ఇళ్ల లబ్ధిదారుల రుణాలకు వడ్డీ జమ

Jan 19,2024 00:56

గుంటూరు కలెక్టరేట్‌లో మాట్లాడుతున్న కలెక్టర్‌, తదితరులు

నరసరావుపేటలో లబ్ధిదార్లకు మెగా చెక్కును అందిస్తున్న పల్నాడు కలెక్టర్‌

ప్రజాశక్తి-గుంటూరు, పల్నాడు జిల్లా : పేదలందరికీ ఇళ్ల పథకం ద్వారా మంజూరు చేసిన ఇంటి స్థలాల్లో ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకొని ఇళ్ళను వేగవంతంగా నిర్మించుకొని, సొంత ఇంటికలను సాకారం చేసుకోవాలని గుంటూరు, పల్నాడు జిల్లాల కలెక్టర్లు ఎం.వేణుగోపాల్‌రెడ్డి, ఎల్‌.శివశంకర్‌ సూచించా రు. నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు లబ్ధిదారు లకు వడ్డీ రీయింబర్స్‌మెంట్‌ను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసే కార్యక్రమాన్ని గురువారం తాడేపల్లిలోని సిఎం క్యాంప్‌ కార్యాలయం నుండి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి బటన్‌ నొక్కి ప్రారంభించారు. కార్యక్రమంలో గుంటూరు కలెక్టరేట్‌ నుండి జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్‌ కత్తెర హెనీ క్రిస్టినా, సంయుక్త కలెక్టర్‌ జి.రాజకుమారి, గుంటూరు మేయర్‌ కావటి మనోహర నాయుడు, ఎమ్మెల్యే మద్దాలి గిరిధరరావు, రాష్ట్ర కుమ్మరి, శాలివాహన కార్పొరేషన్‌ ఛైర్మన్‌ మండేపూడి పురుషోత్తం, గృహ నిర్మాణ శాఖ ఈఈ శంకరరావు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలోని కలెక్టరేట్‌లో ఎస్‌ఆర్‌ శంకరన్‌ వీడియోకాన్ఫరెన్స్‌ హాలు నుండి కలెక్టర్‌ ఎల్‌.శివశకర్‌, జిల్లా గృహ నిర్మాణ శాఖాధికారి వేణుగోపాల్‌, లబ్ధిదార్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్లు మాట్లాడుతూ ఇళ్ల పథకంలో ఇళ్ళు మంజూరైన వారికి పీఎంఏవై ద్వారా రూ.1.80 లక్షలు అందించటంతోపాటు, స్వయం సహాయక సంఘాల ద్వారా రూ.35 వేలు రుణం పావలా వడ్డీకే అందించటం జరిగిందన్నారు. ఆయా రుణాలకు సంబంధించిన వడ్డీని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తూ లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తుందన్నారు. గుంటూరు జిల్లాలో స్వయం సహాయక సంఘాల్లోని 52,264 మందికి రూ184.13 కోట్లు రుణం మంజూరు చేయగా వాటిపై ఇప్పటి వరకు కట్టాల్సిన వడ్డీ రూ.1.70 కోట్లను 11,088 మంది లబ్ధిదారుల ఖాతాలకు నేరుగా జమ చేసినట్లు తెలిపారు. పల్నాడు జిల్లాలో 219 గృహాల నిర్మాణం మొదలు కాలేదని, బేస్మెంట్‌ లెవల్‌ క్రింద 12811 గృహాలు, బేస్మెంట్‌ లెవల్‌ వరకు 12005 గృహాలు, రూఫ్‌ లెవల్‌ వరకు 1818 గృహాలు, స్లాబ్‌ పూర్తి అయిననవి 2494 గృహాలు ఉన్నాయని వివరించారు. మొత్తం 39507 గృహాలకుగాను అన్ని పనులు పూర్తయినవి 10160గా చెప్పారు. వీటిల్లో బ్యాంక్‌ రుణాలు తీసుకొన్న వారు 13364 మంది కాగా వారికి వడ్డీ రీయింబర్స్‌మెంట్‌ కింద రూ.1.60 కోట్ల లబ్ధి చేకూరిందని తెలిపారు.

➡️