. కె.ఎ.నాయుడు మాటలు దెయ్యాలు వేదాలు వల్లించిన చందంగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. అవినీతి, అక్రమాలకు కేరాఫ్‌ అడ్రస్‌ అయిన వ్యక్తి ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ ఆరోపణలు వెనక నారా లోకేష్‌ మెప్పు, ఎమ్మెల్యే టికెట్‌ కోసం తాపత్రయంగా కనిపిస్తోందన్నారు. బంగారమ్మపేట, భూదేవిపేట గ్రామాలకు రోడ్లు వేయకుండానే సొమ్ము స్వాహా చేసిన ఘనత కె.ఎ.నాయుడుకే దక్కుతుందన్నారు. ఈ విషయంలో అప్పటి అధికారులను బలిపశువులను చేశారని చెప్పారు. ఉద్యోగాల పేరుతో నిరుద్యోగ యువత వద్ద డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు. దేవుపల్లిలో 33 ఎకరాలు బలవంతంగా నాగేశ్వరరావు అనే వ్యక్తి వద్ద లాక్కుని తన బినామీ పేరిట రిజిస్ట్రేషన్‌ చేయించారన్నారు. సమావేశంలో జెడ్‌పిటిసి గార తౌడు, వైసిపి మండల అధ్యక్షులు బూడి వెంకటరావు, సర్పంచ్‌ బెల్లాన త్రినాథరావు, పిఎసిఎస్‌ అధ్యక్షులు కరుణ ఆదినారాయణ, ఉపసర్పంచ్‌ మండల సురేష్‌, జెసిఎస్‌ కన్వీనర్‌ కనకల సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.

➡️