ఆశా, సిహెచ్‌డబ్ల్యుఒల సమస్యలు పరిష్కరించాలి

ప్రజాశక్తి – బెలగాం : ఆశా, కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఎపి ఆశా వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు ఎం.శివాని, సిఐటియు జిల్లా కోశాధికారి జి.వెంకటరమణ జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌కు , జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారికి సోమవారం వినతిని అందజేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ ఆశా వర్కర్లపై ఆన్లైన్లో రికార్డు, మొబైల్‌ వర్క్‌ వంటి అదనపు పనులు రోజురోజుకు పెరుగుతున్నాయన్నారు. పని ఒత్తిడి పెరగడంతో ఆశా కార్యకర్తలు అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కనీసం వేతనాల్లేకుండా, సంక్షేమ పథకాలు సక్రమంగా ఇవ్వకుండా, మెడికల్‌, మెటర్నర్‌ సెలవులు అమలు చేయకుండా పిహెచ్‌సికి వచ్చిన ప్రతి సందర్భంలో టిఎ, డిఎ ఇవ్వకుండా ప్రభుత్వం వెట్టిచాకిరీ చేయించుకుంటుందని విమర్శించారు. కనీసవేతనం రూ.26వేలు ఇవ్వాలని, మెడికల్‌, ప్రభుత్వ సెలవులు వర్తింపజేయాలని, రూ.10లక్షల గ్రూప్‌ ఇన్సూరెన్స్‌, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ కల్పించాలని, కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్లను ఆశాలుగా మార్చాలని, 62 ఏళ్లుకు రిటైర్మెంట్‌ జీవోను వర్తింప చేయాలి. ఎఎన్‌ఎం హెల్త్‌ సెక్రటరీ పోస్టుల భర్తీలో ఆశాలకు వెయిటేజీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రిటైర్మెంట్‌ బెనిఫిట్‌ రూ.5లక్షలు వేతనంలో సగం పెన్షన్‌ ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో ఆశా వర్కర్లు, పి.లక్ష్మి, పద్మ తదితరులు పాల్గొన్నారు పాల్గొన్నారు.

➡️