ఈనెల రెండో వారంలో ఉప్పు సత్యాగ్రహం చిత్రం విడుదల

Dec 2,2023 20:04

 ప్రజాశక్తి-విజయనగరం కోట  :  జనం ఎంటర్‌ప్రైజెస్‌ పతాకంపై నిర్మాణం జరిగిన ఉప్పు సత్యాగ్రహం చిత్రాన్ని అంతా చూసి విజయవంతం చేయాలని సినిమా దర్శకులు, రచయిత పి. సత్యారెడ్డి కోరారు. చిత్ర ప్రచార కార్యక్రమం కోసం చిత్ర బృందం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోను బస్సుయాత్ర ద్వారా పర్యటిస్తోంది. అందులో భాగంగా శనివారం విజయనగరం చేరుకున్నారు. ఈ సందర్భంగా కోట జంక్షన్‌ వద్ద ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. విశాఖ ఉక్కు ఎందరో మహానుభావుల ప్రాణ త్యాగాలతో ఏర్పాటైందని, అటువంటి పరిశ్రమను ప్రైవేటీకరణ చేస్తే ఆంధ్రప్రదేశ్‌ నష్టపోతుందని అన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమను రక్షించుకునే లక్ష్యంతోనే ఈ చిత్రాన్ని నిర్మించామని అన్నారు. ప్రముఖ ప్రజా గాయకుడు గద్దర్‌ చివరిసారిగా ఈ చిత్రంలో నటించారని, కొన్ని పాటలు రాశారని తెలిపారు. విశాఖ ఎంపి ఎంవివి సత్యనారాయణ తదితర ప్రముఖులు ఈ చిత్రంలో నటించారన్నారు ఈ సినిమాను డిసెంబర్‌ రెండవ వారంలో విడుదల చేస్తామని, ప్రజల కోసం తీసిన ఈ సినిమాను ప్రతి ఒక్కరూ చూసి విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో చిత్ర బృందం సభ్యులు పాల్గొన్నారు.

➡️