ఇదేమి సామాజిక న్యాయం?

Dec 2,2023 20:02

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి  :  సామాజిక సాధికార యాత్ర పేరిట ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు ప్రజలకు ఒకింత అసౌకర్యాన్ని కలిగించాయి. చాలా మంది తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. సామాజిక న్యాయం పేరిట బలప్రయోగాలు, అధికార దుర్వినియోగాలు సృష్టిస్తున్నారని జనం మండిపడుతున్నారు. వైసిపి ఆధ్వర్యాన నిర్వహిస్తున్న సామాజిక సాధికార బస్సుయాత్ర గడిచిన రెండు నెలల్లో విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో పూర్తయింది. ఈ యాత్ర ఎంతో విజయ వంతమైందని, జనం తండోపతండాలుగా వచ్చేశారని జిల్లా స్థాయి నాయకులు చెప్పుకుంటున్నారు. కానీ, వచ్చినవారంతా మనవారు కాదంటూ మండల, గ్రామ స్థాయి వైసిపి నాయకుల నోట వినిపిస్తున్న మాట. ఇటువంటివారిలో ప్రభుత్వ విధానాలు మింగుడు పడనివారు కొందరైతే ఎమ్మెల్యేల తీరు నచ్చనివారు మరికొందరు ఉన్నారు. ఫొటోల కోసం ఏకంగా మొక్కలు, చెట్లు కూడా నరికివేయడం పట్ల సొంత పార్టీ నుంచి కూడా సర్వత్రా విమర్శలు వెల్లువిరుస్తున్నాయి. పార్వతీపురం పట్టణంలో జరిగిన సామాజిక యాత్రకు ముందు రోజు రాత్రి ప్రధాన రహదారిపై ఉన్న చెట్లను నరికివేశారు. బొబ్బిలి మిగిలిన పట్టణ ప్రాంతాల్లో కూడా ఇదే రకమైన వైఖరి ప్రదర్శించారు. దీంతో, ఆయా పట్టణాల్లోని ప్రజలు, ప్రముఖలు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. పార్వతీపురంలో మొక్కల నరికివేతపై చర్చోపర్చలు నడుస్తున్నాయి. ఓట్లు, రాజకీయాల కోసం పచ్చని, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పాడుచేశారంటూ పబ్లిక్‌ టాక్‌ నడుస్తోంది. బలప్రదర్శన కోసం చేసిన ఈ పని ఎన్నికల్లో వైసిపి గట్టి దెబ్బ తగిలిస్తుందని కూడా చర్చ జరుగుతోంది. ఇటీవల నెల్లిమర్లలో జరిగిన సాధికార యాత్ర సందర్భంగా ఉదయం నుంచే చీపురుపల్లి రహదారిలో మొయిద జంక్షన్‌ వద్ద వాహనాలను స్తంభింపజేశారు. ఈ రోజు ప్రయాణికులు, వాహనదారుల అవస్థలు అన్నీ ఇన్నీ కావు. దాదాపు అన్ని సభలలోనూ జనాల్లో చర్చనడిచేందుకు అధికార పార్టీ ఇదే రకమైన వ్యూహం చేపట్టినట్టుగా జనం చెప్పుకుంటున్నారు. ఈ వ్యూహం వైసిపి పట్ల సానుకూలంగా ఉన్న జనాలను సైతం బాధించడం గమనార్హం. ట్రాఫిక్‌ అస్తవ్యస్తంగా మారడంతో జనాలు సకాలంలో ఇళ్లకు చేరుకోలేకపోయారు. ఇక బొబ్బిలి సాధికార యాత్ర సభ మధ్యలోనే జనాలు వెనుదిరగడంతో ఉమ్మడి జిల్లాలతో పాటూ సోషల్‌ మీడియా ద్వారా రాష్ట్ర మంత్రా చర్చ నడిచింది. ఇక జనాలు కేవలం సంబంధిత నియోజకవర్గాలకే పరిమితం కాలేదు. పక్కపక్క నియోజకర్గ జనాలు కూడా సభల్లో పాల్గొన్నారు. ఇటువంటివారిలో ఎక్కువ మంది రాజకీయాలపట్ల అంత ఆసక్తి లేనివారు, బొత్తిగా రాజకీయాలు లేనివారు కనిపించడం అనుమానాలకు తావిస్తోంది. అందుకు తగ్గట్టే జనం ఎక్కువగా వచ్చారనే భావన కలిగించడం కోసమూ, ఒక వేళ అనుకున్నంత జనం రాకపోతే ఫెయిలవుతామనే భయంతోనూ సంబంధిత ఎమ్మెల్యేలు ఇటువంటి జంబ్లింగ్‌ విధానం అనుసరించారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ సభల్లో కేవలం పథకాలు గురించి చెప్పడం, పార్టీ అధినేతను పొగడడం తప్ప, పరిష్కరించలేకపోయిన సమస్యల గురించి ఎక్కడా చర్చ జరగలేదు. వీటన్నింటికన్నా సభలకు హాజరైన మంత్రులు పాడిందే పాడినట్టు ప్రతిపక్ష పార్టీ, నాయకులను తిట్టడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని జనం చర్చించుకుంటున్నారు.

➡️