ఇప్పటి వరకు 28 మందికి షోకాజులు

Mar 27,2024 18:53

మాట్లాడుతున్న పల్నాడు జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా :
పల్నాడు జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చిన తరువాత ఎన్నికల కమిషన్‌ నిబంధనల ప్రకారం అన్నీ సవ్యంగా జరుగుతున్నట్లు జిల్లా ప్రధాన ఎన్నికల అధికారి, పల్నాడు జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌ తెలిపారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట కలెక్టరేట్‌లో బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ప్రజలకు ఎలాంటి అవాంతరాలూ ఎదురు కాకుండా పని చేస్తున్నామని, ప్రధానంగా ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతలు, అధికారులకు ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. ఎన్‌ కోర్‌, ఎం.సి.సి., సి.విజిల్‌, సువిధ యాప్‌, బోర్డర్‌ చెక్‌పోస్టు, ఇంటిగ్రేటెడ్‌ చెక్‌పోస్టు, అంతర్‌ జిల్లా చెక్‌పోస్టు, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ను మోడల్‌ కండక్ట్‌ కోడ్‌ ప్రకారం నియమించామన్నారు. ఏమైనా ఫిర్యాదులుంటే ఎలక్షన్‌ రిటర్నింగ్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ ఆఫీసర్స్‌ లేదా జిల్లా కలక్టర్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. మార్చి 16 ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ కార్యాలయాలు, పబ్లిక్‌ స్థలాలు, ప్రవేటు స్ధలాల్లో తొలగించాల్సిన రాజకీయ పార్టీల బొమ్మలు, పేర్లను తొలగించామన్నారు. మీడియా సర్టిఫికేషన్‌ మోనిటరింగ్‌ కమిటీ, మండల ప్రజా పరిషత్‌ అధికారులు, ఎలక్షన్‌ రిటర్నింగ్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ ఆఫీసర్స్‌ తగిన జాగ్రత్తలు తీసుకొని పని చేస్తున్నట్లు చెప్పారు. 3713 పోస్టర్లు 3 310 బ్యానర్లు, ఇతర పార్టీలకు సంబంధించి 5071 గోడరాతలు, బ్యానర్లు మొత్తం 12094 తొలగింపజేశామని తెలిపారు. రాజకీయ పార్టీల సమావేశాలు, సభల్లో ప్రభుత్వ అధికారులు, కాంట్రాక్ట్‌, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు, సచివాలయ సిబ్బంది పాల్గొనరాదని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే పల్నాడు జిల్లాలో 9 మంది వాలంటీర్లు, ఐదుగురు అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బంది, ఇద్దరు కాంట్రాక్ట్‌ సిబ్బంది, 12 మంది ప్రభుత్వ ఉద్యోగులుకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశామని వివరించారు. వారికి మెమో కానీ ఇంక్రిమెంట్‌ కానీ ఇవ్వడం, మొత్తం మీద 28 మంది మీద చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. సి విజిల్‌ యాప్‌లో లైవ్‌లో సమస్యను అప్‌లోడ్‌ చేస్తే దాని మీద 100 నిమిషాల్లో చర్యలు తీసుకుంటున్నామని, 398 కేసులను ప్రజలు సి.విజిల్‌ యాప్‌లో ఫిర్యాదు చేశారని తెలిపారు. ఫిర్యాలను పరిష్కారం 94 శాతంగా ఉందన్నారు. సువిధ, ఎన్‌ కోర్‌ లో ఫిర్యాదులు, పర్మిషన్లు 213 దరఖాస్తు వచ్చాయని, ఇందులో లౌడ్‌ స్పీకర్లు, సభలు, సమావేశాలు ఇస్తామని తెలిపారు. ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు అనుమతుల కోసం పై యాప్‌లో లేదా నేరుగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.ఎన్నికల నేపథ్యంలో నామినేషన్స్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చివరిగా ఎవరి నామినేషన్లు తీసుకోవాలి, ఎవరివి తీసుకోకూడదు వీటిపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తామన్నారు. ఎన్నికల సామగ్రి మొత్తం అందుబాటులో ఉందని, జెఎన్‌టియులో లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. నియోజకవర్గాల వారీగా స్టాంగ్‌రూమ్‌లను ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికలు పారదర్శంగా నిర్వహించడానికి అన్ని చర్యలూ తీసుకుంటునట్లు చెప్పారు. ఓటు హక్కు కోసం మార్చి 31లోపు దరఖాస్తు చేసుకున్న వారికీ అవకాశం కల్పిస్తామని, వారికి వచ్చే నెల 8 నుంచి 10 లోపు ఫామ్‌ 6 ద్వారా ఓటర్లుగా నమోదు చేస్తామని, ఫామ్‌ 8 ద్వారా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి మార్చుకోవడం ఎన్నికలకు 10 రోజులు ముందు కూడా అవకాశం ఉంటుందని వివరించారు.

➡️