ఇచ్చిన మాట ప్రకారంకుప్పంకు హంద్రీ నీవా : పెద్దిరెడ్డి

Feb 24,2024 22:00

ఇచ్చిన మాట ప్రకారంకుప్పంకు హంద్రీ నీవా : పెద్దిరెడ్డి
26న జిల్లాకు ముఖ్యమంత్రి రాక
హంద్రీ నీవా కాలువ పనులను పరిశీలించిన మంత్రులు
పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్‌
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌:
ఈనెల 26వ తేదీ సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డి కుప్పం నియోజకవర్గం శాంతిపురం, రామకుప్పం మండలాలలో పర్యటించనున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లను చేయడం జరుగుతున్నదని రాష్ట్ర అటవీ, విద్యుత్‌, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక, భూగర్భ గనుల శాఖ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. శనివారం మంత్రి పెద్దిరెడ్డి, డిప్యూటీ సిఎం కె.నారాయణస్వామితో కలసి ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్ల పరిశీలనలో భాగంగా శాంతిపురం మండలం, గుండెశెట్టిపల్లి బహిరంగ సభ వద్ద జరుగుతున్న ఏర్పాట్లను, రామకుప్పం మండలం రాజుపేట వద్ద శరవేగంగా జరుగుతున్న హంద్రీనీవా కాలువ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి గతంలో కుప్పం పర్యటనలో ఇచ్చిన మాట ప్రకారం నీటిని కుప్పం నియోజకవర్గానికి నీరు అందించడంలో భాగంగా హంద్రీ- నీవా కాలువ నిర్మాణం పూర్తి చేయడం జరిగిందన్నారు. ఈ కాలువ ద్వారా కుప్పం నియోజకవర్గంలో దాదాపు 54 చెరువులకు నీరు అందించే పరిస్థితి ఉందన్నారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా కుప్పం నియోజకవర్గ ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చెలా రామకుప్పంలో పూజా కార్యక్రమం నిర్వహించి హంద్రీ-నీవా నీటిని విడుదల చేయడం జరుగుతుందన్నారు. పాలారు ప్రాజెక్టు కూడా శంఖుస్థాపన చేయడం జరుగుతుందని, ఈప్రాజెక్టు పూర్తి అయినట్లైతే హంద్రీ-నీవా, పాలారు ప్రాజెక్టుల ద్వారా సాగు, తాగునీటికి ఇబ్బంది ఉండదని తెలిపారు. గాండ్ల కమ్యూనిటి భవననిర్మాణానికి అవసరమైన భూమిని కేటాయించి రూ.3కోట్లు నిధులు విడుదల చేసి భవన నిర్మాణం త్వరితగతిన పూర్తి చేస్తామని తెలిపారు. వారి వెంట జెడ్పీ చైర్మన్‌ గోవిందప్ప శ్రీనివాసులు, జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ పి.శ్రీనివాసులు, ఎమ్మెల్సీ భరత్‌, రాష్ట్ర జానపద కళలు కార్పొరేషన్‌ ఛైర్మన్‌ కొండవీటి నాగభూషణం, డిసిసిబి చైర్మన్‌ రెడ్డెమ్మ, కుప్పం పలమనేరు ఆర్డీవోలు శ్రీనివాసులు, మనోజ్‌ రెడ్డి, రామకుప్పం ఎంపీపీ సుబ్రహ్మణ్యం, జెడ్పిటిసి నితిన్‌ రాఘవరెడ్డి, తహశీల్దారు శ్రీధర్‌, మైనార్టీ కార్పొరేషన్‌ ఈడీ ప్రభాకర్‌ రెడ్డి, బాబురెడ్డి, చంద్రారెడ్డి, సింగిల్‌ విండో ఛైర్మన్‌ వేణుగోపాల్‌ గౌడ్‌ పాల్గొన్నారు.
డిసిసి బ్యాంకు, ఆర్‌బికెలు ప్రారంభం
రామకుప్పం:
మండలంలో రూ.21.80 లక్షలతో నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్రంను రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కె.నారాయణస్వామి, రాష్ట్ర విద్యుత్‌, అటవీ, పర్యావరణ శాస్త్ర సాంకేతిక భూగర్భ గనుల శాఖ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శనివారం ప్రారంభించారు. దీనితో పాటు నూతనంగా ఏర్పాటు చేసిన చిత్తూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు రామకుప్పం శాఖను ఎంపి రెడ్డెప్పతో కలిసి మంత్రులు ప్రారంభించారు. అనంతరం ఈనెల 26న ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి మండలంలోని రాజుపేట వద్ద హంద్రీ- నీవా జలాలకు పూజా కార్యక్రమాలు చేపట్టనున్న నేపథ్యంలో అక్కడి కాలువ పనులను, హెలిప్యాడ్‌ ప్రాంతాలను మంత్రులు పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు అందించారు.

➡️