ఇవిఎంలో ఏ సమస్య వచ్చినా పరిష్కరించాలి

Mar 28,2024 22:34

మాట్లాడుతున్న కమిషనర్‌ కీర్తి
ప్రజాశక్తి – గుంటూరు :
ఎన్నికల్లో ఇవిఎంల వినియోగంపై ఎన్నికల విధులు కేటాయించబడిన అధికారులు సమగ్ర అవగాహన కలిగి ఉండాలని, అందుకు తగిన శిక్షణ అందిస్తామని నగర కమిషనర్‌, తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి (ఆర్‌ఓ) కీర్తి చేకూరి చెప్పారు. ఇవిఎంల నిర్వహణపై డెమో ఇవిఎంల ద్వారా నగరపాలక సంస్థ కౌన్సిల్‌ సమావేశ మందిరంలో సెక్టోరల్‌, రూట్‌ అధికారులు, ఇంజినీరింగ్‌ అధికారులకు గురువారం శిక్షణిచ్చారు. కమిషనర్‌ మాట్లాడుతూ మాస్టర్‌ ట్రైనర్ల ద్వారా జిఎంసి కౌన్సిల్‌ సమావేశ మందిరంలో ప్రత్యేక శిక్షణ అందిస్తామని తెలిపారు. ఎన్నికల రోజు ఇవిఎంల్లో ఏ సమస్య ఎదురైనా తక్షణం పరిష్కారించేలా శిక్షణ పొందాలని, జిఎంసి ఇంజినీరింగ్‌ అధికారులు కూడా తగిన శిక్షణ తీసుకోవాలని చెప్పారు. ఎన్నికల విధులు కేటాయించబడిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఇవిఎంల పనితీరుతో పాటుగా ఎన్నికల నిర్వహణలో అవసరమయ్యే పిఒ డైరీ, 17సి, వివిధ రకాల ఫారాల గూర్చి సమగ్రంగా తెలుసుకోవాలని సూచించారు. సెక్టోరల్‌, రూట్‌ అధికారులకు క్షేత్ర స్థాయిలో పోలింగ్‌ కేంద్రాల్లో మౌలిక వసతులు, పోలింగ్‌ రోజు బ్యారీగేట్లను ఇంజినీరింగ్‌ అధికారులు ఏర్పాటు చేస్తారని, పోలింగ్‌ కేంద్రం పరిధిలో ఓట్ల వివరాలపై బిఎల్‌ఓలు సహకరిస్తారని వివరించారు. ఎన్నికల సరళిలో చిన్నపొరపాటుకైనా తావివ్వొద్దని, విధుల్లో నిర్లక్ష్యంగా ఉంటే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. శిక్షణలో ఉఆర్‌ఒలు సునీల్‌, భీమరాజు, సెక్టోరల్‌ అధికారి శ్రీధర్‌, మేనేజర్‌ ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌, సెక్టోరల్‌, రూట్‌ అధికారులు, ఇంజినీరింగ్‌ అధికారులు పాల్గొన్నారు.
గుంటూరుకు తిరిగి రానున్న 100 ఇవిఎంలు
ఎన్నికల సంఘం గుంటూరు నగరపాలక సంస్థకు కేటాయించిన ఇవిఎంల్లో కొన్నింటిని గతేడాది పల్నాడు, బాపట్ల జిల్లాలకు ఇచ్చామని, ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో గుంటూరుకు అవసరమున్నందున వాటిని తిరిగి ఆయా జిల్లా అధికారులు శనివారం అందించనున్నారని నగర కమిషనర్‌, తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి (ఆర్‌ఓ) కీర్తి చేకూరి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గతేడాది మేలో రాష్ట్ర ఎన్నికల సంఘం, గుంటూరు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ అనుమతితో ఇవిఎంల్లో 100 పర్చూరు మండలానికి అక్కడ జెడ్‌పిటిసి ఎన్నికల అవసరాల కోసం ఇచ్చామని తెలిపారు. కేటాయించిన 100 ఇవిఎంలు వారికి ప్రస్తుతం అవసరం లేనందున వాటిని తిరిగి గుంటూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌కు ఇవ్వడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం అమోదించిన దృష్ట్యా వాటిని శనివారం గుంటూరు మున్సిపల్‌ పరిధిలో గల ఇవిఎంల గోడౌన్‌ నందు భద్రపరుచుటకు గుర్తింపు పొందిన రాష్ట్ర, జాతీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

➡️