ఇక్కడి జ్ఞానం దేశం కోసమే ఉపయోగపడాలి

పురస్కారాన్ని అందుకుంటున్న డాక్టర్‌ కెఐ వరప్రసాద్‌రెడ్డి
ప్రజాశక్తి – ఎఎన్‌యు : శాంతా బయోటెక్నిక్స్‌ వ్యవస్థాపకులు, మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కెఐ.వరప్రసాద్‌రెడ్డికి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం విశిష్ట ప్రతిభ పురస్కారం ప్రదానం చేసింది. మంగళవారం వర్సిటీలోని డైక్‌మెన్‌ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమానికి వీసీ పి.రాజశేఖర్‌ అధ్యక్షత వహించారు. పురస్కార గ్రహీత డాక్టర్‌ వరప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ శాంతా బయోటెక్నిక్స్‌ ద్వారా అనేక రకాల సమాజ సేవలు అందిస్తున్నామన్నారు. ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వంటి మహమ్మారిని తట్టుకునే ఔషధాలను తమ సంస్థలో తయారు చేసినట్లు చెప్పారు. ప్రపంచీకరణలో ప్రతిదీ వ్యాపారంగా మారిందని, వాటిని అందిపుచ్చుకునే క్రమంలో అనేక సంస్థలు పుట్టుకొస్తున్నాయని అన్నారు. నేటి యువత ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదగాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచంలో ఏ మూలన రాణించాలన్నా ప్రతి ఒక్కరిలో నూతన ఆవిష్కరణలు చేసేందుకు కొత్త ఆలోచనలు రావాలన్నారు. భారతదేశ సంపద యువత అని, ఆ యువత నేడు విదేశాలకు వలస వెళ్లి అక్కడ వారి జ్ఞానాన్ని చిన్నచిన్న ఉద్యోగాలతో ఆయా దేశాల్లో తక్కువ కేడర్‌ హోదాల్లో విధులు నిర్వహిస్తూ వారికున్న జ్ఞానాన్ని తక్కువ అంచనా వేసుకుంటున్నారని వివరించారు. ఇక్కడ జ్ఞానాన్ని సంపాదించి ఈ దేశ అభ్యున్నతికి తోడ్పాటున అందించాల్సిన అవసరం ఉందన్నారు. యువత మేల్కొని దేశ అభ్యున్నతి వైపు దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. వీసీ మాట్లాడుతూ శాంతా బయోటెక్‌ సంస్థకు ప్రత్యేక గుర్తింపు ప్రపంచవ్యాప్తంగా ఉందన్నారు. కరోనా మహమ్మారి సమయంలో ఈ సంస్థ చేసిన కషి ప్రపంచం మొత్తం భారతదేశానికి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టిందని అభినందించారు. విద్యార్థులు ఇటువంటి వారిని ఆదర్శంగా తీసుకొని తమ జీవితాలను ఉన్నత శిఖరాల వైపు పయనింప చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ బి.కరుణ, సైన్సు, ఇంజినీరింగ్‌, ఆర్కిటెక్చర్‌ కళాశాలల ప్రిన్సిపల్స్‌ ప్రొఫెసర్‌ కె.గంగాధరరావు, ప్రొఫెసర్‌ పి.సిద్దయ్య, ప్రొఫెసర్‌ ఇ.శ్రీనివాసరెడ్డి, ఒఎస్‌డి ప్రొఫెసర్‌ కె.సునీత పాల్గొన్నారు. డిపార్ట్మెంట్‌ ఆఫ్‌ థియేటర్‌ ఆర్ట్స్‌, డాన్స్‌, మ్యూజిక్‌ విభాగాలు ప్రత్యేక ప్రదర్శనలిచ్చాయి.

➡️