ఇసుక మాఫియా బరితెగింపు

Mar 29,2024 23:33

ప్రజాశక్తి – తెనాలి : గుంటూరు జిల్లా కొల్లిపర మండలం మున్నంగి ఇసుక రీచ్‌లో ఇసుక మాఫియా బరితెగించింది. ఇసుక తవ్వకాలు ఆపేయాలని గ్రామస్థులు అడ్డుకోవటంతో ఆగ్రహించిన వైకాపా నేతలు గ్రామస్థులపై దాడిచేయడమే కాకుండా ద్విచక్ర వాహనాలను ట్రాక్టరుతో తొక్కించి ధ్వంసం చేశారని బాధిత కుటుంబాలు వాపోతున్నాయి. స్థానికుల వివరాల ప్రకారం.. మున్నంగి ఇసుక రీచ్‌లో ఇసుక అక్రమ తవ్వకాలు ఇదేచ్ఛగా కొనసాగుతున్నాయి. భూగర్భజలాలు అడుగంటి, బోరుబావులు ఎండిపోతున్న కారణంగా ఇసుక తవ్వకాలను అడ్డుకోవాలని గ్రామస్థులు నిర్ణయించారు. గ్రామానికి చెందిన వైసిపి నేతలు ట్రాక్టర్లలో ఇసుక తరలిస్తుండగా శుక్రవారం రాత్రి గ్రామంలోని కొందరు ఆ ట్రాక్టర్లను అడ్డుకున్నారు. దీంతో ఇసుక మాఫియా ఆగ్రహించింది. అడ్డుగా వచ్చిన వారిపై దాడిచేశారు. వారి ద్విచక్ర వాహనాలను ట్రాక్టర్తో ఢకొీట్టి ధ్వంసం చేశారు. ఈ ఘటనలో గ్రామానికి చెందిన వి.బాలరాజు, వి.అశోక్‌, కె.మహేష్‌, వి.మహేష్‌, మోజెస్‌ తదితరులకు గాయపడినట్లు తెలిసింది. వారిని స్థానికులు తెనాలి జిల్లా వైద్యశాలకు తరలించారు. ఘటనకు బాధ్యులైన ఇరు వర్గాలను పోలీసులు ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. ఇసుక మాఫియాను అధికారులు అడ్డుకోకపోగా, అడ్డుకున్న స్థానికులపై వైసిపి నాయకులు దాడులకు పాల్పడటం ఏమిటని బాధితులు ప్రశ్నిస్తున్నారు. ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయోనని బాధిత కుటుంబాలు తీవ్ర ఆందోళనలో ఉన్నాయి. ఇదిలా ఉండగా ఆసుపత్రిలో చేరిన వారు కూడా మీడియాతో మాట్లాడటానికి గాని, సమాచారం ఇవ్వడానికి కానీ భయపడుతున్నారు.

➡️